Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

తగ్గుతున్న మత విశ్వాసాలు

సత్య

భగవంతుడు ఉన్నట్లు తాము చెప్పలేమని సగం మంది అమెరికన్లు భావిస్తున్నారని ఇటీవలి జనరల్‌ సోషల్‌ సర్వే చికాగో విశ్వవిద్యాలయం వెల్లడిరచింది.1972 నుంచి ఈ సంస్థ అమెరికా సామాజిక ధోరణుల మీద జరుగుతున్న సర్వేల ప్రకారం ప్రస్తుతం సగం మంది అమెరికన్లు మాత్రమే దేవుడి ఉనికి గురించి గట్టి విశ్వాసంతో ఉన్నారట. 1993లో మూడిరట రెండు వంతులు, 2008లో 60 శాతం నుంచి ఇప్పుడు 50శాతానికి తగ్గారు. జనాభాలో అసలు చర్చ్‌కు వెళ్లని వారు 34 శాతం ఉన్నారని, గడచిన ఐదు దశాబ్దాల్లో ఇది అధికమని తేలింది. మరణం తరువాత జీవితం ఉంటుందనే నమ్మకం మాత్రం ఎక్కువ మందిలో ఉంది. తాము క్రైస్తవులమని చెప్పుకున్న వారు 1990 దశకంలో 90శాతం ఉండగా ఇప్పుడు మూడిరట రెండు వంతులకు తగ్గారు. పిఆర్‌ఆర్‌ఐ సర్వే ప్రకారం 2008లో తమకెలాంటి మత అనుబంధం లేదని చెప్పిన వారు 16శాతం కాగా 2022లో 27శాతానికి పెరిగారు. ఏసు క్రీస్తును రక్షకుడు, ప్రభువు అని గట్టిగా నమ్మే ఇవాంజెలికల్‌ ప్రొటెస్టెంట్స్‌ ఇదే కాలంలో 23 నుంచి 13.6శాతానికి తగ్గారు.196581 కాలంలో పుట్టిన జనరేషన్‌ ఎక్స్‌లో 25శాతం,19822004 మధ్య పుట్టిన మిలీనియల్స్‌లో 29శాతం 19962010 మధ్య జన్మించిన జడ్‌ తరంలో 34శాతం మంది ఏ చర్చ్‌కు అనుబంధంగా లేరు. ‘‘ మతం నుంచి స్వేచ్చ ఫౌండేషన్‌ ’’ సహ అధ్యక్షుడు డాన్‌ బార్కర్‌ ప్రపంచంలో మతం గురించి, మారుతున్న వైఖరిమీద స్పందిస్తూ అమెరికాలో బలమైన మతవిశ్వాసాలు ఉన్నవారు తగ్గటాన్ని హర్షిస్తూ, ఇతర ఐరోపా దేశాలతో అమెరికా పోటీ పడుతున్నదన్నాడు. ఒక దేశంలో మెజారిటీ మతం మరొక చోట మైనారిటీగా ఉండవచ్చు. మన దేశంలో హిందూ అని పిలుస్తున్న మతంలో వివిధ శాఖలు ఉన్నట్లుగానే క్రైస్తవం, ఇస్లాం, ఇతర మతాల్లో కూడా ఉన్నాయి. తమ దేశంలోని 75వేల మసీదుల్లో 50వేలను మూసివేసినట్లు ఇరాన్‌ మౌలానా మహమ్మద్‌ అబోలఘాసిమ్‌ దౌలబీ జూన్‌ ఒకటిన చెప్పాడు. మసీదులకు వచ్చేవారు గణనీయంగా తగ్గటమే దీనికి కారణం అన్నాడు. ఆయన ప్రభుత్వంమత సంస్థల సమన్వయకర్తలలో ఒకడు. దీని గురించి హిందూత్వకు పక్కాగా మద్దతు పలికే, ముస్లింల మీద విద్వేషాన్ని వెదజల్లుతుందనే విమర్శ ఉన్న ఓపి ఇండియా వెబ్‌పోర్టల్‌ రాసింది. ఇస్లామిక్‌ విశ్వాసాలతో ఛాందసవాదుల హవా నడుస్తున్న చోట ఇలాంటి పరిణామం మన దేశాన్ని హిందూ ఛాందసవాదం, మనువాద హిందూత్వం వైపు