Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సుస్థిరాభివృద్ధి లక్ష్యం సాధ్యమేనా?

డా॥బుర్రా మధుసూదన్‌రెడ్డి

పేదరికం, కరువు కాటకాలు, ఆకలి చావులు, అసమానతలు, వాతావరణ ప్రతికూలతల మార్పులు, పర్యావరణ కాలుష్యం, అధిక జనాభా, అవిద్య, లింగఅసమానతలు, అశాంతి, అన్యాయం లాంటి పలు సమస్యలతో ప్రపంచ దేశాలు సతమతంకావడం చూస్తున్నాం. ఈ సవాళ్ళకు విరుగుడుగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఎజెండా-2030ని తీసుకొచ్చింది ఐక్యరాజ్యసమితి. ఇందులో అందరికీ నాణ్యమైన విద్య కూడా ఒకటి. పేదరిక నిర్మూలన, అధిక జనాభా, ఆకలి చావులు లాంటి అనేక సమస్యలకు, సకల సవాళ్ళకు ధీటైన సమాధానం విద్యే అని మనకు తెలుసు. అయినా ఆయా దేశాలు ముఖ్యంగా మన భారతదేశం ఈవిషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. దశాబ్దాల ప్రపంచప్రగతిలో అక్షరాస్యత, విద్యారంగాల్లో సాధించిన సాఫల్యతలే అత్యంత కీలకమైనవనే విషయాన్ని గుర్తెరిగి నడుచుకోవాలి. అందరికీ నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు చేపట్టాలి. 2018 నాటికీ 260 మిలియన్ల మంది బాలలు బడిబాటకు దూరంగా ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా సగం మంది (617 మిలియన్లు) బాలలు, కౌమారదశ యువత కనీస రీడిరగ్‌, గణితశాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఉన్నారని ఐరాస నివేదిక-2021 తెలిపింది. కొవిడ్‌ విజృంభణ లాక్‌డౌన్‌లతో విశ్వంలోని 91 శాతం విద్యాలయాలు మూతపడడం, ఆన్‌లైన్‌విద్యకు తెరతీయడం చూశాం. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌-2020నాటికి 1.6బిలియన్ల విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు. ఆన్‌లైన్‌ వసతులు లేని కారణంగా పేద పిల్లలు విద్యను అభ్యసించలేక పోయారు. అత్యధిక పాఠశాలల మూసివేతతో 369 మిలియన్ల బాలలు పోషకాహారం, మధ్యాహ్న భోజనం పొందలేక పోయారు. కరోనాకాటుతో ప్రపంచవిద్య కుంటుపడడంవల్ల దాని దుష్ప్రభావం రాబోయే తరంపై అధికంగా పడనుంది. ఈ సవాళ్లను అధిగమించడానికి యునెస్కో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపట్టి విద్యా వసతుల కల్పనకు చొరవ తీసుకొంటున్నది. యునెస్కో చొరవతో 145 అల్పాదాయ/ మధ్యా దాయ ప్రపంచ దేశాలకు శాస్త్రసాంకేతిక విద్యా వనరుల కల్పన, అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య వసతులు, వివిధ సంస్థలతో సమన్వయం, డ్రాప్‌అవుట్లను తగ్గించే చర్యలు తీసుకొంటున్నది.
ప్రపంచవ్యాప్తంగా బాలలతో పోల్చితే 5.5 మిలియన్ల మంది బాలికలు ప్రాథమిక విద్యనూ పొందలేకపోతున్నారు. జీవితాంతం జీవన ప్రమాణాలు పెంచుటకు అత్యవసరమైన నాణ్యమైన విద్యను అన్ని వర్గాల బాలలకు, ముఖ్యంగా పేదలకు అందించాలి. అందరికీ విద్య అందితేనే అసమానతలు, పేదరికం, సమాజంలోఅశాంతి, అధికజనాభా, నిరుద్యోగం లాంటివి తగ్గుతాయనడంలో ఎలాంటి సందేహంలేదు. 2000 సంవత్సరం వివరాల ప్రకారం 70శాతం పిల్లలు ప్రాథమిక పాఠశాల విద్యను పొందగా 2018లో ఇది 84 శాతానికి చేరింది. 2030 నాటికి 89 శాతానికి చేర్చాలన్నది నిర్ణయం. అయినా 2030 నాటికి కూడా 200 మిలియన్ల పిల్లలు పాఠశాల లకు దూరం కావచ్చని అంచనా వేస్తున్నారు. 2011-19 కాలంలో 70 శాతం మంది పిల్లలు అక్షరాస్యత, ఆర్థిక సామాజిక అభివృద్ధి, శారీరక ఎదుగుదలలో కొంత ప్రగతిని సాధించారని తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 15 ఏండ్లు దాటిన వారిలో 86 శాతం అక్షరాస్యత సాధించగా, 15-24 మధ్య వయస్కుల్లో 92 శాతంగా నమోదైంది. 2018 నాటికి 773 మిలియన్ల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. పాఠశాలల్లో సురక్షిత నీరు, మూత్రశాలలు, విద్యుత్‌ వసతులు, కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం, మౌలిక వసతులు లాంటివి లేక పోవడం కూడా నిరక్షరాస్యత పెరుగుదలకు కారణం అవుతున్నాయి. అధికశాతం బాలికలు, మహిళలు నేటికీ చదువులకు దూరమవుతూ బాల్య వివాహాల బారిన పడుతున్నారు, బాల కార్మికులుగా మారుతున్నారు. పలు కారణాలతో పాఠశాలలను మూసి వేయడంతో 90 శాతం మంది పిల్లలు డ్రాపౌట్స్‌గానే మిగిలిపోతున్నారు.
విద్యాలయాలను విస్తరించాలి. పేదలకు ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులతోపాటు ఆధునిక విద్యా వనరులు అందించాలి. సమీపాల్లో బడులు, నాణ్యమైన ఉపాధ్యాయులు లాంటి విద్యా సౌకర్యాలను కల్పిస్తేనే విశ్వబాలలు అక్షరాస్యులుగా, విద్యావంతులుగా ఎదిగి దేశాభివృద్ధిలో కందెనలుగా మారుతారు. నేటికీ 65 శాతం పాఠశాలలు మాత్రమే సురక్షిత నీటివసతులను కలిగిఉన్నాయి. నిరుపేద అభాగ్యులు, చిన్నారులు, యువతను ఉన్నత విద్యా చట్రంలోకి తీసుకురావాలి. చదువులతో భువిని నందనవిజ్ఞానవనంగా మార్చాలి. 2015 సెప్టెంబరులో ఐరాస తీసుకొచ్చిన ఎజెండా`2030లోని అంశం అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యం నెరవేరే అవకాశాలేమీ కనిపించడంలేదు. కొవిడ్‌ లేదా ఆయాదేశాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితులు కారణాలేవైనా లక్ష్యం సుదూరంగా ఉందన్నది వాస్తవం. ఆరేళ్ళు గడిచినా అంతంతమాత్రపు ఫలితాలే కనిపిస్తున్నాయి. అందరికీ నాణ్యమైన విద్య ఏనాటికి అందేనో? ఈ ప్రపంచం తీరుతెన్నులు ఎప్పటికి మారేనో?
వ్యాస రచయిత సెల్‌ 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img