Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నీరుగారిపోయే .. !

. విరిగిన గుండ్లకమ్మ గేటు
. ఎండనున్న నాగులుప్పలపాడు
. అటు వరి, ఇటు మిర్చి సాగుపై నీలి నీడలు
. ఆందోళనలో రైతాంగం

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : జిల్లా జలప్రదాయని , గుండ్లకమ్మ జలశయ గేటు విరిగిపోవడంతో నాగులుప్పలపాడు మండలంలోని రైతాంగం ఆశలు నీరుగారిపోతున్నాయి . గుండ్లకమ్మ జలాశయం మద్దిపాడు మండలంలో ఉన్నా .. దాని ఆయకట్టు ప్రధానంగా నాగులుప్పలపాడు మండలంలోనే ఉంది . మొత్తం 80,060 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉన్న ఈ ప్రాజెక్టుకు 56 వేల ఎకరాలు నాగులుప్పలపాడు మండలం పరిధిలోనే ఉండడం గమనార్హం.
గుండ్లకమ్మ జలాశయం ఏర్పాటుతో నాగులుప్పలపాడు మండలంలో వ్యవసాయ స్వరూపానే మారిపోయింది అనడంలో ఆశ్చర్యం లేదు . అంతకు మందు వరకు కేవలం మెట్ట పంటలు పండించి శనగలు ‘తిన్నామా … చేతులు కడుకున్నామా .. ‘ అన్న చందంగా సాగిన సేద్యం నేడు మిర్చి వంటి వాణిజ్య పంట , పండ్లతోటలు , కూరగాయల సాగుకు అనుకూలంగా మారింది . ప్రధానంగా మిర్చి ఈ కాలువల పరిధిలో 15 వేల ఎకరాల్లో సాగువుతోంది . దీంతో ఈ ప్రాంతానికి ‘చిన్నబలారి’గా గుర్తింపు సైతం వచ్చింది . ఇక వరి సాగులో ప్రధానంగా కనపర్తి ఎత్తిపోతల పథకం కింద 5 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా , గుండ్లకమ్మ ప్రాజెక్టు దిగువనా నది వెంబడి , మల్లవరం , ఇనమనమెళ్లూరు , కీర్తిపాడు , చేకూరపాడు , ఉలిచి తదితర గ్రామాల్లో ఎత్తిపోతల పథకం కింద అదనంగా మరో 3 వేల ఎకరాల వరకు వరి సాగు విస్తీర్ణం ఉంది . ప్రస్తుతం గుండ్లకమ్మ గేటు విరిగి నీరు వృథాగా పోతుండడంతో అటు వరి రైతుల్లోనూ ఇటు మిరుప రైతుల్లోనూ ఆందోళన నెలకొంది . ప్రాజెక్టులో నీరు వృథా అయితే ఇక తమ ప్రాంతంలో కరువు తప్పదని రైతాంగం ఆందోళన చెందుతోంది.
టీఎంసీ నీరు వృథా
బుధవారం సాయంత్రం గేటు విరిగిపోగా , నాటి నుంచి ప్రాజెక్టు నుంచి ఇంచుమించు ఒక టీఎంసీ నీరు వృథాగా సముద్రం పాలు అయినట్లు అధికారుల అంచనా . ఆ మేరకు ఒక టీఎంసీ నీటితో ఆయకట్టు పరిధిలోని భూములు దాదాపు సస్యశ్యామలం అయ్యేవి . ఐదువేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉన్న కనపర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో విస్తీర్ణానికి అర టీఎంసీ నీరు పుష్కలంగా సరిపోతోంది . అంటే ఈ లెక్కన ప్రాజెక్టు దిగువన ఎత్తిపోతల పథకాల పరిధిలో ఉన్న వరి సాగుకు ఏడాది పొడవున సరిపోయేంత నీరు వృథాగా సముద్రం పాలైందని స్పష్టమౌతోంది . ఇక మిరపకైతే ఒక టీఎంసీతో ఇంచుమించు 30 వేల ఎకరాలకు సీజన్ మొత్తం నీరివ్వ వచ్చు . ప్రస్తుతం నీటి వృథా ఆయా పంటల సాగు , దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఇవి సాంకేతిక లెక్కలు
వాస్తవంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును ఖరీప్ , రెండు సీజన్లలో నీరందించేలా డీపీఆర్ ( డిటెల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ) రూపొందించారు . రెండు పంటల సాగుకు ఆయకట్టు పరిధిలోని 80,060 ఎకరాల విస్తీర్ణానికి 12 టీఎంసీల నీటి అవసరం తీర్చేలా పొందుపరచారు. దీని కోసం ఏటా సాగర్ బ్యాక్ వాటర్ నుంచి ఐదు టీంఎంసీల నీటి వరకు తీసుకొనే విధంగా డీపీఆర్లో పేర్కొన్నారు . అయితే 2009 నుంచి కూడా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు . కేవలం సాగునీటి అవసరాలను మాత్రమే తీరుస్తున్నారు . అది కూడా అంచనా ప్రకారం సాగులో ఉన్న భూమి మొత్తానికి కాకుండా కేవలం కాలువల వెంబడి భూములకు, కనపర్తి ఎత్తిపోతల పథకాలకు మాత్రమే నీరిస్తున్నారు . దీంతో పాటు వేసవిలో తాగునీటి చెరువులకు నీరిస్తున్నారు . ఈ లెక్కన ప్రాజెక్టు నుంచి నికరంగా ఏటా 1. 5 టీఎంసీల నీటిని మాత్రమే కుడి ఎడమ కాలువల నుంచి అందిస్తున్నారు . ప్రస్తుతం ఆ నీరు కూడా ఇవ్వకపోతే రైతాంగం ‘ నీరుగారక’ తప్పని పరిస్థితి నెలకొంద . ఇక ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 3.87 టీఎంసీలు కాగా , డెడ్ స్టోరేజ్ 1.3 టీఎంసీలు ఉంది . డెడ్ స్టోరేజ్ పోను మిగిలిన 2. 5 టీఎంసీల నిల్వలో 0.8 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు ప్రాజెక్టులోనే నిల్వ ఉంచాలి . ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 3,87 టీఎంసీలని ఉన్నప్పటికీ , 0.2 టీఎంసీలు తక్కువగానే నీటిని నిల్వ చేస్తారు. ఈ లెక్కన నికరంగా వ్యవసాయ వినియోగం కోసం ప్రాజెక్టులో 1.5 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం ఆ నీరు కూడా పోతే రైతాంగానికి గడ్డు పరిస్థితి తప్పే పరిస్థితి లేదు . ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా గేటు మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలి. అనివార్య పక్షంలో ఈ ఏడాది నీటి కొరత ఏర్పడినా సాగర్ నుంచి నీరు తెచ్చుకొనేలా జిల్లా యంత్రాంగం ఒత్తిడి తెస్తే రైతులకు భరోసా ఇవ్వవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img