Monday, September 26, 2022
Monday, September 26, 2022

ఉద్యమాలతోనే ఆదివాసీల అభ్యుదయం

స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటిపోయినా ఆదివాసీ గిరిజనులకు ఇంకా సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం రాలేదని చెప్పాలి. ఇప్పటికీ రవాణా సౌకర్యం, రక్షిత మంచినీరు, విద్యుత్తు, విద్యా సౌకర్యాలు లేని ఆదివాసీ గిరిజన గూడేలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వం గిరిజనుల కోసం కేటాయిస్తున్న బడ్జెట్‌ అర్హులకు దక్కడం లేదు. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్ని ప్రభుత్వ సంస్థలు వచ్చినా, ఎన్నెన్నో పథకాలు తెచ్చినా వారి జీవితాలలో విప్లవాత్మకమైన మార్పు రాలేదన్నది వాస్తవం. హక్కులు, అభివృద్ధి, అధికారాల కోసం, వారికి ప్రత్యేకంగా సంక్రమించిన చట్టాల పరిరక్షణ కోసం గిరిజన సోదరులు ప్రజాస్వామ్యబద్దంగా, న్యాయ పోరాటాలు చేపట్టాలి. పభుత్వాలు ఆదివాసీ గిరి జనుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అభివృద్ధి, సంక్షేమం కోసం, రాజ్యాంగ బద్దంగా వారికి దక్కవలసిన హక్కులు, అధికారాలు, ఫలాలు దక్కే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

యండి. ఉస్మాన్‌ ఖాన్‌
భారత ఉపఖండంలో అనేక గిరిజన సముదాయాలు నివసిస్తున్నాయి. ఆదివాసీ గిరిజనులకు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలు ఉన్నాయి. ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘఢ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, మిజోరం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వీరి ముఖ్యమైన నివాస ప్రాంతాలు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో కూడా వీరి నివాసాలున్నాయి. తెలంగాణలోని భద్రాద్రి, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఆదివాసీ ప్రాంతాల్లో చిన్న చిన్నగూడేలు ఎక్కువ. ఒక్కో పంచాయితీ పరిధిలో అనేక గూడేలు ఉంటాయి. ఆదివాసులు అంటే అడవిలో ఉండేవాళ్లు. ఆహారం కోసం ఆకులు, అలముల సేకరణ, వేట దశల నుండి ప్రస్తుతం ‘పోడు’ వ్యవసాయంలోకి ప్రవేశించారు. వీరిలో గోండు, నాయకపోడు, గొత్తికోయ, కోలాము, కొండరెడ్డి, చెంచు, సవర తదితర జాతుల తెగలు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న చెంచు జాతులయితే ఇంకా పాత వ్యవ సాయోత్పత్తి విధానంలోనే కొనసాగుతున్నారు. గోండు, కోయ తదితర తెగలు గోదావరి తీరంలో నల్లరేగడి నేలల్లో పత్తి, పొగాకు, మిర్చి లాంటి వాణిజ్య పంటలు పండిరచడం నేర్చుకున్నారంటే అది పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణలోని ‘సెటిలర్స్‌’ ప్రభావం వల్లనే. నిజానికి పోడు వ్యవసాయమే ఈ అడవి బిడ్డల ప్రధాన జీవనాధారం.
ప్రధాన తెగలు మూడు
మనదేశంలో ప్రధానంగా మూడు రకాల గిరిజన తెగలు కనిపిస్తాయి. ఒకటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో, కొండలు కోనల్లో జనజీవన స్రవంతికి దూరంగా నివసించేవారు. వీరు అడవులు, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తారు. స్వతంత్ర జీవులైనప్పటికీ ఆర్థికంగా బాగా వెనకబడిన తెగలివి. రెండు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నా, వ్యవసాయం ప్రధానంగా చేసే ఆదిమ తెగలు. వీరికి పాక్షికంగా గిరిజనేతరులతో సంబంధాలుంటాయి. సామాజిక, వ్యాపార లావాదేవీలు ఉండే అవకాశముంది. మూడు మైదాన ప్రాంతాల్లోని గిరిజన సమూహాలు. జనజీవన స్రవంతిలో భాగంగా ఉండి ఆధునిక జీవన విధానానికి దగ్గరగా ఉంటారు. ప్రభుత్వం కల్పించే చాలా అభివృద్ధి పథకాలు ఈ మైదాన ప్రాంతాల్లో స్థిరపడిన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దగ్గరగా ఉన్న తెగలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. అందుకే వీరిలో విద్య, ఉద్యో గాలు, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో భిల్లులు, మధ్యప్రదేశ్‌లో సంతాల్‌లు, బిహార్‌లో ముండాలు, మహారాష్ట్ర, తెలం గాణల్లో రాజ్‌ గోండులు, లంబాడీలు జనజీవన స్రవంతికి చాలా దగ్గరగా ఉండే సమూహాలు. అందుకని వీరిలో రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి కనిపిస్తుంది. అదే చెంచు లాంటి తెగలను గమనిస్తే వారింకా జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు.
