Friday, April 19, 2024
Friday, April 19, 2024

వైజాగ్‌ స్టీల్‌ ప్రభుత్వరంగంలోనే ఎందుకుండాలి ?

ప్రొఫెసర్‌ కే.ఎస్‌. చలం

అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కుఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలోనే ఎందుకుండాలి? ప్రైవేటురంగంలో ఎందుకు ఉండకూడదని వివరించవలసిన అవసరం ఎంతైనాఉంది. ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా పూనుకోవాలి. సామ్యవాద దేశాలతో బాటు మిశ్రమ పెట్టుబడిదారి దేశాలు కూడా ప్రజలకు కావలసిన సౌకర్యాలను అభివృద్ధి పరచేందుకు గతంలో అంటే 1950లలో యిచ్చేందుకు ప్రభుత్వరంగాన్నే ఎంచుకున్నాయి. ఈ ఏర్పాటు అమెరికా అనుకూల పెట్టుబడి దారిదేశాలు, వారికి వత్తాసు పలికే మేధావివర్గం చూస్తూ కూర్చోలేదు. అందరూ సమానమైతే, అన్ని దేశాలు ఒకేలా అభివృద్ధిని సాధిస్తే పెట్టుబడులు పెట్టేవారు, తెలివితేటలు వున్న జ్ఞానవంతులు ఒకటైపోయి అందరికి అన్నీ సమకూరిస్తే ఎలా? అని భావించాయి. మరో పక్క అందరూ సమానమనే సిద్ధాంతంతో రష్యా, చైనాలు ముందుకు దూసుకుపోతున్నాయి. అది కొనసాగితే ప్రపంచానికి ముసలం పట్టుకుంటుంది అని చెప్పే మేధావులు, స్వార్ధపరులు ప్రచ్ఛన్న యుద్ధానికి తయారయ్యారు. అది మనిషి స్వార్ధాన్ని, వ్యక్తి చింతనను, స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛ పేరుతొ సమీకరించటం మొదలుపెట్టారు. వారి అంతిమ లక్ష్యం సామ్యవాదం, అందరు సామానమనే ధోరణిని అంతం చెయ్యటం. అనేక కారణాల వలన 1989 నాటికి దాన్ని సాధించారు. ఆ పరిస్థితిని ఎదిరించే అంతర్జాతీయ వేదిక ఇప్పటికీ లేదు.
సామ్యవాదాన్ని నాశనం చేసేందుకు రహస్యంగా జరిగిన వ్యవహారాలను ప్రొఫెసర్‌ నాన్సీ మెక్లీన్‌ తన ‘డెమోక్రసీ ఇన్‌ చైన్స్‌’ అన్న పుస్తకంలో ఐదేళ్ళ క్రితం ప్రచురించి పెద్ద సంచలనం సృష్టించారు. అమెరికాలో ఇప్పుడు అది పెద్ద మేధావుల చర్చకు దారితీసింది. ఆమె పరిశోధన ద్వారా వెలుగుచూసిన అంశం మనకు ఇప్పుడు అవసరం. ప్రభుత్వరంగం నిరర్ధకం, ప్రజా స్వామ్యంలో ప్రభుత్వరంగం అవినీతిమయం. అందుకు కారణమైన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం డబ్బు పోగేసు కునేందుకు ప్రభుత్వాన్ని వాడుకుంటారు. ఇది పోవాలంటే ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించాలి. చిన్న ప్రభుత్వం చింతలు లేని ప్రభుత్వం అంటే ‘తక్కువ ప్రభుత్వం ఎక్కువ పాలన’ అనే నేటి మన కేంద్ర ప్రభుత్వ విధానానికి కావలసిన భూమిక అమెరికా నుండే తీసుకున్నారు. దీని వెనుక సుమారు అర్థశతాబ్దంపాటు అనేక వ్యవహారాలు నడిచాయి. ముఖ్యంగా ఆర్ధికశాస్త్రంలో 1986లో నోబెల్‌ బహుమతి పొందిన జేమ్స్‌ బుకానన్‌ అన్న పరిశోధకుని గ్రంధాలు, వ్యాసాలు విపరీతమైన ప్రచారం కల్పించటంతోబాటు ఆ అభిప్రాయాలు కలిగిన వారిని ప్రపంచబ్యాంకు నిర్వాహకులుగా, ఆర్థికశాస్త్ర వేత్తలుగా ప్రోత్సహించారు. మనదేశానికి చెందిన చాలామంది యిందులో వున్నారు. దీన్నంతటిని నిర్వహించింది చార్లెస్‌ కోచ్‌ అనే కార్పోరెట్‌ పెట్టుబడిదారి సంస్థ. వారు ప్రపంచంలో 14వ అతి పెద్ద సంపన్న వ్యాపార కుటుంబం. వీరు పరిశోధనలను ప్రోత్సహించే ఆర్థికమద్దతు అందించారు. దాని పర్యవసానమే గత కొన్ని దశాబ్దాలుగా అనేకమంది మేధావుల ప్రచురణలు, అంతర్జాతీయ సదస్సులు, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల్లో కార్పొరేట్‌ ప్రచురణ సంస్థలు, మీడియా ద్వారా వీరి భావాలను ఆలోచనలకు ప్రచారం కల్పించారు అని నాన్సీ మెక్‌లీన్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఇది ఇప్పుడు మనకెందుకు అవసర మైందంటే.. ఇటువంటి సిద్ధాంతాలను ప్రోత్సహించే నేటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ పరిశ్రమలు ఒద్దు అని దానికి కావలసిన సిద్ధాంతాలను ఆర్థిక శాస్త్రవేత్తలైన గుజరాత్‌కు చెందిన కొలంబియా విశ్వవిద్యాలయ జగదీశ్‌ భగవతి, పనగారియ యింకా అనేక మంది సిద్ధాంత వెలుగులోనే ప్రభుత్వం ఒక్కటొక్కటిగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పచెబుతోంది. అందులో భాగంగానే వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ. కార్మికులు, తెలుగు ప్రజలు ఎంత గింజుకున్న వెనక్కు తగ్గేదిలేదు అంటున్నారు. అందుకు అనేక నాటకాలు జరుగుతున్నాయి. ఈ నాటకాల్లో పెద్దపెద్ద పాత్రదారులు ప్రైవేటుకు అప్పగించేందుకు తొందరపెడుతున్నారు. ప్రజలనుండి సేకరించి ప్రైవేటుగా ఎలా కొంటారో ఎటువంటి సంస్థలను నెలకొల్పుతారో సూటుకేసు కంపెనీల గూర్చి తెలిసిన వ్యక్తులు విశాఖ ప్రజలను వెర్రి వాళ్ళను చెయ్యాలనుకొని ప్రచారం చేసుకుంటున్నారు. ఇటువంటి సూటుకేసు కంపెనీలు అంటే దొంగ కంపెనీలు సృష్టించే అదాని లక్షల కోట్లు దోచాడు అనేది హిండెన్‌బెర్గ్‌ నివేదిక ఆరోపణ. మరి అదే విధానాన్ని కొంతమంది అనుసరించి వైజాగ్‌స్టీల్‌ ప్రభుత్వ రంగంలో లేకుండా ప్రైవేటుపరం చేయటానికి కావలసిన నాటకీయతను కల్పిస్తున్నారు. ఇది ప్రజా వ్యతిరేకం, తెలుగు ప్రజల మనోభావాలకే కాదు గత రెండు సంవత్సరాలుగా టెంట్‌ వేసుకు కూర్చున్న కార్మికులకు ద్రోహం. విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలను మరీ వెర్రి వాళ్ళను చేసే కుట్ర అనవచ్చేమో !
మరి ఆనాటి నెహ్రూ ప్రభుత్వమే కాదు, నేటి పెట్టుబడిదారి దేశాల్లో కూడా ప్రభుత్వరంగ సంస్థలు ఎందుకు వున్నాయి. మన దేశంలో ఇప్పుడే కాదు, భవిష్యత్‌లో కూడా రాజ్యాంగం వున్నంతకాలం ప్రభుత్వ రంగంలోనే వైజాగ్‌ స్టీల్‌ ఎందుకు వుండాలి, తెలుసుకుందాం. భారత రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం చేర్చటం మూలంగానే కాదు. ఆదేశిక సూత్రాల లో వున్న 38, 39 ప్రకారం ప్రభుత్వం చేయవలసిన భాధ్యత అంతే కాదు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ నిర్మాణ సభకు సమర్పించిన ‘స్టేట్స్‌ అండ్‌ మైనార్టీస్‌’ అన్న మెమొరాండంలో దేశ ప్రధాన ఆర్థికరంగం వ్యవసాయంసహా ప్రభుత్వంలోనే వుండాలన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రు 1948, 1956 నాటి పారిశ్రామిక విధానాల్లో ప్రభుత్వరంగానికి మొదట పీట వేయటమే కాకుండా నాటి సోవియట్‌ సహకారంతో అనేక పరిశ్రమలు ప్రభుత్వరంగంలో నెలకొల్పారు. ఇందిరా గాంధీ కాలంలో సోవియట్‌ సహకారంతో వైజాగ్‌ స్టీల్‌ను నెలకొల్పారు. ఈ ఆర్థికవ్యూహంలో సామ్యవాద లక్ష్యాలతోబాటు మన దేశంలో సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడి వున్న దళిత, ఆదివాసి, బిసి ప్రజలకు ప్రభుత్వరంగ వ్యవస్థలో రిజర్వేషన్‌లు కల్పించవలసిన రాజ్యాంగ ధర్మం ప్రభుత్వంపై వుంది. ఇది పరిశ్రమలు, ఉద్యోగ కల్పితరంగాలు ప్రభుత్వ అధీనంలో ఉంటేనే సాధ్యపడుతుంది. ఒకవేళ ప్రైవేటు రంగాల్లో కూడా ఉద్యోగాలు వుంటాయి గదా అని ప్రచారంచేస్తూ టెండర్లు వేస్తున్న పెద్ద మనుషులు రిజర్వేషన్స్‌ యిస్తాం అని చెప్పగలరా? ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయగలరా? రిజర్వేషన్‌వర్గాలు ఆరోపిస్తున్నట్లు ఈ ప్రైవేటు డ్రామా అంతా ఈ వర్గాలను తొలగించటానికి అన్న విషయాన్ని వీరు ఎక్కడైనా ఖండిరచారా!
ప్రభుత్వ రంగాన్ని, అందులో వైజాగ్‌ స్టీల్‌ను కాపాడుకోవాలంటే రాజకీయ ఎజెండా కావాలి. ప్రజలు అదే ఓటర్లు దీన్ని గ్రహిస్తే, వారిని చైతన్యపరిస్తే అమరావతి, దిల్లి గద్దెల కలలు చెదురుతాయి. అప్పుడు గదా విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు అని తెలిసి వస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img