Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సెల్‌ మోజులో యువత చిత్తు

నేటి ప్రపంచానికి పెను సవాలుగా పరిణిమించిన నూతన నిశబ్ద సమస్య సెల్‌ వినియోగం. ఎంతో మంచికి దోహదం చేస్తుంది అని భావించిన సెల్‌ ఫోన్‌, నేడు ఇదో పెద్ద హెల్‌ ఫోన్‌గా మారుతుంది. ముఖ్యంగా యువత జీవితాలను ప్రభావితం చేస్తుంది. శారీరక మానసిక అనారోగ్యాలకు కారణమవుతున్నది. మనదేశంలో సగటున యువత రోజుకు 9 గంటలకు పైగా సెల్‌ వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 5 గంటలు దాటి సెల్‌ వాడిత్‌ సెల్‌ వ్యసనం గా భావించాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 8-12 సంవత్సరాల పిల్లలు రోజుకు 8 గంటలు సెల్‌ వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో 4.7 శాతం జనాభా రోజుకు 9 గంటలు పైబడి సెల్‌ మత్తులో జోగుతున్నారు. దీంతో భవిష్యత్తులో యువత శారీరక మానసిక అసహజ లక్షణాలతో అనారోగ్యాలకు గురవుతున్నారు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో భారత్‌లో ప్రజలు 12 శాతం సెల్‌ అడిక్టెడ్‌గా మారనున్న నేపథ్యంలో ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లల సెల్‌ వినియోగంపై దృష్టి సారించాలి. లేకపోతే తీవ్ర అనారోగ్యాలతోపాటు, అసాంఘిక శక్తులుగా మారే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే బ్రిటన్‌లో 10శాతం జనాభా సెల్‌ బానిసల య్యారు.
సెల్‌ వినియోగంతో ప్రపంచ కుగ్రామంగా మారి, అనేక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలు మనకు అందుబాటులోకి వచ్చాయి. కానీ అదే సమయంలో, యువత, పిల్లలు సోషల్‌ మీడియాలో సంచరిస్తూ వారి భవిష్యత్తును పణంగా పెట్టడం ద్వారా కెరీర్‌ పాడుచేసుకుంటున్నారు. కరోనా కాలంలో ‘‘ఆన్‌లైన్‌ చదువులు’’ పేరిట సెల్‌ ఫోన్‌ ప్రతీ ఒక్కరికీ చేరువైంది. ముఖ్యంగా విద్యార్థులు చేతిలో ఆయుధంగా మారింది. చదువులు మాట అలా ఉంచితే, ఎక్కువ మంది వీడియో గేమ్స్‌, పోర్న్‌ సైట్లు, రకరకాల వెబ్‌ సైట్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లు, స్నేహాలపై శ్రద్ద పెట్టకపోవడం పెద్ద లోపం. తల్లిదండ్రులతో కలిసి ఉన్నా, ఎవరి సెల్‌తో వారు కాలక్షేపం చేయడంతో, వారి మధ్య ఉండే ప్రేమ, అనురాగం, మానవీయ, కుటుంబ సంబంధాలు క్షీణించి, చివరికి ఒంటరి జీవితాలుగా దుర్భరం అవుతున్నాయి. చివరికి ‘‘పెళ్ళిళ్ళు వద్దు, ఒంటరి జీవితాలు ముద్దు’’ అనే స్ధాయికి నేటి యువత దిగజారడం బాధాకరమైన విషయం. అలాగే ఇతరులు వ్యక్తిగత జీవితంలో ప్రవేశించి, అనేకుల జీవితాలను అస్తవ్యస్తం చస్తున్నారు. అక్రమ సంబంధాలు, సైబర్‌ క్రైమ్‌, టెర్రరిజం, మత్తు దందాలకు సెల్‌ ఆలంబనగా మారుతుంది. ఫేక్‌ న్యూస్‌, ఫ్లాష్‌ న్యూస్‌ వంటి సమాచారాలతో తప్పుడు ప్రచారం చేయడం, సమాజంలో రకరకాల ఉద్రిక్తతలకు కారణం అవుతుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముఖ్యంగా కరోనా కాలంలో సెల్‌ ఎంత ఉపయోగపడిరదో, సరైన పద్ధతిలో వాడకపోతే అంతకంటే ప్రమాదాలకు కారణం అవుతుంది అని అందరూ గ్రహించాలి. వాట్సప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో సంచరిస్తున్న పిల్లలారా, యువత తమ కెరీర్‌ మలచుకోవడంలో ఈ నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి ఉన్నత స్థాయిలో ఉండే విధంగా తమ జీవితాలను తీర్చి దిద్దుకోవాలి. ఇప్పటికే కొంతమంది సృజనాత్మకతతో ముందుకు సాగు తున్నారు. అయితే, ఎక్కువమంది సెల్‌ దుర్వినియోగంచేస్తున్నారు. బాత్‌రూంలో కూడా నూటికి 40% శాతం మంది, పడుకునే వరకు 71% శాతం మంది సెల్‌ వాడకం చేస్తున్నారు అని సమాచారం. దీంతో శారీరక మానసిక అశాంతికి లోనవుతున్నారు.
ఐ.పి.రావు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img