Monday, August 8, 2022
Monday, August 8, 2022

మానవీయతను మరిచిన అధికారులు

ఎస్‌.మునెప్ప

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 15 ఏళ్లకు పైగా రోగులకు సేవలందిస్తున్న 107 మంది ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. వీరిలో ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషయన్లు, ఫార్మసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌ అనుమతితో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ద్వారా నియమితులయ్యారు. ఒక్క కలంపోటుతో హాస్పటల్‌ సూపరింటెండెంట్‌ మార్చి 31న మూడు ఏజెన్సీలో పనిచేస్తున్న వారిని తొలగిస్తున్నామని సంబంధిత ఏజెన్సీ తెలిపింది. ఇది ఎంతవరకు కరెక్ట్‌, ఇది ఎక్కడ న్యాయం?
ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను ఇలా తొలగించవచ్చా? లేబర్‌ యాక్ట్‌ ప్రకారం ఔట్‌ సోర్సింగ్‌్‌ కార్మికులను తొలగించాలంటే మూడు నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. వారి జీతభత్యాలు చెల్లించాలి. పిఎఫ్‌, ఇఎస్‌ఐ సెటిల్మెంట్‌ చేయాలి. తొలగించినా తర్వాత మూడు నెలల జీతాలు చెల్లించాలని, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను తొలగించిన ఆ ఉద్యోగం తిరిగి ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులతోనే భర్తీ చేయరాదు. చట్టనిబంధనలు పాటించకుండా, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు నోటీసులు ఇవ్వకుండా, మూడు నెలల జీతాలు చెల్లించకుండా, చట్ట విరుద్ధంగా తొలగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కాంట్రాక్టర్ల దోపిడిని అరికట్టడానికి, కార్మికులకు నేరుగా జీతాలు చెల్లించేందుకు ఏర్పాటు చేసిన ఆప్కాస్‌లో వీరిని ఎందుకు చేర్చలేదు. కారణమేమంటే 2019లో వీరందరినీ ఆప్కాస్‌లో చేరుస్తామని హాస్పిటల్‌ క్లర్క్‌ ఒకాయన వీరందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు. అవినీతి ఆరోపణలతో క్లర్కుపై చర్యలు తీసుకొని సస్పెండ్‌ చేశారు. తరువాత ఏఐటియుసి కాంట్రాక్ట్‌ మెడికల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఔట్‌ సోర్సింగ్‌్‌ కార్మికులను కార్పొరేషన్‌లో కలపాలని, 12 రోజులు నిరసనలు, ఆందోళనలు చేసిన తరువాత సూపరింటెండెంట్‌ ఎడి రమేష్‌ బాబు 140 మందిని కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రి నుండి కార్పొరేషన్‌లో కలపాల్సిన ఉద్యోగుల లిస్టు పంపారు. ఆప్కాస్‌ వారు ఇచ్చిన లిస్టును సరైన వివరాల్లో మ్యాపింగ్‌ చేసి పంపమని తిరిగి కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు అయితే హాస్పటల్లో సూపరింటెండెంట్‌ గాని, ఎడి రమేష్‌ బాబు గానీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ హాస్పిటల్‌కు వచ్చినా, నోటీసులు ఇచ్చిన పట్టించుకోలేదు. కారణం టెర్మినేషన్‌ ఆర్డర్‌ కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అందజేశారు.
ఎందుకు టెర్మినేట్‌ చేశారని కార్మిక సంఘాలు, విలేకరులు అడిగితే హాస్పటల్‌ సూపరింటెండెంట్‌ తనకి ఏమి తెలియదని, ఎడి రమేష్‌బాబు చేసినట్లు వివరించారు .ఎడిని అడిగితే టెర్మినేషన్‌ ఉత్తరంలో సూపరింటెండెంట్‌ సంతకం ఉంది కానీ నా సంతకం లేదని తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. కార్మికులను తొలగించే ఫైలుకు సంబంధించిన క్లర్కు సంతకం గాని ఎడి సంతకం కానీ ఎందుకు లేదు. దీని అర్థం ఏమిటి? ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపుగా, ఉద్యోగులను తొలగించారా? తొలగించడం వలన హాస్పిటల్‌ అధికారులకు ఉపయోగమేమి? కర్నూల్‌ ప్రభుత్వ హాస్పటల్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వ్యాపారం జోరుగానే సాగుతుంది.
