Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఎగనామం

తూపల్లె జనార్థన్‌

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం లక్ష్యంతో తన మానస పుత్రికగా ప్రక టించుకొన్న సచివాలయ వ్యవస్థపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మడమతిప్పం మాటతప్పం అనేది కేవలం ప్రగల్భాలేనా అంటూ సచివాలయ సిబ్బంది వాపోయే స్థితి ఏర్పడిరది. ఎంతో కష్టనష్టాల కోర్చి పరీక్షలు వ్రాసి ప్రొబేషన్‌ పూర్తి చేసుకొన్నా దీపావళికి కూడా పాత జీతాలే అందుకోవడంతో వారి ఆశలు అడియాశ లయ్యాయి. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో సిబ్బంది తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో నవరత్నాలకూ ఇక పంగనామాలే అనే వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. ప్రజల ముంగిటకు ప్రభుత్వ పథకాలు తీసుకెళ్ళే క్రమంలో నేడు 540 సేవలను విస్తరించింది. పింఛన్లు మొదలుకొని ఇంటింటికి బియ్యం సరఫరా, రైతు భరోసా నుండి ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు సైతం చేసే అధికారం సచివాలయ వ్యవస్థకే పట్టం కట్టింది. వార్డు / గ్రామ సచివాలయ సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయాలంటే వారికి సూచించిన విధులు, బాధ్యతలతో పాటు పూర్తిస్థాయి జీతాలు కూడా మిగతా ఉద్యోగులతో పాటు ఇవ్వాలి. కానీ అది జరగలేదు. ఆర్థిక క్రమ శిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్న ఈ ప్రభుత్వం నెల నెలా జీతాలు ఇచ్చేందుకు కటకట లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలంటే ప్రతి నెల మరో రూ. 200 కోట్లు అదనపు భారం పడనుంది. ఆర్థిక వెసులుబాటు లేక ఉద్యోగులకు వేతన సవరణ, కరువుభత్యం వంటివి వాయిదా వేస్తున్న ప్రభుత్వం నేడు సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసేందుకు పడే అదనపు భారం మోసేందుకు సిద్ధంగా లేకే వెనకడుగు వేస్తోందనిపిస్తోంది.
యువతను ఆకట్టుకునేందుకు ప్రప్రథమంగా దేశంలోనే ఆదర్శంగా ఉంటా మని నవరత్నాలు అమలుకు పూనుకున్న ఈ ప్రభుత్వం ఇందుకోసం గ్రామ స్వరాజ్యం పేరున గాంధీజీ కన్నకలలు సాకారం చేస్తామంటూ సచివాలయం వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకు చేర్చాలంటే వలంటీర్లు వ్యవస్థ అతి ముఖ్యమని ప్రతి 50 ఇండ్లకు గ్రామాల్లో, ప్రతి 100ఇళ్లకు పట్టణాల్లో వలంటీర్లను ఏర్పాటు చేశారు. పెద్ద స్థాయిలో పరీక్ష నిర్వహించి మరీ ఈ వాలంటీర్లను నియమించింది. ప్రతి వలంటీర్‌ నవరత్నాలు అమలు లక్ష్యంగా పని చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఉద్యోగి రెండు సంవత్సరాలు తప్పనిసరిగా ప్రొబేషన్‌ను పూర్తి చేయాలని, ఆ తర్వాత వారందరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రొబేషన్‌ దశలో నెలకు 15 వేలు జీతం చెల్లిస్తామని, 2021 అక్టోబర్‌ 2 నాటికి అందరినీ పర్మినెంట్‌ చేస్తామని నియామక పత్రాలు వ్వక్తిగతంగా అందజేసింది. తర్వాత మాట మార్చి మరో మెలిక పెట్టింది. ఈ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలంటే మరో రెండు పరీక్షలు రాయాలంది. గ్రూప్స్‌ స్థాయిలో నియామక పరీక్ష రాసి ఉత్తీర్ణులై ఉద్యోగం పొందిన వీరికి మరోపరీక్ష అవసరం ఏమిటని తొలినుండి ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి.ప్రభుత్వం డిపార్ట్మెంట్‌ పరీక్షలు నిర్వ హించినా వాటిల్లో సైతం అధికభాగం ఉత్తీర్ణు లయ్యారు. అంతటితో సరిపెట్టక పర్మినెంట్‌ చేయాలంటే మరో రెండు పరీక్షలు రాయాలనడంపై రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడంతో చివరకు ఆ ప్రతిపాదనను విరమించుకుంది. ఈ అక్టోబరు 2 నాటికి గ్రామ/ వార్డు సచివాలయ కార్యదర్శు లందరికీ శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఊహించారు. కానీ ఇది జరగలేదు.
ప్రభుత్వం తనకు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు కారణంగా మరి కొంత కాలం పర్మినెంట్‌ చేయకుండా సాగదీయాలని భావిస్తున్నట్లు కనబడుతోంది. దానికై ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో చేపట్టాల్సిన ప్రక్రియను జిల్లా కలెక్టర్లకు దఖలు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇదివరకే ఉద్యోగులందరికీ సర్వీస్‌ రిజిస్టర్‌లను ప్రారంభించిన నేపథ్యంలో నవంబర్‌ రెండో తేదీ నాటికి పర్మినెంట్‌ ఉద్యోగులుగా పూర్తిస్థాయి జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ ఆగిపోవడంతో ఉద్యోగుల ఆశలుపై నీళ్లు చల్లినట్లయింది. దీపావళి సందర్భంగా పూర్తి జీతాలు ఇవ్వకుండా వారిని నిరాశపరిచింది. గతంలో ఇచ్చిన జీతాన్నే ఇచ్చింది. అది కూడా సెలవులు పెట్టిన రోజులకు మూడిరతల వేతనాన్ని కోత కోసింది. ఇది మరీ అన్యాయం అంటూ ఉద్యోగులు గగ్గోలుపెట్టడంతో వెనక్కుతగ్గింది. ఇప్పుడు రెండు సంవత్సరాలుగా పర్మినెంట్‌ అవుతుందని కోటిఆశలతో ఎదురుచూస్తున్న వార్డు/ సచివాలయ సిబ్బందికి నవంబరు 1తేదీకి కూడా ప్రొబేషన్‌ సమయంలో అంద జేసిన జీతమేఇవ్వడంపై సర్వత్రావిమర్శలువినిపిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకుంటున్న సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ఉద్యోగుల్లో అభద్రతా భావం నెల కొల్పింది. దీంతో నవరత్నాలు అమలులో కీలక బాధ్యత వహిస్తున్న గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ప్రభుత్వం తీరు గమనిస్తే కేవలం ఆరంభ శూరత్వమని చెప్పక మానదు. ఇదే కొనసాగితే ఉద్యోగులు ప్రభుత్వ పథకాల అమలులో పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించి పని చేసే స్థితి ఉంటుందా అనే అనుమానాలు కూడా రాక మానవు. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా తన వాగ్దానాన్ని అమలు చేసి పూర్తిస్థాయి వేతనాలు గత నెలతో పాటు అమలు చేస్తూ, ఈ నెలలో పూర్తిస్థాయి వేతనాలు అందజేస్తే అప్రతిష్ఠ నుండి బయటపడగలదు లేదంటే ఇతర ఉద్యోగులతో వీరూ జత కట్టి ఉద్యమ బాట పట్టాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి నుండి బయటపడేందుకు చేసిన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మంచిది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img