Friday, April 19, 2024
Friday, April 19, 2024

వ్యవస్థీకృతమవుతున్న ఆర్థికదోపిడి

స్వాతంత్య్రానంతరం జాతిని అభివృద్ధిపథంలో నడపటానికి నెహ్రూ సోషలిజం మీద అభిమానంతో మిశ్రమ ఆర్ధిక విధానంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను బలోపేతంచేసే చర్యలు చేపట్టారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, బ్యాంకుల జాతీయీకరణ, భూ సంస్కరణలు, రాజభరణాల రద్దు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వరంగంలో పరిశ్రమలు ఏర్పాటుచేశారు. 2008లో ప్రపంచమంతటా ఆర్ధికమాంద్యం ఏర్పడిరది. అయినా మన ఆర్ధికవ్యవస్థ పునాది పదిలంగాఉండి మనల్ని కాపాడిరది. అప్పుడు ఆదుకున్నది ప్రభుత్వరంగమే. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 1990నుండి దేశంలో ప్రపంచీకరణ మొదలైంది. 1991నాటి నూతన ఆర్ధిక విధానాలు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాయి. వాజ్‌పేయ్‌ హయాంలో అయితే ప్రభుత్వ రంగసంస్థలనుంచి పెట్టుబడులు ఉపసంహరణకు ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేశారు. అప్పటి నుండి నేటి వరకు నిరాటంకంగా మొత్తం ప్రభుత్వ రంగంలోని సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు. ఇందులో భాగమే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించటం. అంటే ఈ మొత్తం ప్రజల సంపదను అదాని, అంబాని లాంటి బడా ధనవంతులకు అప్పచెబుతున్నారు. తద్వారా రాజ్యాంగం కల్పించిన ప్రజలు జీవించే హక్కును(ఆర్టికల్‌ 21) హరించి వేస్తున్నారు. సంపద కొద్దిమంది చేతులలో పోగుబడిరది. పేద, ధనిక అంతరాలు బాగా పెరిగిపోయాయి. ఒక శాతం సంపన్నుల చేతుల్లో 40శాతం సంపద పోగుపడిరది. సగం జనాభా చేతిలో 3శాతం సంపద మాత్రమే ఉంది. కరోనా సంక్షోభంలో లాభపడ్డ కార్పొరేట్ల సంపద 121శాతం పెరిగిందని ఆక్స్‌ఫాం నివేదిక వెల్లడిరచింది. ప్రపంచ కుబేరుల జాబితాలో మన దేశీయులు 55 మంది చేరారు. ప్రపంచంలోని వెయ్యిమంది టాప్‌ బిలియన్ల ఆస్తుల్లో భారత ధనవంతుల వాటాశాతం అంటే వీరి ఉత్పత్తి కన్నా ఆస్తి విలువ ఎక్కువగా ఉంది. ఇది చాలని దేశవిదేశి కార్పోరేట్లు అప్పటి (2014) కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మసకబార్చి, తమ గుప్పెట్లో ఉన్న ప్రచార సాధనాల ద్వారా మోదీని ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆకాశానికి ఎత్తుతూ ప్రచారం చేశారు. బీజేపీ అధికారంలోకి రావటానికి కావాల్సిన పెట్టుబడి, సకల సౌకర్యాలు కల్పించి అధికారంలోకి తెచ్చారు. అప్పటి నుండి మోదీ సంపన్నుల సేవలో మునిగి పోయాడు. ఇక్కడ గుర్తించాల్సింది ఈ మతోన్మాద పార్టీ దేశ, విదేశీ కార్పోరేట్లతో జత కట్టింది. పైకి దేశభక్తి, జాతీయవాదం, గోరక్షణ, అయోధ్య, మధుర, జై శ్రీరామ్‌, భారతమాతకు జై, హిందూమతం ప్రమాదంలో ఉంది అంటూ వీరి దోపిడి అమాయక ప్రజలకు అర్థంకాకుండా ప్రజల ఆలోచనలను పక్కదారులు పట్టిస్తున్నది. హిందు ప్రజల మెదడును ట్యాంపరింగ్‌ చేస్తూ ఉంది. ఓట్లు దండుకుంటుంది. స్వాతంత్య్రానంతరం నిర్మించుకున్న అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. చివరకు స్వాతంత్య్ర న్యాయవ్యవస్థ మీద కూడా దాడిచేస్తూ ఉంది. ప్రశ్నించే ప్రగతిశీలక గొంతులను చిదిమేస్తూ, వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి జైళ్లలో నిర్బందిస్తూ ఉంది. ఇదంతా జాతీయోద్యోమంలో పాల్గొననివారు, భిన్నత్వంలో ఏకత్వంగల భారతీయ సంస్కృతి తెలియని వారు, త్రివర్ణ పతాకం గౌరవించనివారు చేస్తున్న నిర్వాకం.
ఈ స్థితిలో పెట్టుబడిదారి ఆర్థికసంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. పెట్టుబడిదారి దేశాల్లో ఆకలి కేకలు, నిరుద్యోగం ప్రబలింది. ఆర్ధిక అసమానతలు పెరిగాయి. భారతదేశ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీలేదు. కరోనామొత్తం మన ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసింది. గత 9 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారత జీడీపీ 4.2 శాతానికి పడిపోయింది. నిరుద్యోగుల సంఖ్య ఐదు కోట్లకు పైగా చేరుకుంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 