Friday, August 19, 2022
Friday, August 19, 2022

మానవాళిపై వేలాడుతున్న అణ్వస్త్రాల కత్తి

డా. అరుణ్‌ మిత్రా

‘‘నగరం నడి మధ్యభాగం అంతా ఒక తెల్లటి మరకలా మారిపోయింది. నగరం అంతా చదునుగా తయారైంది. అక్కడ ఇంతకు ముందు ఇళ్లు ఉండేవి అన్న ఆనవాళ్లు ఏ కోశానా లేవు. పోయిన వారు పోగా మిగిలిన వారి గాయాల మీద ఈగలు, దోమలు ముసురుతున్నాయి. అంతా గందరగోళంగా, మురికి కూపంలా ఉంది. గాయపడిన వారందరికీ రక్తం ఎక్కించాలి. కాని రక్త దాతలే లేరు. అసలు రక్తం నమూనాలు చూసి ఎవరిది ఏ గ్రూపో అని తేల్చే వారే లేరు. అందుకని క్షత గాత్రులకు చికిత్సే లేదు.’’ ఇప్పటికి 77 ఏళ్ల కిందట అంటే 1945 ఆగస్టు ఆరో తేదీన జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా వేసిన అణుబాంబు విధ్వంసం తరవాత డా. మార్సెల్‌ జునోద్‌ చెప్పిన విషయం ఇది. ఆయన అప్పటకి అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ సంస్థ తరఫున బాంబులు పడ్డ తరవాత ఆ హిరోషిమాకు వెళ్లిన మొట్ట మొదటి డాక్టర్‌. జునోద్‌ బాంబు పడ్డ ఒక నెల రోజుల తరవాత 1945 సెప్టెంబర్‌ 8న హిరోషిమా వెళ్లారు. హిరోషిమా మీద అమెరికా అణు బాంబు వేయక ముందు అక్కడ 300 మంది డాక్టర్లు ఉంటే 270 మంది అయితే మరణించారు. లేదా తీవ్రంగా గాయపడ్డారు. 1780 మంది నర్సుల్లో 1654 మంది మరణించారు లేదా గాయపడ్డారు.
హిరోషిమా అణుబాంబు వేసిన మూడు రోజులకు 1945 ఆగస్టు 9న జపాన్‌లోని మరో నగరం నాగసాకి మీద అమెరికా మరో బాంబు వేసింది. ఈ రెండు రోజుల్లో రెండు నగరాల్లో దాదాపు రెండు లక్షలమంది మరణించారు. అంతకన్నా ఎక్కువ మంది గాయపడ్డారు. అంతకన్నా ఎక్కువ మంది అనాథలుగా మిగిలిపోయారు. నిరాశ్రయులయ్యారు. అనాథలై పోయారు. అణుబాంబు నుంచి వెలువడిన అణుధార్మిక శక్తి ప్రభావం అక్కడ ఇంకా 77 ఏళ్ల తరవాత కూడా కనిపిస్తూనే ఉంది. అంటే ఆ ప్రభావం అప్పుడున్న వారి మీదే కాకుండా ఆ రుగ్మతలు తరవాతి రెండు తరాల మీద కూడా ఉన్నాయి. అంతకు ముందు మానవాళి ఇంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. 1939 సెప్టెంబర్‌ ఒకటవ తేదీన ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధం 1945 సెప్టెంబర్‌ రెండున ముగిసింది. అంటే యుద్ధం చివరి దశలోకొచ్చి, మిత్ర దేశాలు విజయం ఖాయమని తేలి, ప్రత్యర్థి కూటమిలో భాగమైన జపాన్‌ దాదాపు చేతులెత్తేసిన దశలో అమెరికా నిష్కారణంగా అణు బాంబులు ప్రయోగించింది. నిజానికి నిష్కారణమేమీ కాదు. తాము తయారు చేసిన అణు బాంబులు ఎలా పని చేస్తాయో చూద్దామనుకున్నట్టుంది.
ఇంత జరిగిన తరవాత మానవాళి గుణపాఠం నేర్చుకోవలసింది పోయి అణ్వస్త్ర రాశులు పోగేసింది. ప్రపంచంలో ప్రస్తుతం 17, 000 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఒక్క అమెరికా దగ్గరే అణుబాంబులు ఉంటే ఇప్పుడు రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, ఉత్తర కొరియా, ఇజ్రాయిల్‌, పాకిస్తాన్‌తో పాటు భారత్‌ దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి. హిరోషిమా, నాగసాకి మీద వేసిన ఆటం బాంబులు రెండు నగరాలనే ధ్వంసం చేశాయి. ఇప్పుడున్న అణ్వస్త్రాలు ఆ బాంబులు పడ్డ చోట వందలాది ఏళ్ల తరబడి గడ్డి పరకకుండా మొలవకుండా చేయగలవు. చెట్టు చేమ, పక్షి, పశువు ఆ మాటకొస్తే ఏ జీవీ మిగలదు. ఇప్పుడున్న అణ్వస్త్రాలు మానవాళి తల మీద కత్తిలా వేలాడుతూనే ఉంటాయి.