సామాజిక, మానవ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో 5 వేలకు పైగా గిరిజన తెగలున్నాయి. 38 కోట్లమంది ఆదివాసీ గిరిజన ప్రజలు మనుగడ సాగిస్తున్నారు. ఒక్క భారత దేశంలోనే పది కోట్ల నలభై లక్షల మంది, 500కు పైగా తెగలుగా విస్తరించి ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వీరి జనాభా ఎక్కువ. ఆయా రాష్ట్రాల మొత్తం జనాభాలో 80 నుంచి 90 శాతం గిరిజనులే. వీరిలో జనాభా పరంగా చూస్తే మధ్యప్రదేశ్‌, మహా రాష్ట్ర, తెలంగాణల్లో విస్తరించిన గోండు తెగ అత్యధిక జనాభాతో ఉంది. ఈ గోండుల్లో కూడా రకరకాల వారున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో కోయ, కొండదొర, సవర, కొండరెడ్డి. తెలంగాణలో రాజ్‌గోండులు, లంబా డీలు, చెంచులు, ఎరుకలు, గుత్తికోయ, కోలమ్‌, నాయక పోడు. తమిళ నాడులో ఇరుల, తోడా, కురుంబా, కడార్‌లు. కర్ణాటకలో నాయికాడ, మరా టీలు. కేరళలో కుళయన్‌, పనియన్‌. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో అండ మానీలు, జారవాలు, నికోబారీలు ప్రధాన తెగలు. రకరకాల కారణాల వల్ల జారవా అనే తెగతో పాటు అండమానీలు అంతరించే స్థితిలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో ఎక్కువగా కనిపించేవారు మరియా గోండులు. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో కనిపించేవారు రాజ్‌ గోండులు. రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ప్రధానమైన తెగ భిల్లులు. బిహార్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లలో సంతాల్‌లు. జార్ఖండ్‌లో ముండాలు అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన సమూహం. మహా రాష్ట్ర, గుజరాత్‌లలో కూడా గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలు మిజోరాం జనాభాలో 95 శాతం, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘా లయల్లోని జనా భాలో 80 శాతం, నాగాలాండ్‌లో 85 శాతం గిరిజన తెగలే. మధ్య ప్రదేశ్‌, ఒడిశాల్లో 25 శాతం వరకు గిరిజన జనాభా ఉంది. గుజరాత్‌లో 14 శాతం, రాజస్థాన్‌లో 12 శాతం, అసోం, బిహార్‌ల్లో 10 శాతం, తెలంగాణలో 9.8 శాతం గిరిజన జనాభా ఉన్నారు.
