Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

వేడిగాలులు ఆర్థికవ్యవస్థకు ముప్పు

జ్ఞాన్‌ పాఠక్‌

దేశంలో ఈ సంవత్సరం ప్రారంభంలోనే అనేక ప్రాంతాల్లో వర్షాలు తగ్గి ఇప్పటికే వేడి వాతావరణం నెల కొంది. వేడిగాలులు దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం కలిగిస్తాయి. వేడిగాలులు ఆర్థిక వ్యవస్థకు ముప్పు. మార్చిలో సాధారణ వర్షపాతం 83-117 శాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) అంచనా వేసింది. అయితే ఇది దేశ ప్రజలను, కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మానసికంగా కాస్త ఊరట కలిగించే అంశమైనప్పటికీ వర్షÛపాతం తక్కువ నమోదుకావడం పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. తద్వారా దేశ జాతీయోత్పత్తి గణనీయంగా క్షీణించే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి 1 నుండి ఫిబ్రవరి 27 వరకు దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దేశం మొత్తం మీద వర్షపాతం సాధారణం కంటే 60శాతం తక్కువగా నమోదైంది. ముఖ్యంగా మధ్య భారతదేశంలో (-87 శాతం), దక్షిణాది రాష్ట్రాల్లో (-60 శాతం), తూర్పు ఈశాన్య ప్రాంతంలో(-55 శాతం), వాయవ్య ప్రాంతంలో (-29 శాతం) లోటుతో వర్షపాతం నమోదైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మార్చిలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ, ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో సంభవించే నష్టాలను భర్తీ చేయలేమని కేంద్రం నిర్ధారించింది. ముందస్తు ఆరోగ్య హెచ్చరికలు, పర్యావరణ పర్యవేక్షణ కోసం తగిన యంత్రాంగాన్ని ప్రకటించడం వల్లనే జరిగిన నష్టాలను భర్తీ చేయడం సాధ్యంకాదు. నష్టాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
దేశంలోని వాయవ్యప్రాంతం, తూర్పు, ఈశాన్యంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువవర్షపాతం నమోదైంది. మార్చి 5 నాటికి, గుజరాత్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే 3-5 శాతం అధికంగా 35-38డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. కోస్తా కర్ణాటకలో 5-6 సెంటీగ్రేడ్‌ పెరిగి 3940డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యే అవకాశం ఉంది. పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, దిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, ఉత్తర రాజస్థాన్‌లో 24 డిగ్రీల సెల్సియస్‌ పెరిగి 27-30 డిగ్రీలు నమోదయ్యే అవకాశంఉంది. దీన్నిబట్టి చూస్తే దేశం మొత్తం మీద ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో ఈ ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో సైతం 30శాతం వరకు నష్టపోయే అవకాశం ఉందని హార్టికల్చర్‌ విభాగం హెచ్చరించింది. గోధుమలు, నూనెగింజలు వంటి శీతాకాలపు పంటలు, ఇతర పంటల ఉత్పత్తి 20శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ రీసెర్చ్‌ దేశంలోని వివిధ ప్రాంతాలలో పండ్లు, కూరగాయల పంటలు 10-30 శాతం వరకు నష్టపోయే అవకాశం ఉందని సూచించింది. మామిడి, లిచీ, నిమ్మ, నారింజ, అరటి, పుచ్చకాయలు, అవకడో వంటి నిమ్మజాతి పంటలు ఇప్పటికే భారీగా దెబ్బతిన్నాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌లు, ఆకు కూరలు, టమాటా తదితర కూరగాయలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహారాష్ట్ర వంటి కొన్ని ప్రాంతాలలో మామిడి సాగుదారులు 40 శాతం వరకు నష్టపోయే అవకాశంఉందని అంచనా వేసింది.
