Friday, August 12, 2022
Friday, August 12, 2022

ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం పొంచివుంది

దేశాన్ని రక్షించుకోవాలి
ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు
అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రామకృష్ణ డిమాండ్

‌విశాలాంధ్ర బ్యూరో`ఒంగోలు : దేశంలో రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదం పొంచివుందని దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సీపీఐ 16వ మహాసభలు శుక్రవారం కనిగిరిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా కనిగిరి పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ ప్రాంగణంలోజరిగిన బహిరంగ సభకు కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో పేదరికం, అంటరానితనం వెంటాడుతున్నాయని రైతులు, కూలీలు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిరదని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రమోడి మాత్రం దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఎందరో త్యాగధనులు ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రాన్ని సాధించుకుంటే నేడు బీజేపీ ప్రభుత్వం హిందువులకు ఇతర మతాల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని అన్నారు. నేడు రాష్ట్రపతిగా గిరిజన మహిళకు పట్టం కట్టామని నిన్నటి వరకు దళితుడికి పట్టం కట్టామని చెబుతున్న ప్రధాన మంత్రి గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో దళితులకు, గిరిజనులకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేస్తూ దేశ సంపదను ఆదాని, అంబానిలకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని అన్నారు. గడిచిన మూడేళ్లలో ఇప్పటికి రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందని, రానున్న రెండు సంవత్సరాల్లో ఈ అప్పు పది లక్షలకు చేరుతుందని అన్నారు. అప్పులపై ఆ పార్టీకి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి సమర్ధించుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా గడిచిన మూడేళ్లలో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీస్తున్న ముఖ్యమంత్రి కొంతమంది అకౌంట్‌లకు డబ్బులు వేస్తే రాష్ట్రం అభివృద్ధి జరగదని అన్నారు. నేడు రాష్ట్రంలో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయందని అన్నారు. దళితులపై రోజురోజుకు దాడులు జరుగుతున్నాయని ఉదాహరణకు నర్సీపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌, రాజమండ్రిలో దళిత యువకున్ని పోలీసు స్టేషన్‌లో గుండు గీయించడం, కాకినాడలో దళిత యువకుడు సుబ్రమణ్యంను చంపి కారులో డెడ్‌బాడీని వారి తల్లిదండ్రులకు అప్పగించిన ఘటనలను ప్రస్తావించారు. ఇటీవల రేపల్లి రైల్వే స్టేషన్‌లో మహిళలపై జరిగిన దాడిని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేకుండా పోతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అంబేద్కర్‌ పేరుతో ఉన్న విదేశీ విద్య పథకాన్ని పేరుమార్చి జగన్మోహన్‌రెడ్డి పేరు పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిరచారు. ముఖ్యమంత్రి అంబేద్కర్‌, జ్యోతిరావుపూలే వంటి వ్యక్తుల జోలికి వెళ్తే కాలగర్భంలో కలవక తప్పదని అన్నారు. అంబేద్కర్‌ ప్రపంచ మేధావి అని ఆయన పేరుమీద ఉన్న పథకాలను కూడా జగన్మోహన్‌రెడ్డి పేరుగా మలుచుకోవడాన్ని తప్పుపట్టారు. ఇదేమిటని ప్రశ్నించే వామపక్షాలను ప్రజా సంఘాలను, ఉద్యోగస్తులను గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో వారి హక్కులను, వారి సమస్యలను చెప్పుకునే హక్కు ఉందని, ఆ హక్కును ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని హక్కులను అణిచివేస్తున్నారని తెలిపారు. మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ఇటీవల వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రతిపక్షాలను తిట్టడం, తనను ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడిరచుకోవడం తప్ప ప్లీనరీ వలన ఏమి సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. గడిచిన మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిలో గత ప్రభుత్వంలో రోజుకు 40 వేల మంది కార్మికులు పనిచేస్తే ప్రస్తుతం ఆ ప్రాంతంలో వాచ్‌మెన్‌లే కనిపిస్తున్నారని అన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం వలన రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో నిర్మించకపోవడం వలన నేడు వరదలకు రెండు లక్షల మంది ముంపుకు గురయ్యారని 500 గ్రామాలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ వారు తాగేందుకు నీరు, భోజనం, కరెంటు వంటి మౌలిక వసతులను కూడా కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు. మరోపక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే దానిని ప్రశ్నించకుండా రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు అడక్కుండానే ఇస్తామని ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని దీనికి సమాధానం చెప్పాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. అనంతరం అఖిలభారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తుందని తెలిపారు. రైతుల హక్కులను హరించే విధంగా కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు చేసిన ఉద్యమం చారిత్రాత్మకమని అన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తితో దేశంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్రం విభజన సందర్భంలో కేంద్రం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని, వాటి సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా 25 వేల లక్షల కోట్లు నరేంద్రమోడి అప్పు చేసి దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దారాధత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల పేరుతో కొంతమందికి బ్యాంకుల్లో డబ్బు వేసి రాష్ట్ర అభివృద్ధిని ఎక్కడికక్కడ నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క పన్నుల భారాన్ని ప్రజలపై మోపుతుందని అన్నారు. ఆర్టీసీ చార్జీలు, కరెంటు బిల్లులు, గ్యాస్‌, డీజిల్‌ ధరలను పెంచి ప్రజలపై అదనపు భారానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. ఈ సభలో సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎంఎల్‌సి పీజే చంద్రశేఖర్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌ వెంకటరావు, వి హనుమారెడ్డి, పీవీఆర్‌ చౌదరి, వై రవీంద్రబాబు, అందె నాసరయ్యతో పాటు కె వీరారెడ్డి, కృష్ణగౌడ్‌, డి ఆంజనేయులు, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కరవాది సుబ్బారావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రానాయక్‌, సీపీఐ మాజీ కార్యదర్శి ఎం వెంకయ్య పాల్గొనగా ఈ సభకు సీపీఐ కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి యాసిన్‌ అధ్యక్షత వహించారు. సభ ముందు ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవగేయాలు అందరినీ ఆకర్షించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img