Friday, March 31, 2023
Friday, March 31, 2023

80 ఏళ్ల అరసం ప్రస్థానం

అభ్యుదయ రచయితల సంఘం(అరసం)భారత ఉపఖండంలో ఆవిర్భవించిన గొప్ప సాహిత్య సంస్థ. గత సాహిత్యానికి భిన్నమైన రీతిలో ఉన్నత సాహిత్యవిలువలను సృష్టించటమే కాకుండా, అప్పట్నుంచి ఇప్పటివరకు దేశంలోని అన్ని ప్రాంతాలకు, భాషలకు ప్రాతినిధ్యంవహిస్తున్న ఏకైక సాహిత్యసంస్థగా గుర్తింపును పొందింది. 20వ శతాబ్దంలో అంతర్జాతీయ సమాజంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సాహిత్యరంగాల్లో తలెత్తిన పరిణామాలు, వాటి ప్రభావాలు అభ్యుదయ సాహిత్యం పుట్టుకకు దారితీశాయి. ఆధునిక ప్రపంచంలో ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతమైన మార్క్సిజం తాత్విక పునాదిగా అభ్యుదయ సాహిత్యం ఉద్యమ రూపం తీసుకుంది. ఈ అవసరాన్ని గుర్తించిన మేధావులు, సాహితీవేత్తలు అభ్యుదయ సాహిత్యంవేపు చేరారు. సాహితీరంగాన్ని ప్రభావితంచేస్తూ, ప్రజాసాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అరసం 80 ఏళ్లుగా కృషి చేస్తోంది. 2018 డిసెంబరు 8,9 తేదీల్లో గుంటూరులో వజ్రోత్సవాన్ని జరుపుకుంది. శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరం దీనికి ఆతిథ్యమిచ్చింది. రాష్ట్రవిభజన తర్వాత జరిగిన తొలి మహాసభ అది. అరసం అవతరణకు జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం వుంటే, అందుకు తెనాలి వేదిక కావటం గర్వకారణం. మళ్లీ తెనాలిలోనే 80వ వార్షికోత్సవాన 19వ రాష్ట్ర మహాసభలు జరగనుండటం విశేషం.
తెనాలిలో అరసం ఆవిర్భావం…
అభ్యుదయ రచయితల సంఘం(అరసం) 1943లో తెనాలిలో ఆవిర్భ వించింది. సెట్టి ఈశ్వరరావు, చదలవాడ పిచ్చయ్య, తుమ్మల వెంకట్రామయ్య కృషితో ఆ ఏడాది ఫిబ్రవరి 13,14తేదీల్లో ప్రథమమహాసభలు తాపీ ధర్మారావు అధ్యక్షతన జరిగాయి. పులుపుల వెంకట శివయ్య, చాగంటి సోమయాజులు, వేములపల్లి శ్రీకృష్ణ, బొల్లిముంత శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆకలి, దారిద్య్రం, రాజకీయ బానిసత్వం, సాంఘిక వెనుకబాటు వంటి ప్రధాన సమస్యలపై సాహిత్యాన్ని సృష్టించి ప్రజలను చైతన్యం చేయాలని మహాసభలు నిర్ణయించాయి. నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించుకున్నాయి. దేశ స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ, ఆ రోజుల్లో వివిధదేశాల్లోని విముక్తి పోరాటాలను సమర్ధిస్తూ ‘అరసం ఏర్పడిరది. తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి మూలపురుషులైన కందుకూరి, గురజాడ, గిడుగుల సామాజిక, సాహిత్య, భాషా సంస్కరణలు స్ఫూర్తిగా తీసుకొని భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక పోరాటాల వారసత్వాన్ని స్వీకరించింది.
