Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

సహకార వ్యవస్థల క్షీణత

రావుల వెంకయ్య

గ్రామీణ స్థాయిలో వ్యవసాయరంగం లోనూ, ఇతర రంగాల్లోనూ పనిచేస్తున్న సహకార వ్యవస్థలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం క్రమంగా నాశనం చేయడం మొదలుపెట్టాయి. నరేంద్రమోదీ వ్యవసాయ రంగాన్ని కాలరాయడానికి మూడు నల్ల చట్టాలను ప్రవేశపెట్టి చిన్న, సన్నకారు రైతులనుండి భూములను లాక్కోని బడా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. సంవత్సరంపాటు యావత్‌ రైతాంగం పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఫలితంగా మోదీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దుచేసి రైతులోకానికి క్షమాపణ చెప్పింది. ఆ సందర్భంగా రాత పూర్వకంగా హామీలు ఇచ్చి సంవత్సరకాలం దాటుతున్నా ఏ ఒక్క వాగ్దానం అమలు జరపకపోగా కాలయాపన చేస్తున్నది. తిరిగి దొడ్డి దారిన ఆ చట్టాలను మరో రూపంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవసాయరంగంలో డిజిటలైజేషన్‌ తీసుకురావాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం యంఓయూ జారీ చేసింది. సాంకేతిక విప్లవాన్ని ఆహ్వానించాల్సిందే కానీ ఈ యంఓయూ అమలుకు 10 కార్పోరేట్‌ కంపెనీలకు ఇచ్చారు. వాటిలో అమెజాన్‌, వాల్మార్ట్‌, ఐ.టి.సి.. మోన్సంటో, బేయర్‌, పతంజలి లాంటి పేరుపొందిన కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వరంగ బాధ్యత నామమాత్రంగా కూడా లేదు. అదే ప్రభుత్వరంగంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సహకార వ్యవస్థను 5 పటిష్టపరిచి ఆ సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిపితే వ్యవసాయరంగానికి, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. నరేంద్రమోదీ ప్రభుత్వ ఆలోచన ఆలాలేదు. కార్పోరేట్‌ శక్తులకు వ్యవసాయాన్ని అప్పగించేలా ఆలోచిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వస్తే సహకార రంగంలోని అన్ని వ్యవస్థలను ఒక్కొక్కటిగా నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో 635 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 932 సహకార సంఘాలు ఉన్నాయి. ఇవి కాక ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, వినిమయ దారుల సంఘాలు, అర్బన్‌ పరపతి బ్యాంకులు, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, గృహ నిర్మాణ సహకారసంఘాలు తదితర పేర్లతో కొనసాగుతున్నాయి. ఈ సంఘాలన్ని గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ వర్గాల ప్రజలు ఎన్నుకున్న కమిటీలు పనిచేస్తున్నాయి. ఒకమేరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని లోపాలు ఉన్నప్పటికి వివిధ వర్గాలకు చేరువలో ఉన్నాయి. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు అప్పులు ఇవ్వటానికి మొదట ఏర్పడ్డాయి. ఆ తర్వాత రైతుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాల సరఫరాకు విస్తరించాయి. ఇటీవల రైతుల పంటల ఉత్పత్తి మార్కెటింగ్‌కు కూడా వ్యాపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామీణ సహకార సంఘాలు సింగల్‌ విండోగా మారాయి. ప్రభుత్వ అవకతవకలవల్ల కొన్ని దివాళా తీసాయి. అప్పులు ఇవ్వటానికి పుస్తకాల్లో సర్దుబాటుకు మాత్రమే కొన్నిసంఘాలు పరిమితమయ్యాయి. కాని కొన్ని సొసైటీలు సమర్ధవంతంగా పనిచేసి లాభాలబాట పట్టాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంగనర్‌ జిల్లా ముల్కమారు సొసైటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా పనిచేసింది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు చండ్ర రాజేశ్వరరావు స్వగ్రామం మంగళాపురంలో 68 సంవత్సరాలనాడు పర్చూరికోటయ్య ఆధ్వర్యంలో 10వేల రూపాయలతో ప్రారంభమై నేడు 30కోట్ల టర్నోవర్‌కు విస్తరించింది. అలాగే హనుమానుల సురేంద్రనాద్‌ బెనర్జీ అధ్యక్షులుగా ఉన్న వక్కలగొడ్డ సొసైటీ కూడా 30 కోట్లకు పైగానే టర్నోవర్‌తో పని చేస్తున్నది. అలాగే కొమ్మననాగేశ్వరావు ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి సొసైటీ, ప్రకాశంజిల్లా మారెళ్ళ గుంటపాలెం నల్లూరి అంజయ్య సారధ్యంలో సొసైటీలు గొప్పగా పనిచేశాయి. అలాగే నష్టాల ఊబిలో కూరుకుపోయి దివాళా తీసిన విశాఖ అర్బన్‌ సహకారబ్యాంకు కోటిరూపాయలు మూలధనంగా ఉన్నదాన్ని నేడు 7వేల కోట్ల టర్నోవర్‌కు పెంచి 50 బ్రాంచీలకు విస్తరింపచేయడంలో ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకులు మానం ఆంజనేయులు కృషి మరువలేనిది. నెల్లూరు కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు అరిగెలసాయి ఛైర్మన్‌గా పనిచేస్తూ ఇటీవలనే మూడు సంవత్సరాలు పూర్తిచేసుకున్నది. ఇవన్ని లాభాల్లో పనిచేసా యంటే వాటికి అధ్యక్షులుగా, ఛైర్మన్లుగా నిజాయితీగా పనిచేసిన కమ్యూనిస్టులు ఉండటంవల్లనే జరిగింది.
పాడి రంగంలో పనిచేస్తున్నవి కూడా లాభాల బాటలో ఉన్నాయి. కొన్ని పనిచేయటంలో అవకతవకలవల్ల నష్టాల్లో ఉన్నాయి. వాటిని సరిదిద్దాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది ఆస్తులున్న వాటిని గుజరాత్‌కు చెందిన అమూల్‌ డెయిరీకి తాకట్టు పెట్టింది. గ్రామ సీమల్లో ప్రాధమిక సహకారసంఘాల వ్యవస్థకు పోటీగా 2020లో రైతు భరోసా కేంద్రాలుగా చెలామణిలోకి తీసుకురావడం జరిగింది. ఆర్‌.బి.కె.లు 10,641 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మొదట విత్తన విక్రయాలనుండి పంటల కొనుగోలు వరకు పనిచేశాయి. ఇప్పుడు ఈ క్రాప్‌ నమోదు, పంటల భీమా పథకాలు కూడా చేస్తామంటున్నారు. రకరకాల పేర్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారరంగాలను నాశనంచేసి కార్పోరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రైతులు, రైతు సంఘాలు ఈ సహకార వ్యవస్థను కొనసాగించడానికి ప్రభుత్వాలపై ఆందోళనకు పూనుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
వ్యాస రచయిత అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img