స్వీపర్‌ పోస్టు, సెక్యూరిటీ పోస్టు, ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నట్లు పత్రికలలో, టీవీలలో కూడా వచ్చింది. కానీ ఏ అధికారి పైన గాని, ఏజెన్సీ కాంట్రాక్టర్ల పైన గాని, ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోలేదు. తొలగించిన రోజు నుండి ఎఐటియుసి ఆధ్వర్యంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు. నిరసనలు, ధర్నాలు, గొంతుకు ఉరితాళ్లు బిగించుకొని గత 120 రోజులుగా కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్‌ ఆవరణంలోనే టెంట్‌ వేసుకొని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ ఉద్యమానికి సంఫీుభావంగా అనేక ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంఫీుభావం తెలిపారు. స్థానిక కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌తో వీరికి న్యాయం చేయమని కలెక్టర్‌ని కోరారు. ప్రతిస్పందనలోను కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్‌ ముగ్గురు జిల్లా ఆఫీసర్లతో కమిటీ వేశారు. కమిటీలో డిఆర్‌ఓ కర్నూల్‌, ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ జిల్లా వైద్య అధికారులును నియమించారు. హాస్పిటల్‌ అధికారులను, తొలగించిన ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను, ఎఐటియుసి నాయకులను విచారించారు. ఆ విచారణలో హాస్పిటల్‌ అధికారులు నిధులు లేనందున జీతాలు ఇవ్వలేక తీసివేశామని, మీరు తిరిగి తీసుకోమంటే తీసుకుంటామని చెప్పారు. వీరిని తీసేయమని ఎవరు చెప్పారు, ఏ జీవో ప్రకారం తీసివేశారని అడిగితే, అపసవ్య సమాధానాలను హాస్పిటల్‌ అధికారులు చెప్తున్నారు. డబ్బులు లేకుంటే అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారిని ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన పోస్టులలో తీసుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు. త్రిసభ్య కమిటీ అధికారులను ప్రశ్నిస్తే దాటవేసే సమాధానం చెప్పారు. తమకు న్యాయం చేయాలని గౌరవ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టుసత్యనారాయణ, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని, బొత్స సత్యనారాయణలను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. అయినా ఇప్పటికీ వీరి సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషియషన్‌ పనులను, సెక్యూరిటీ గార్డులకు ఆ విధులకు పురమాయిస్తున్నారు. ల్యాబ్‌లోకి కొత్తగా వచ్చిన వారిని పరీక్షలు చేయలేక, పేద రోగులకు రక్త పరీక్షలు, ఇతర పరీక్షలకు బయటకు రాస్తున్నారు. ఖాళీగా ఉన్న రేడియోగ్రాఫర్‌ పోస్టులు ఉన్నాయి. కొత్తగా జరిగిన నియమాకాల్లో స్టాఫ్‌నర్స్‌ పోస్టు భర్తీ కాలేదు.
ఏఎన్‌ఎంలు చాలామంది ఉద్యోగాలకు రాలేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ లేక చాలా డిపార్టుమెంట్లో వివరాలు పంపలేకపోతున్నామని హాస్పటల్లో హెచ్‌ఓడీలు మాకు ఉద్యోగులను పంపమని అడుగుతున్నారు. అలాంటప్పుడు ఉద్యోగాల్లో వీరిని ఎందుకు నియమించడం లేదు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖలో ఖాళీలు ప్రజల అవసరార్థం ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవచ్చు అని జీవో నెంబర్‌ ఎంఎస్‌ 188 స్థానిక జిల్లా కలెక్టరుకు అధికారం ఇచ్చింది. మరి ఎందుకు కలెక్టర్‌ వీరికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సమయం కావాలి అంటున్నారు. దాదాపు 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వీరిని ఉన్న పళంగా తొలగించారు. చేశారు. నాలుగు నెలలుగా అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఆందోళనలు చేస్తున్నప్పటికి ఏ అధికారి వీరి సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదు. తక్షణమే తొలగించిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కర్నూలు జిల్లా కలెక్టర్‌ కృషి చేయాలని, లేనియెడల వీరి న్యాయమైన సమస్య పరిష్కారం కొరకు కార్మికులు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కార్మిక సంఘాల మద్దతుతో ఆందోళన తీవ్రతరం చేయనున్నారు.
వ్యాసరచయిత రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ మెడికల్‌ కాంట్రాక్ట్‌ అండ్‌
వర్కర్స్‌ ఎంప్లాయుస్‌ యూనియన్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img