అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు
ఉదయం 8.00గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం
జిల్లాలో ముందుగా వెలువడనున్న పార్వతీపురం నియోజకవర్గ ఫలితం
విశాలాంధ్ర,పార్వతీపురం/గరుగుబిల్లి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శాంత్ కుమార్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఉద్యాన కళాశాలలో లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టరు , ఎస్పీలు తనిఖీ చేశారు. ఉద్యాన కళాశాలలో జిల్లాలో నాలుగు శాసన సభ నియోజక వర్గాల ఇవిఎం ఓట్ల లెక్కింపుతోసహా అరకు పార్లమెంటు నియోజక వర్గానికి చెందిన మొత్తం పోస్టల్ బ్యాలెట్లు, నాలుగు శాసన సభ నియోజక వర్గాల పరిధిలోని పార్లమెంటు ఇవిఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఇవిఎం ఓట్ల లెక్కింపుకు 8 కౌంటింగ్ హాల్లు,పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు ఒక కౌంటింగ్ హల్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఇవిఎం ఓట్ల లెక్కింపుకు ఎన్నికల కమిషన్ నిబంధనలు మేరకు 14 టేబుల్ లు, పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 20 టేబుల్ లు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఇనుప మెస్ లతో గట్టి భారికేడింగ్ ఏర్పాటు చేశామని, అన్ని కౌంటింగ్ హాల్ లలో ఏసి లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఇవిఎం ఓట్ల లెక్కింపు కేంద్రంకు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కేంద్రాలకు వెళ్ళుటకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఆ మార్గంలో సి ఆర్ పి ఎఫ్, సి ఐ ఎస్ ఎఫ్ సిబ్బంది భద్రత ఉంటుందని ఆయన అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 158 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లు నిరంతర నిఘాలో ఉంటాయని ఆయన వివరించారు. ఇతరులు డ్రోన్లు, ఎగిరే పరికరాలు ఆ ప్రాంతంలో ఎగరవేయకుండా నో ఫ్లై జోన్ గా ప్రకటించామని ఆయన చెప్పారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించుటకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అన్నింటినీ కంట్రోల్ రూం కు అనుసంధానం చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 144వ సెక్షన్ అమలులో ఉందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. లెక్కింపు కేంద్రం వద్ద గట్టి బందోబస్తు, నిఘా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. పోలీస్ సూపరింటెండెంట్, ఏఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, 17 మంది సిఐ లు, 24 మంది ఎస్ ఐ లు తో సహా ఐదు వందల మంది పోలీసు బందోబస్తు, ఒక కేంద్ర బలగంతో బందో బస్తు ఉందన్నారు. అదనంగా మూడు కేంద్ర బలగాలు జిల్లాకు వస్తున్నాయని చెప్పారు.
జిల్లాలో ఇప్పటి వరకు ప్రశాంతంగా సజావుగా జరుగుటకు అందరూ సహకరించారని ఆయన పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అరెస్టు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మొదటి ఫలితం పార్వతీపురందే:
జిల్లాలో మొదటి ఫలితం పార్వతీపురం నియోజకవర్గందే అన్నట్లు అంచనా వేస్తున్నామని చెప్పారు.
ఈకార్యక్రమంలో పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ మరియు అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్ ఎస్ శోబిక, ఎస్డిసి ఆర్ వి సూర్యనారాయణ, అదనపు ఎస్పీ డా. ఓ.దిలీప్ కిరణ్, ఏఎస్పీ సునీల్ షరోన్, పాలకొండ డిఎస్పీ జి.వి. కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.