తీసుకుపోవాలని చూస్తున్న శక్తులకు ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పవచ్చు. హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనకు దిగిన ఇరాన్‌ మహిళలకు ప్రపంచమంతా జేజేలు పలికింది. అదే తీరున మన దేశంలో కూడా మతఛాందసులు, మతోన్మాదుల అజెండా మేరకు సమాజాన్ని నడిపితే ఇక్కడ కూడా వ్యతిరేకత వెల్లడైతే హిందూత్వ అజెండా కుప్పకూలుతుందన్న భయం ఆశక్తులకు కలగటం సహజం. ఇరాన్‌ మతశక్తులు పౌరుల జీవితాల మీద మతాన్ని రుద్దటాన్ని అక్కడి సమాజం తిరస్కరించటం నానాటికీ పెరుగుతోంది. శిక్షను సహించటం లేదు. ‘‘సమాజంలోని బలమైన మత భావనలు అంతరిస్తున్నాయి. మతం ఇచ్చేదాన్ని జనం చూస్తారు, మతం పేరుతో జనాలను అవమానించటం, మత బోధనలు, భావనల పేరుతో మతపరమైన కల్పనలతో సహా అనేక కారణాలు, ఇంకా మతం పేరుతో పౌరులకు గౌరవ ప్రదమైన జీవితాన్ని నిరాకరించటం, వారిని దారిద్య్రంలో నెట్టటం వంటి అంశాలను బట్టి ఆ మతంలో చేరాలా లేక దాన్ని వదలి వెళ్లాలా అని నిర్ణయించుకుంటారు.’’ అని కూడా మౌలానా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. హిజాబ్‌ను సరిగా ధరించలేదనే కారణంతో నైతిక పోలీసులు గతేడాది సెప్టెంబరులో మహసా అమిని అనే యువతిని దారుణంగా కొట్టి చంపటంతో పెద్ద ఎత్తున ఇరాన్‌లో నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రార్ధనలకు వచ్చేవారు లేక 60శాతం మసీదులను మూసినట్లు వార్తలు వచ్చాయి.
లవ్‌ జీహాద్‌, లాండ్‌ జీహాద్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్‌ లోని ఉత్తర కాశీ జిల్లా పురోలా పట్టణంలో ఉన్న ముస్లింలందరూ వెళ్లిపోవా లంటూ హిందూత్వ పేరుతో ఉన్న శక్తులు జూన్‌ 15వ తేదీ గడువు నిర్ణయించి బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. హిందువుల్లో ఒక కులం వారు మరొక కులం వారిని వివాహం చేసుకోకూడదంటూ ఉత్తరాది రాష్ట్రాలలో తీర్పులు చెప్పే పంచాయత్‌లను చూస్తున్నాము. ఇది వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవటం తప్ప వేరు కాదు. ఇదే పని ఇతర మతఛాందసులు చేసినా అదే అవుతుంది. రెచ్చిపోతున్న మతశక్తులను చూస్తే మన దేశం కూడా ఈ రోజుగాకపోతే రేపు మరో ఇరాన్‌ అవుతుంది. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు తమ దేశంలో బౌద్ధం అంతరించటానికి కారకులౌతున్నారంటూ శ్రీలంకలోని బౌద్ధ మత ఛాందసులు రెచ్చిపోతున్నారు. రెచ్చగొట్టి దాడులకు పాల్పడేందుకు చూస్తున్నారు.
