Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సామాజిక విముక్తికి అంబేద్కర్‌ బాట

నేడు దళిత బహుజనులు ఓట్ల రాజకీయాలకు పావులుగా మారి సమిధలవుతున్నారు. పార్లమెంటరీ రాజకీయాల భ్రమల్లో నుంచి ఈ వర్గం బైటపడి అంబేద్కర్‌ సూచించిన ప్రత్యామ్నాయ రాజకీయాలు, సంస్కృతి, సాంఘిక విముక్తి, ఆర్థిక సమానత్వం, అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం సాధించుకోటానికి మనం నేడు ఆయనబాటలో నడవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్‌ గొప్ప మానవతావాది, ఆర్థికవేత్త, తత్వవేత్త, ఆర్థిక సంబంధాల ప్రాముఖ్యతను గుర్తించిన మేథావి. ఆయన బడుగు, బలహీనవర్గాల ప్రజల ఉన్నతికి రాజ్యాంగ రక్షణ కల్పించటం కోసం ఆయన ఎంతో తపన పడ్డాడు. ప్రజలకు అన్నం పెట్టే కీలక రంగమైన వ్యవసాయం పూర్తిగా ప్రభుత్వానికి చెందిన పరిశ్రమగా ప్రకటించాలని సూచించాడు. ప్రభుత్వం స్వయంగా నిర్వహించే పరిశ్రమలను భారత రాజ్యాంగంలో పొందుపరచాలని సూచించాడు. కీలక మౌలిక పరిశ్రమలు, వ్యవసాయక భూమి వాటిపై హక్కులను పరిహారమిచ్చి స్వాధీనపరచుకోవాలని సూచించాడు. భూమిని ఒక స్థిర ప్రమాణంలో విభజించి వ్యవసాయక పరిశ్రమలను వ్యవస్థీకరించాలని అన్నాడు. ఆ వ్యవసాయక క్షేత్రాలను సమిష్టి సహకార క్షేత్రాలుగా చేసి కుల, మత బేధాలు లేకుండా ఏర్పడిన గ్రామ సమూహాలు సాగుచేయాలి. ఉత్పత్తిని సమిష్టిగా పంచుకోవాలి. భూస్వాములు, కౌలుదారులు, భూమిలేని కూలీలు ఉండరాదు. మొత్తంగా ఈ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలకు ధనం, మౌలిక వనరులను ప్రభుత్వమే సమకూర్చాలి. తద్వారా ఉత్పాదకతను పెంచాలి. ప్రజల ఆర్థిక జీవితాన్ని ప్రణాళిక బద్దంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలని అంబేద్కర్‌ వివరించాడు. ప్రతిపౌరునికి బీమా తప్పనిసరి చేయాలని బీమా వ్యాపారాన్ని జాతీయం చేయాలన్నాడు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం సోషలిజం తప్పనసరి అని సూచించాడు. లేకుంటే ఆర్థిక అసమానతలు నెలకొంటాయన్నాడు. అంబేద్కర్‌ సూచనలు సహజంగానే ఆనాటి జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన బడా భూస్వామ్య వర్గాలకు రుచించలేదు. అంబేద్కర్‌ ఆలోచనలను తోసి పక్కన పెట్టారు. అంబేద్కర్‌ ఒక ఊహాజనిత సోషలిస్టుగానే మిగిలిపోయాడు. తదుపరి ఎప్పటికో రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26సంవత్సరాల తరువాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిస్టు’ అనే ప్రజల రాజ్యాంగప్రవేశికలో చేర్చి చేతులు దులుపుకున్నారు. రాజ్యాంగం ప్రజల జీవితాలకి గ్యారంటీ ఇవ్వలేదని గ్రహించిన అంబేద్కర్‌ రాజ్యాంగ సభలో ఇలా మాట్లాడారు. ‘‘1956 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవితం ప్రారంభిస్తాం. మనకు రాజకీయాలలో సమానత్వం, సామాజిక, ఆర్థిక జీవితంలో అసమానత్వం ఉంటాయి. రాజకీయాలలో మనిషికి ఒక ఓటు. ఓటుకు ఒకే విలువ ఉంటుంది. కాని సామాజిక, ఆర్థిక జీవితంలో మనుషులందరికీ ఒకే విలువ ఉండదు. ఎంతకాలమీ వైరుధ్యాల జీవితం? ఈ వైరుధ్యాల్ని వీలైనంత త్వరగా అంతం చేయాలి. లేకుంటే ఈ సభవారు కష్టపడి నిర్మించిన ఈ వ్యవస్థలను అసమానతలకు గురైన ప్రజలు ఎగర కొట్టేస్తారు.’’ అంటాడు.