7శాతానికి పైగా నమోదైంది. పారిశ్రామికఉత్పత్తి సూచి గతంతో పోలిస్తే 4శాతం తక్కువగా ఉంది. అవినీతి పెరిగిపోయింది. ఇదే సమయంలో ప్రజలు తమ జీవితమంతా కష్టపడి కూడబెట్టుకొన్న సొమ్ము విత్తసంస్థల్లో దాచుకున్నారు. దీనిని అదానిలాంటి బడాబాబులు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టడంతో మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలేస్థితి దాపురించింది. ఈ ధనికులు గతంలో అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన రూ.9లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం రద్దుచేసింది. దీని నుంచి బయటపడటానికి ప్రజలమీద పన్నుల భారం మోపింది. దీంతో సామాన్యుల బతుకు దుర్బరమైంది. ఈ స్థితిలో అదాని గ్రూపు కంపెనీల బండారాన్ని అమెరికా హిండెన్‌బర్గ్‌ పరిశోధన సంస్థ బైట పెట్టింది. అదాని కంపెనీల వాటా ధరలను 85 శాతం ఎక్కువచేసి చూపి కోట్లు గడిరచారని, తమ వద్దతగిన ఆధారాలుఉన్నాయన్న సమాచారంతో పాటు అదాని మోసాలపై 88 ప్రశ్నలు సంధిస్తూ, 106 పేజీల నివేదికను వెల్లడిరచింది. దీంతో అదాని గ్రూపు హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు భారత దేశం మీద దాడిగా పేర్కొనిఆశ్చర్యం కలిగించింది. ఇక బీజేపీ సన్నిహితవర్గాలు దేశాన్ని బలహీన పర్చటానికి కుట్ర జరుగుతోందని అంటూ జాతీయ వాద ముసుగు కప్పారు. అప్పటినుంచి అదాని గ్రూపు కంపెనీల వాటాలు షేర్‌మార్కెట్లో పతనం అవుతున్నాయి.
ఈ కంపెనీలలో పెట్టుబడిపెట్టినవారు తీవ్రంగా నష్టపోయారు. బాగా నష్టపోయింది జీవితబీమా సంస్థ(ఎల్‌ఐసీ) వాటా మరీ పెద్దది. ఈ సంస్థ దాదాపు రూ.18వేల కోట్లు నష్టపోయింది. బ్యాంకులు ముఖ్యంగా ఎస్‌బీఐ అదే వరుసలో ఉన్నాయి. రూ.80వేల కోట్లకు పైగా రుణాలిచ్చిన బ్యాంకులు నిండా మునిగాయి. అంతిమంగా ఈ డబ్బు అంతా ప్రజలసొమ్మే. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ కార్పోరేట్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద మోసం. వ్యవస్థీ కృత ఆర్థికదోపిడి జరిగితే మోదీ ప్రభుత్వం చలించలేదు. గత 9ఏళ్లుగా ఆయనచేస్తున్న పని ఇదే. ఈ అంశంపై ఒక సమగ్రదర్యాప్తు జరిపి, నిజాలునిగ్గుతేల్చి దోషులను శిక్షించాలి. ప్రజలసొమ్ముకు గ్యారంటీఇవ్వడం మోదీ ప్రభుత్వ కనీస బాధ్యత. లేకుంటే ప్రజాకోర్టులో దోషిగా నిలబడవలసి వస్తుంది. బీజేపీ, మోదీ-అదానికి మధ్య సన్నిహిత సంబంధాలు అందరికి తెలిసినవే. అదాని కంపెనీలకు ఎస్‌బీఐ రుణాలు ఇవ్వడం. ఎల్‌ఐసీ పెద్దమొత్తంలో వాటాలు కొనడం వెనుక బీజేపీ పెద్దలహస్తం ఉండదన్నది వాస్తవం. 2014లో అదాని సంపదవిలువ 8బిలియన్‌ డాలర్లు కాగా, 2022లో అది 137 బిలియన్‌డాలర్లకు(1600శాతం) పెరిగి, ప్రపంచసంపన్నుల్లో మూడవస్థానానికి ఎగబాకాడు. ముఖ్యంగా 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక గుజరాత్‌కు చెందిన అదాని సకల వ్యాపార, పారిశ్రామిక రంగాలతో పాటు దేశంలో సహజవనరులపై ఆధిపత్యం సంపాదించాడు. అతికొద్ది కాలంలోనే దేశంలో అతి సంపన్నుడైన ముఖేష్‌ అంబాని సంపదనుదాటి పైకి చేరుకున్నాడు. హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదాని వ్యాపార సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. దేశీయంగా ముంబాయి స్టాక్‌ ఎక్స్చ్‌ంజ్లో అదాని అగ్రగామి కంపెనీల వాటాలు 1106 పాయింట్ల మేర పడిపోయాయి. దీని ప్రభావంతో విత్తకంపెనీలు, బ్యాంకింగ్‌, చమురు, సమాచార, సాంకేతిక కంపెనీలు నష్టాలు చవిచూశాయి. కరోనా సృష్టించిన ఆర్ధికనష్టం నుంచి దేశం ఇప్పటికి తేరుకోలేదు. ఈ స్థితిలో అదానిచేసిన మోసం కోట్లమందిని ప్రభావితం చేసింది. ప్రస్తుత ఆర్ధికసంక్షోభ పరిస్థితులు మరింత విషమించి దేశం ఒక ఆర్థిక విషవిలయంలో చిక్కుకుపోతుంది. ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలుస్తోంది. జరుగుతున్న ఈ పరిణామాలన్నీ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దుష్ఫలితాలు. దీనికి ప్రత్యామ్నాయం సోషలిస్టు ఆర్ధిక వ్యవస్థే. ఈ వ్యవస్థ నిర్మాణం నేడు దేశప్రజల కర్తవ్యం కావాలి.
షేక్‌ కరిముల్లా, సెల్‌: 9705450705

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img