సజీవ స్రవంతిగా అభ్యుదయ సాహిత్యం…
అప్పట్నుంచి అరసం తెలుగువారి చరిత్రలో భాగమై, కల్పించిన ప్రభావం అపరిమితం. కాలక్రమంలో ఎన్ని ఉద్యమాలు, ధోరణులు తలెత్తినా అభ్యుదయ సాహిత్యం సజీవ స్రవంతిగా ప్రవహిస్తూనే ఉంది. 1955 సభల తర్వాత 1970 వరకు అరసం కార్యకలాపాల్లో స్తబ్దత ఏర్పడిరది. తర్వాత పునర్నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి. 1973 ఆగస్టు10-12 తేదీల్లో గుంటూరులో జరిగిన ఆరో మహాసభతో అరసం పునర్నిర్మాణం కార్యరూపం దాల్చింది. 1976లో హైదరాబాద్‌లో 7వ మహాసభ, 1978లో కాకినాడలో మహాసభ తర్వాత తిరుపతి, భీమవరం, గోదావరిఖని, విశాఖపట్నం, కడప, సూర్యాపేట, వరంగల్లో సభలు జరిగాయి. భీమవరంలోనే రజతోత్సవా లను నిర్వహించారు.
అరసం ఆవిర్భావానికి వేదికైన తెనాలి, బొల్లి ముంత శివరామకృష్ణ, నేతి పరమేశ్వరశర్మ నేతృత్వంలో స్వర్ణోత్సవాలకు ఆతిథ్యమివ్వటం విశేషం. వజ్రోత్సవ మహాసభ 2018 డిసెంబరు 8,9 తేదీల్లో గుంటూరులో 18వ మహాసభగా జరిపారు. ‘విలువైన గతం, బలమైన వర్తమానం, ఆశావహమైన భవిష్యత్తు’ అన్న లక్ష్య నిర్దేశం జరిగిన మహాసభలకు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షత వహించారు. పెనుగొండ లక్ష్మీనారాయణ పతాకావిష్కరణ చేయగా, డాక్టర్‌ ఏటుకూరి ప్రసాద్‌ ప్రారంభోపన్యాసం చేశారు. అఖిల భారత అభ్యుదయ రచయితల సమాఖ్య నుండి వినీత్‌ తివారీ ముఖ్య అతిథి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ కీలకోపన్యాసం చేశారు. స్తబ్దత సమయంలో కొంత నీరసించినా, బలహీనపడినట్టు అనిపించినా, అరసం సాహిత్య సృజన కొనసాగుతూనే వచ్చింది. సకల ప్రజాపోరాటాలకు స్ఫూర్తినిచ్చే సాహిత్యాన్ని అన్ని ప్రక్రియల్లోనూ అన్ని వేళలా స్పష్టించటం ప్రత్యేకత. కాలానుగుణంగా తన కార్యక్రమాన్ని రూపొందించుకుంటూ ఉద్యమాలకు తన కలాన్ని, గళాన్నీ ఇస్తోంది. మొత్తంగా సమాజ ఉన్నతీకరణకు సాహిత్యం ఎంతగా దోహదపడు తుందో చెప్పేందుకు 80 ఏళ్ల అరసం ప్రస్థానమే చెరగని సాక్ష్యంగా చెబుతారు.
అరసం కృషిలో జిల్లావాసుల పాత్ర…
ఆరంభకులతోపాటు గుంటూరు జిల్లాకు చెందిన వట్టికొండ విశాలాక్షి, అనిశెట్టి సుబ్బారావు, తిరునగరి రామాంజనేయులు, బొల్లిముంత శివరామకృష్ణ, గంగినేని వెంకటేశ్వరరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, పరుచూరి రాజారాం, ప్రయాగ కోదండరామశాస్త్రి, కొండేపూడి శ్రీనివాసరావు, టి.వాణీరంగారావు, కనపర్తి స్వర్ణలత ‘అరసం’ కార్యకలాపాల్లో విశేష కృషి చేశారు. సంస్థ ఆరంభమైన ఏడాదిలోనే నరసరావుపేటకు చెందిన కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలు తొలి అభ్యుదయ కవితా సంకలనం ‘నయాగర’ ను వెలువరించారు. రచయితల ఉద్యమం సంస్థాగత నిర్మాణం రూపం సంతరించుకోటానికీ, విస్తృత పరచుకోటానికీ అరసం 1946లో నెలరోజులపాటు తెనాలి సమీపంలోని పెదపూడిలో సాహిత్య పాఠశాలను, రేపల్లె దగ్గర్లోని పల్లెకోనలో 1947 ఏప్రిల్‌లో మరో 20 రోజులు ‘సాహిత్య విద్యాలయం’ నిర్వహించింది. పదునెక్కిన అభ్యుదయ సాహిత్య ఉద్యమకారులను, రచయితలనూ తయారు చేసింది. ఏటా వందలాది గ్రంథాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా కవుల అభివ్యక్తి రాటుదేలింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘంకు ప్రముఖ రచయిత రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షుడు కాగా, జిల్లాకు చెందిన వల్లూరి శివప్రసాద్‌ ప్రధాన కార్యదర్శిగా పెనుగొండ లక్ష్మీనారాయణ జాతీయ కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నారు. జిల్లా అధ్యక్షుడిగా చెరుకుమల్లి సింగారావు వ్యవహరిస్తున్నారు.