హిరోషిమా, నాగసాకి విధ్వసం చూసిన తరవాత ఇప్పుడు అణ్వస్త్రాలు చాలా పరిమిత స్థాయిలో ప్రయోగించినా ఎంత ఊహించలేని విధ్వంసం జరుగుతుందో అనేక అధ్యయనాలు ఎత్తి చూపాయి. ఉదాహరణకు భారత పాకిస్తాన్‌ దేశాల మధ్య యుద్ధం వచ్చి అణ్వస్త్రాలు ప్రయోగించే పరిస్థితే దాపురిస్తే అది ఎంత పరిమితమైన అణ్వస్త్ర ఘర్షణ అయిన హిరోషిమాలో వేసిన బాంబంత పరిణామం ఉన్న వంద బాంబులు ప్రయోగించినంత విధ్వసం సృష్టిస్తుంది. 200 కోట్ల మంది మీద ఆ ప్రభావం ఉంటుంది. భారత ఉపఖండంలోని ప్రధాన నగరాలు ఏమీ మిగలవు. దక్షిణాసియా అంతటా అణుధార్మిక ప్రభావం ఉంటుంది. ఈ విధ్వసం అక్కడితో ఆగదు. మొత్తం ప్రపంచం మీదే దారుణమైన ప్రభావం ఉంటుంది. అణ్వస్త్రాల నుంచి వ్యాపించే పొగ, మసి వల్ల సూర్య కాంతి భూమి మీదకు ప్రసరించకుండా పోతుంది. ఉష్ణోగ్రతలు మైనస్‌ 1.25 డిగ్రీలకు పడి పోయి ఆ ప్రభావం ఏళ్ల తరబడి ఉంటుంది. పంటలు పండవు. ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. ఓజోన్‌ పొర దెబ్బ తింటుంది. దానివల్ల పంటలు మరింత తగ్గుతాయి. చావగా మిగిలిన వారికి ఆహార పదార్థాలు అందించడమే అసాధ్యం అవుతుంది. ఈ ప్రభావం పేద దేశాల మీద ఎక్కువగా ఉంటుంది. పేదలు మలమల మాడి పోతారు.
అణు యుద్ధంలో ప్రాణాలతో బయటపడ్డ వారెవరైనా ఉంటే వైద్యం చేయడానికి తగిన మందులే ఉండవు. ఇప్పుడున్న అణ్వస్త్రాలు హిరోషిమా, నాగసాకి మీద బాంబుల కంటే అనేక రెట్లు ఎక్కువ శక్తిమంతమైనవి కనక జరిగే విధ్వంసాన్ని ఊహించడమూ అసాధ్యమే. గత ఒకటవ తేదీన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల 10వ సమీక్షా సమావేశం ఆగస్టు ఒకటిన ప్రారంభమైంది. ఇది 26వ తేదీకా న్యూయార్క్‌లో జరుగుతుంది. ఈ సమీక్షా సమావేశంలో 191 దేశాలు పాల్గొంటాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరి 52 ఏళ్లయింది. ఈ ఒప్పందం అణ్వస్త్రాలను నిరోధించలేక పోయింది. 2017లో ఐక్య రాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో అణ్వస్త్రాల నిషేధ ఒప్పందం కుదిరిన తరవాత పదవ సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ ఒప్పందం ప్రకారం అణ్వస్త్రాలు చట్ట వ్యతిరేకమైనవే. అణ్వస్త్రాలను నిషేధించే ఒప్పందంపై 86 దేశాలు సంతకాలు చేశాయి. 60 దేశాల చట్ట సభలు ఈ సంతకాలను ధృవీకరించాయి. అయితే అవసరమైతే అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని బెదిరించడమూ ఈ మధ్య పెరిగిపోయింది. అణ్వస్త్రాలను మరింత ఆధునికం చేస్తున్నారు. భద్రత గురించి మాట్లాడేటప్పుడు అణ్వస్త్రాల ప్రస్తావనా పెరుగుతోంది. అణ్వస్త్రాలు యుద్ధ నివారణకు ఉపకరిస్తాయన్న సిద్ధాంతాలూ ఉన్నాయి.
మొదటి ప్రపంచ యుద్ధం తరవాత విషవాయువుల ప్రయోగాన్ని నిషేధించారు. అలాగే అణ్వస్త్రాలనూ పూర్తిగా నిషేధించాలని 77 ఏళ్ల కింద అణుబాంబు పడ్డ తరవాత హిరోషిమా వెళ్లిన మొదటి డాక్టర్‌ జునోద్‌ కోరారు. ఈ మాట వినిపించుకునే వారు ఎవరైనా ఉన్నారా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img