Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీని ఎదుర్కొనే శక్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది

ప్రధాని బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటే.. ముఖ్యమంత్రి రాష్ట్రాన్నే దోచుకుంటున్నాడు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – ఒంగోలు : దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీని ఎదుర్కొనే శక్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని, కమ్యూనిస్టులు ఐక్య ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సీపీఐ మహాసభ సందర్భంగా శనివారం ప్రతినిథుల సభ జరిగింది. ఈ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సీపీఐ జెండాను జిల్లా మాజీ కార్యదర్శి ఎం వెంకయ్య ఎగురవేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన ప్రతినిథుల సభలో కె రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో ప్రమాదకరమైన ఆర్ధిక రాజకీయ విధానాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు ప్రధానమంత్రి దోచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్నవారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ సీబీఐ, ఇన్‌కంట్యాక్స్‌ అధికారులతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజాస్వామిక లౌకిక శక్తులు, వామపక్షాలు ఏకమై పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని చేస్తున్న తప్పును ఎత్తుచూపుతున్నందుకే ప్రొఫెసర్‌ సాయి లాంటి వారిపై దేశద్రోహం క్రింద కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఒకప్పుడు పార్లమెంట్‌లో కమ్యూనిస్టులే ప్రతిపక్ష పాత్ర పోషించేవారని, ప్రస్తుతం పార్లమెంట్‌, అసెంబ్లీలో వామపక్షాల ప్రభావం తగ్గడం వలన ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి రాష్ట్రాలను, దేశాలను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు సంవత్సరాల పాలనను గమనిస్తే ఆర్ధిక సంక్షోభం ఏర్పడి మరో శ్రీలంకగా మారుతుందా అన్న ఆందోళనకర పరిస్థితులు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అప్పుల కోసం కేంద్రం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణల అమల్లో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పనిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మొదటిలో కొంత మార్పు చేసినప్పటికీ తదనంతరం ఏడాదికేడాది మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకాలు జరిపి సంవత్సరానికి 36 వేల కోట్లు ఆదాయాన్ని అర్జించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. తద్వారా ఒక జగన్మోహన్‌రెడ్డికి సంవత్సరానికి 2 వేల కోట్లకు పైగా కమిషన్‌ రూపంలో వెళ్తుందని అన్నారు. మన రాష్ట్రంతో పోల్చుకుంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్‌పై లీటర్‌కు పది రూపాయల వ్యత్యాసం ఉందని అన్నారు. దీనిని తగ్గించకుండా ఆటోవారికి సంవత్సరానికి రూ.10 వేలు వేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను స్కీంల ద్వారా మాయచేస్తూ రాష్ట్ర అభివృద్ధి విస్మరించారని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం కన్న ఈ ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అదే నిజమైతే తెలుగుదేశం పార్టీ హయాంలో తెచ్చిన అప్పులు, ప్రస్తుత వైసీపీ మూడేళ్లలో చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు డమ్మీలుగానే ఉన్నారని మొత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కనుసైగల్లోనే జరుగుతుందని అన్నారు. దీని ద్వారా రాష్ట్రం మరో శ్రీలంక అయినా ఆశ్చర్యం లేదన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలను ఉధృతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టులే పోరాడుతున్నారని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల ఐక్యత మరింత బలపడాలని సూచించారు. బీజేపీ మినహా అన్ని పార్టీలతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విదానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రభుత్వ అవినీతిని అడ్డుకోగలమన్నారు. గ్రామస్థాయి నుంచి సీపీఐ పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అనంతరం ప్రకాశం జిల్లా నూతన కౌన్సిల్‌ను, కార్యవర్గాన్ని మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ ఎంఎల్‌సి కార్యదర్శి వర్గ సభ్యులు పీజే చంద్రశేఖర్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవాది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img