Friday, April 19, 2024
Friday, April 19, 2024

తెలుగుదేశం పోరాట ఫలితం – అనుమతి కలిగిన ప్రాజెక్టుగా వెలుగొండ

• గెజిట్‌లో చేర్చేందుకు కృషిచేసిన కేంద్ర మంత్రి షెకావత్‌కు కృతజ్ఞతలు
• ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రికి లేఖలో వినతి
• వెలిగొండ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
• తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తొలి టన్నెల్ పూర్తి
• నిర్వాసితులకు పునరావాసం తక్షణమే అందించాలి.
• ఉమ్మడి ప్రకాశం తెలుగుదేశం ఎమ్మెల్యేలు గొట్టిపాటి, ఏలూరి, డోలా

విశాలాంధ్ర – ఒంగోలు : తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమ ఫలితంగానే అనుమతి కలిగిన ప్రాజెక్టుగా వెలిగొండను కేంద్ర గెజిట్‌లో చేర్చారని ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టును అనుమతి కలిగిన ప్రాజెక్టుగా కేంద్ర గేజిట్‌లో చేర్చేందుకు విశేష కృషి చేసిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల పక్షాన, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మూడు జిల్లాల్లో త్రాగు, సాగునీరు అవసరాలను తీర్చే వెలిగొండ ప్రాజెక్టును గతంలో కేంద్రం ప్రకటించిన గెజిట్లో అనుమతి పొందిన ప్రాజెక్టుగా లేకపోవడంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందారని పేర్కొన్నారు. వెనకబడిన ప్రకాశం జిల్లా గొంతు తడిపే వెలిగొండ ప్రాజెక్టును అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్చాలని, తమ సమస్యలు విన్నవించేందుకు ప్రత్యేక సమయం కేటాయించాలని కేంద్ర మంత్రి షెకావత్‌కు లేఖ రాశామని గుర్త చేశారు. లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి గత ఏడాది ఆగస్టు 31న ప్రత్యేకంగా కలిసేందుకు సమయం కేటాయించారని వివరించారు. ఆ సందర్బంగా 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ప్రాజెక్టులను (హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు) పూర్తి చేయాలని స్పష్టంగా పేర్కొన్నామన్నారు. మా ప్రాంత రూపురేఖలను మార్చే “వెలుగొండ”ని ఆ గెజిట్లో ప్రకటించలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చామన్నారు. గడిచిన రెండు దశాబ్దాలుగా వర్షాలు లేక, నీటి ఎద్దడితో అల్లాడుతున్న ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చేయూతను అందించాలని, ఈ వెలిగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప జిల్లాల్లో 56 మండలాలుండగా 28 మండలాలు సాగర్ నీటిపైనా… 23 మండలాలు వెలుగొండ జలాలపైనా ఆధారపడి ఉన్నాయని. పేర్కొన్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుతో 4.59 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.5 లక్షల మందికి తాగునీరు, మూడు జిల్లాల భవిష్యత్తు, అభివృద్ధి ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చామని, మా విన్నపాన్ని మన్నించి వెలుగొండకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా కేంద్ర గేజిట్‌లో అనుమతి కలిగిన ప్రాజెక్టుగా చేర్చారని వివరించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, వారు తీసుకున్న నిర్ణయం మూడు జిల్లాల ప్రజల తాగు, సాగునీరు అవసరాలతో పాటు భవిష్యత్తు తరాలకు కల్పతరువుగా మారిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరామని తెలిపారు.

ప్రజా ఉద్యమ ఫలితంగానే….
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెలుగొండకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. దీనికితోడు పశ్చిమ ప్రకాశానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలను చైతన్యం చేయడంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు లేఖల ద్వారా వివరించామన్నారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టును అడ్డుకోవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సైతం విజ్ఞప్తి చేశామని వారు పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం వెలిగొండకు అనుమతి కలిగిన ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రజల గొంతుకగా రాష్ర్ట ప్రభుత్వానికి పలుమార్లు వివరించినా స్పందన లేకపోవడంతోనే కేంద్రం దృష్టికి సమస్యను తీసుకువెళ్ళామన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతోనే మూడు జిల్లాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రం ముందడుగు వేయడంతో వెలిగొండకు అనుమతి కలిగిన ప్రాజెక్టుగా గుర్తింపు లభించిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి….
ఉమ్మడి మూడు జిల్లాలను సస్యశ్యామలం చేసే వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే తొలి టన్నెల్ హెడ్ రెగ్యులేటరీ పూర్తిచేశామని గుర్తు చేశారు. చివరి దశలో ఉన్న పనులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్నారు. నిర్వాసితులకు సుమారు 1300 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జి.ఒ. ఇచ్చి ఏడాది గడిచినా అతీగతీ లేదన్నారు. తక్షణమే నిర్వాసితులకు పరిహారం చెల్లించి వారిని అక్కడి నుంచి తరలించాలన్నారు. ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పూర్తిచేసి నీటిని అందించాలని డిమాండ్ చేశారు. లేఖ రాసిన వారిలో అద్దంకి శాసన సభ్యులు గొట్టి పాటి రవికుమార్, పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు, కొండపి శాసన సభ్యులు డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా మాజీ జడ్.పి. చైర్ పర్సన్ నూకసాని బాలాజి, మార్కాపురంమాజీ శాసనభ్యులు కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు మాజీ శాసనభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి, కనిగిరి మాజీ శాసనభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ఒంగోలు మాజీ శాసనభ్యులు దామచర్ల జనార్ధన్, కందుకూరు మాజీ శాసనభ్యులు పోతుల రామారావు, సంతనూతలపాడు మాజీ శాసనభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, కందుకూరు మాజీ శాసనభ్యులు డా. దివి శివరామ్, యర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు, కందుకూరు ఇన్‌ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ర్ట కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, మాజీ శాసనసభ్యులు, చీరాల ఇన్‌ఛార్జ్ ఎమ్.ఎమ్. కొండయ్య, పిడతల సాయి కల్పనారెడ్డి, మాజీ శాసనసభ్యులు నారపుశెట్ట పాపారావులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img