దారిద్య్ర నిర్మూలనకు మౌలికమైన వ్యవసాయ సంస్కరణలు అమలు కాలేదు. గ్రామీణ పేదరికాన్ని తొలగించి గ్రామసేవల్లో అణచివేతలకు, వివక్షకు గురౌతున్న నిమ్నజాతుల ప్రజలకు దక్కాల్సిన భూమి వారికి దక్కలేదు. భూ సంస్కరణలు అమలు కాలేదు. 75సంవత్సరాల స్వాతంత్య్ర ఫలాలు ఎవరికి దక్కాయి? ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రణాళికలు ఎవరికి ప్రయోజనం కలిగించాయి? గ్రామ, పట్టణ ప్రాంతాల్లో లభించే మేలైన భూమిని ఎవరు ఆక్రమించారు? చట్టసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు, మరికొన్ని కీలక విభాగాల్లో ఎవరు స్థిరపడిపోయారు? కాబట్టి 75 ఏళ్ల నాడు వచ్చిన స్వాతంత్య్రం నిమ్న జాతులది కాదని తేలిపోయింది. అంబేద్కర్‌ ఊహలు కలలుగానే తేలిపోయాయి. అలాగే రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచిన అంబేద్కర్‌ ఒక సందర్బంలో ‘‘నేనే ఏర్పరచిన రిజర్వేషన్లలో ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుందనుకున్నా, అయితే వాటి వల్ల గుప్పెడు మంది గుమస్తాలు భూమి లేకుండా భూస్వాములకు దాస్యం చేస్తున్నారు. వారికోసం నేను ఏమీ చేయలేకపోయాను.’’ అంటూ ఆవేదన చెందారు. అంటే భూ పంపిణీ జరగకుండా ఈ దేశంలో ఆర్థిక, సామాజిక సమానత్వం జరగదు. వ్యవసాయాధారిత మన దేశంలో భూమికి, సామాజిక న్యాయానికి ఉన్న సంబంధం ఇదే. భూ పంపిణీ జరగకుండా సామాజిక న్యాయం సాధ్యంకాదు కాబోదు. సామాజిక న్యాయానికి, భూమికి ఎంతో అవినావభావ సంబంధం ఉంది. ఎందుకంటే మానవజాతికి సమస్త జీవనాధారమైనది భూమి. కాబట్టి అనాదిగా భూమిని ఆక్రమించుకోవటం, దోచుకోవటం జరుగుతూ వస్తోంది.
ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషుల్ని, సమస్త జీవజాలాన్ని, మొత్తం సంపదను ఆక్రమించుకొని రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజులు ఏర్పడ్డారు. యుద్ధాలు జరిగాయి. ఇలా చరిత్రంతా మానవాళి నెత్తుటితో తడిసి ముద్దయింది. చివరికి మట్టిబిడ్డలైన నిమ్నజాతి భూమి పుత్రులకి భూమి దక్కకుండా చేశారు. భూమికోసం జాతులకు జాతులనే నిర్మూలించి అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా ఖండాలంటూ భూమిని ఖండఖండాలుగా చేసుకొని పంచుకున్నారు. మానవ సమూహాలు, ఆర్యులు, రష్యాలోని ఓల్గా నదీతీరం నుండి గంగ వరకు వచ్చారు. పచ్చిక భూమలు కోసమే కథó. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు దక్కాల్సిన భూములు గుంజుకుని దేశ, విదేశీ బహుళజాతి కంపెనీలకు, బడాబాబులకు కట్టబెడుతున్నారు. వీరు భూమి సంబంధాలన్నీ మార్కెట్‌ సంబంధాలుగా మార్చారు. నేడు ప్రపంచంలో చర్చంతా భూమిపైనే. రియల్‌ఎస్టేట్‌ పేరుతో సాగుతున్న భూ వ్యాపారం ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్‌గా మారింది. భూమి అంటే నేల మాత్రమేకాదు. ఆ నేలలోని వనరులు, ఈ మట్టిలో నుంచి శ్రమజీవులు పుట్టించిన సమస్త జ్ఞానం, సమిష్టి జీవనం, కళలు, సంస్కృతిగల భూమి నిమ్నజాతులకు దక్కాలి. ఇదే ఏకైక పరిష్కారం. ఇది జరగాలంటే అణగారిన వర్గాల ప్రజలే ఏకమై ఉద్యమించాలి. చైనా, క్యూబా తరహా సోషలిజంను ఈ దేశంలో స్థాపించుకోవాలి.
షేక్‌ కరీముల్లా, 9705450705

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img