రాజ్యమేలిన భావకవిత్వం…
1943లో ఆంధ్ర రాష్ట్రంలో అరసం ఏర్పడడానికి ముందు భావకవిత్వం రాజ్యమేలింది. భావకవిత్వం ఊహలకే పరిమితం. ఊహా ప్రేయసికి మినహా మనిషికి స్థానం లేదు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం కూడా అదే. 1917 నాటి అక్టోబరు విప్లవం రచయితల ఆలోచనా సరళిని మార్చివేసింది. యుద్ధసమయాన సంస్కృతిపై విపరీతమైన దాడి జరుగుతోంది. హిట్లర్‌ జాత్యాహంకారం, సోషలిస్టు పవనాలు రచయితలను ఆలోచింప జేశాయి. సంప్రదాయవాది అయిన విశ్వనాథ సత్యనారాయణ ‘విప్లవం’ కవిత రాశారు. భావకవుల్లో ప్రసిద్ధుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రి అభ్యుదయ భావాలతో పాట రాసిన సందర్భమూ అదే. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ స్ఫూర్తి రచయితలను ప్రభావితం చేసింది. మొత్తంమీద అభ్యుదయ భావన ఎల్లెడలా వీచింది.
ప్యారిస్‌ సమావేశమే ‘అరసం’ కు ప్రేరణ…
ప్యారిస్‌లో 1935 జూన్‌ 21న అంతర్జాతీయ రచయితల సమావేశం ఇందుకు బీజం వేసింది. ప్రపంచ దేశాల కవులు, కళాకారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఫాసిజాన్ని వ్యతిరేకించాలనీ, సాహిత్య కళారంగాలను పరిరక్షించాలని నినదించారు. ఈ ప్రభావంతో లండన్‌లో 1936 ఫిబ్రవరి 19న సమావేశమైన రచయితలు ‘ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌’ ను స్థాపించారు. మనదేశం నుంచి పాల్గొన్న కమ్యూనిస్టు సజ్జాద్‌ జహీర్‌, వామపక్ష అభిమాని ముల్కరాజ్‌ ఆనంద్‌లు తిరిగొచ్చాక, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటుకు పూనుకున్నారు. 1936 ఏప్రిల్‌ 9న లక్నోలో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభలు సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్‌చంద్‌ అధ్యక్షతన జరిగాయి.
లక్నో మహాసభలకు తెనాలి రచయిత …
లక్నో సభలకు ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధిగా తెనాలికి చెందిన ప్రముఖ సాహితీవేత్త అబ్బూరి రామకృష్ణారావుకు ఆహ్వానం అందింది. వీరితోపాటు విశాఖ నుంచి హీరేంద్రనాథ ముఖర్జీ, సోమంచి యజ్ఞన్నశాస్త్రి హాజరయ్యారు. తిరిగి రాగానే ‘వర్ధమాన లేఖక సంఘం’ స్థాపించిన అబ్బూరి, తాను అధ్యక్షుడిగా, శ్రీరంగం శ్రీనివాసరావు కార్యదర్శిగా వ్యవహరించేందుకు నిర్ణయమైంది. మరో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలంను సభ్యత్వం తీసుకోమన్నారు. సొంత మేనిఫెస్టోనూ రూపొందించారు. గుర్తించిన పోలీసుల నిఘా, సోదాలతో తాత్కాలికంగా ఆగిపోయింది. లక్నో నుంచి ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ వెలువరించిన ‘ఇండియన్‌ లిటరేచర్‌’ త్రైమాసిక పత్రిక సంపాదకవర్గంలో అబ్బూరిని చేర్చుకున్నారు.
బి.ఎల్‌.నారాయణ, 9550930789
బొల్లిముంత కృష్ణ, 9959431235

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img