కోయ తిరుగుబాటు
‘కోయ’ అనేది ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో నివసించే ఒక తెగ. వీరు ఇంద్రావతి, గోదావరి, శబరి, సీలేరు నదుల పరీవాహక ప్రాంతాల్లోను, బస్తర్‌, కొరాపూట్‌, భద్రాచలం, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవులైన తూర్పు కనుమలలోను కనిపిస్తారు. భారతీయ కుల వర్గీకరణ ప్రకారం వీరు షెడ్యూల్‌ ట్రైబ్‌ గ్రూపునకి చెందినవారు. 1991 జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య 1,40,000. వీరిలో ఐకమత్యం ఎక్కువ. నాయకుడి ఆదేశం తు.చ.తప్పక పాటిస్తారు. దేశభక్తి కూడా ఎక్కువే. 1880లో వీరు బ్రిటీషు పాలనపై తిరుగుబాటు చేశారు. దీన్ని’ కోయ’ తిరుగుబాటు అంటారు. వీరు మాట్లాడే కోయ భాష తెలుగు భాషకు దగ్గరగా ఉంటుంది. కోయ భాషకు లిపి లేదు. దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణకు చెందిన చరిత్ర పరిశోధకులు ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు గిరిజన సంస్కృతిపై విశేష కృషి చేస్తున్నారు. కోయల్లో రాచకోయ, లింగదారి కోయ, కమ్మర కోయ అరిటి కోయ అనే ఉప కులాలున్నాయి. ఈ ఉపకులాల్లోని ఆహారపుట లవాట్లన్నీ ఒకేలా ఉండవు. ఒక్క లింగదారి కోయలు తప్ప, మిగతా వారంతా గొడ్డు మాంసం తింటారు. రాచ కోయలు గ్రామ పెద్దలుగా ఉంటారు. పండుగ సమయాల్లో వీరు కొన్ని రకాల పూజలు చేస్తారు. భూమి పండుగ, కొత్తల పండుగ లాంటివి ఆచరిస్తారు. ప్రకృతే వీరి ఆరాధ్య దైవం. కమ్మర కోయలు వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తారు. అరిటి కోయలు పాటలు పాడుతారు, వంశ వృక్షాలను వివరిస్తారు.
సామాజిక స్పృహ ఎక్కువే
జీవిత భాగస్వామిని చర్చలద్వారా ఎన్నుకొంటారు. వివాహ వేడుకను రెండు గ్రామాల ప్రజలు కలిసి మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొంత ధాన్యం, కొంతమద్యం పెళ్ళికూతురి ఇంటికి తీసుకువెళతారు. పెళ్ళి కూతురు తండ్రికి ఆర్థిక వెసులుబాటుగా ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. అమ్మాయి తండ్రిని ఆర్థ్ధిక ఇబ్బందుల్లో పడేయకూడదన్న వారి సామాజిక స్పృహకు ఇది నిదర్శనం. తాటికల్లు ఎక్కువగా దొరికే వేసవిలో వివాహాలు జరుగుతాయి. సహజంగానే వీరు చాలా నమ్మకస్తులు. మంచి స్నేహి తులు. నమ్మితే ప్రాణమైనా ఇస్తారు తేడావస్తే ప్రాణం తియ్యడానికీ వెను కాడరు.
ఎవరి హక్కులు వారికి దక్కాలి
స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటిపోయినా ఆదివాసీ గిరిజనులకు ఇంకా సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం రాలేదని చెప్పాలి. ఇప్పటికీ రవాణా సౌకర్యం, రక్షిత మంచినీరు, విద్యుత్తు, విద్యా సౌకర్యాలు లేని ఆదివాసీ గిరిజన గూడేలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వం గిరిజనుల కోసం కేటాయిస్తున్న బడ్జెట్‌ అర్హులకు దక్కడం లేదు. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్ని ప్రభుత్వ సంస్థలు వచ్చినా, ఎన్నెన్నో పథకాలు తెచ్చినా వారి జీవితాలలో విప్ల వాత్మకమైన మార్పు రాలేదన్నది వాస్తవం. హక్కులు, అభివృద్ధి, అధికారాల కోసం, వారికి ప్రత్యేకంగా సంక్రమించిన చట్టాల పరిరక్షణ కోసం గిరిజన సోదరులు ప్రజాస్వామ్యబద్దంగా, న్యాయ పోరాటాలు చేపట్టాలి. పభుత్వాలు ఆదివాసీ గిరి జనుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అభివృద్ధి, సంక్షేమం కోసం, రాజ్యాంగ బద్దంగా వారికి దక్కవలసిన హక్కులు, అధికారాలు, ఫలాలు దక్కే విధంగా పటిష్టమైన చర్యలు తీసు కోవలసిన అవసరం ఉంది.
(నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం)
వ్యాస రచయిత సీనియర్‌ జర్నలిస్టు
9912580645

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img