అయితే మార్చి-మే నెలల్లో వేడిగాలులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. 2022 మార్చి-ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో నమోదై నంత వేడి ఉండదని తెలిపింది. గత సంవత్సరపు ఉష్ణోగ్రతలు పునరావృతం కానప్పటికీ, అప్పటి నష్టం ఇప్పటకీ కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. గత సంవత్సరం కంటే. 2020, మార్చిలో నమోదైన అత్యంత వేడి ఉష్ణోగ్రత లతో గోధుమ ఉత్పత్తి 100 మిలియన్‌ టన్నులకు తగ్గింది. స్థానికంగా గోధుమల వినియోగం సరాసరిన 103.6 మిలియన్‌ టన్నులు ఉంటుంది. ఉత్పత్తి తగ్గడంతో మేలో ఎగుమతులను ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది గోధుమల ఉత్పత్తి 112.2 మిలియన్‌ టన్నుల ఉండవచ్చునని అంచనా. అయితే ఇది అసాధ్యం. ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉంటే, ఉత్పత్తి 15-20 శాతం దెబ్బతింటుంది. ఇది ఆందోళన కలిగించే అంశం. పర్యవసానంగా పంజాబ్‌ రైతులు గోధుమల దిగుమతులకు డిమాండ్‌ చేస్తున్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ గోధుమ రైతుల పంట నష్టానికి గాను తగిన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది.
ఈ సంవత్సరం వేడిగాలులు గతసంవత్సరం కంటే ఒకనెల ముందుగానే ఫిబ్రవరిలో నమోదయ్యాయి ఇది 2019 నాటి రికార్డును బ్రేక్‌ చేసింది. దేశ సగటు ఉష్ణోగ్రతలు 29.5 డిగ్రీల సెల్సియస్‌. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే దాదాపు 2 డిగ్రీలు ఎక్కువ. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో దేశంలో అత్యంతతీవ్రస్థాయిలో వేడిగాలులు ఎదుర్కొన్నాం. గడచిన 120 సంవత్సరాల్లో 2022, మార్చిలో అత్యంత వేడిగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 8 డిగ్రీల వరకు పెరిగింది. దేశంలో 2022 సంవత్సరంలో 200 రోజుల పాటు అత్యంత వేడిగాలులు ఎదుర్కొన్నాం. ఇది గత సంవత్సరం కంటే ఐదురెట్లు ఎక్కువగా నమోదైంది. ఎన్‌ఓఏఏ ఈ ఏడాది జూన్‌-డిసెంబర్‌ మధ్యలో 55-60 శాతం అధికంగా ఎల్‌నినో (వేడిగాలులతో ఉష్ణోగ్రతలు పెరగడం)వంటి వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది దేశంలోని ఖరీఫ్‌ పంటలపైనే కాకుండా, అధిక వర్షాభావ పరిస్థితుల కారణంగా రబీ పంటపై కూడా ప్రభావం చూపుతుంది.
ఈ నేపధ్యంలో దేశంలో ఆహార ధరలు, ద్రవ్యోల్బణం మరింతగా పెరిగే అవకాశం ఉంది. 2023-24 ఆర్థికసంవత్సరంలో గింజలధరలు ఎక్కువగానే ఉంటాయని ఈ నివేదిక తెలిపింది. దేశంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో విద్యుత్‌ డిమాండ్‌ 20-30 శాతానికి పెరగనుంది తత్ఫలితంగా విద్యుత్‌ సంక్షోభానికి దారితీసే అవకాశంఉంది. దేశంలో 75 శాతం మంది కార్మికులే. వీరిపై ఈ వేడిమి ప్రభావం అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. 2030 నాటికి మనదేశంలో 34 మిలియన్ల ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్‌ నివేదిక ఇప్పటికే అంచనా వేసింది. దీనితో నిరుద్యోగ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. మరోపక్క దేశంలో ఆరోగ్యం తీవ్రమైన సమస్యగా ఉంది. సరైన నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ విధానాల ద్వారా ప్రజలను సంరక్షించాల్సిన అవసరం ప్రభుత్వంపైనే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img