మతంతో నిమిత్తం లేనివారు అమెరికాలో పెరుగుతున్న కారణంగా ప్రతి ఏటా అనేక చర్చ్‌లు మూతపడుతున్నట్లు వార్తలు. చర్చి ప్రాంగణాలను కొనుగోలుచేసేవారికి భలేమంచి చౌకబేరం అన్నట్లుగా ఉంది. 2019లో నాలుగున్నరవేల ప్రొటెస్టెంట్‌ చర్చ్‌లు మూతపడితే, గతేడాది మూడువేల కొత్త చర్చ్‌లు ప్రారంభమైనట్లు వార్తలు. మొత్తం మీద జనాలు చర్చ్‌లకు రాకపోవటం తాత్కాలికమా లేక అదే ధోరణి ముందు కూడా కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గడచిన మూడు సంవత్సరాల ధోరణులను చూసినపుడు మూసివేతలకే ఎక్కువ అవకాశాలున్నట్లు కొందరు భావిస్తున్నారు. కరోనా తరువాత చర్చ్‌లకు వస్తున్నవారిని చూస్తే అంతకు ముందు వచ్చే వారిలో 85శాతమే ఉన్నట్లు ప్రొటెస్టెంట్‌ పాస్టర్లు నివేదించారట. కరోనాకు ముందు ఏడాదికి కనీసం ఒకసారి చర్చ్‌కు వచ్చినవారు 75 శాతం ఉంటే గతేడాది 67కు తగ్గారు. కుర్రకారు హైస్కూలు చదువులో ఉండగా కనీసం ఒకఏడాది పాటు చర్చ్‌కు ప్రతివారం వచ్చేవారని 2017 వివరాలు వెల్లడిరచగా ఇప్పడు ప్రతి పదిమందిలో ఏడుగురు రావటం లేదని లైఫ్‌వే పరిశోధనలో తేలింది. మతంతో సంబంధం లేకుండా పిల్లల్ని పెంచుతున్నవారు పెరగటం దీనికి ఒక కారణం అంటున్నారు. పూ సంస్థ విశ్లేషకులు చెప్పినదాని ప్రకారం 1972లో 92 శాతం మంది అమెరికన్లు క్రైస్తవులుగా చెప్పుకోగా 2070 నాటికి 50శాతం లోపుకు పడిపోవచ్చట. ఇప్పుడున్న వారిలో తాతలు ప్రతివారం చర్చ్‌కు వెళ్లి ఉంటారని, వారి పిల్లలు తమకు దేవుడు అంటే విశ్వాసం అని చెప్పారు తప్ప ప్రతివారం విధిగా చర్చ్‌కు వెళ్లలేదని, మిలీయన్‌ మనవల దగ్గరకు వచ్చేసరికి చర్చికి వెళ్లే సంబంధాలు గానీ, మతంతో గానీ అనుభవం తక్కువని కొందరు విశ్లేషకులు చెప్పారు. కాథలిక్‌ చర్చ్‌లో సెక్స్‌ కుంభకోణాల కారణంగా జనాలు చర్చ్‌లకు దూరంగా ఉంటున్నారని, దానికి కరోనా కూడా తోడైందని కూడా తేలింది.
కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఇలాంటి పరిణామం ముందే జరిగిందని, అమెరికాలో మెల్లగా జరుగుతోందని చెబుతున్నారు. దీనికి సోషలిస్టు దేశాలతో అమెరికా జరిపిన ప్రచ్చన్న యుద్ధం కారణమని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. క్రైస్తవ అమెరికా`దేవుడులేని కమ్యూనిజం మధ్య పోరు జరుగుతోందని, మతం లేని వారు అసలు అమెరికన్లే కాదని రెచ్చ గొట్టారు. (ఇప్పుడు మన దేశంలో ఎవరైనా బీజేపీ, సంఘపరివార్‌, హిందూత్వ సంస్థలను లేదా మతంలోని అవ లక్షణాలను, మూఢ విశ్వాసాలను ఎవరైనా విమర్శిస్తే లేదా వారితో ఏకీభవించకపోతే మీరు హిందువులే కాదంటూ రెచ్చగొడుతున్న తీరు చూస్తున్నదే).

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img