Homeజిల్లాలుఅనంతపురంజిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.... సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి

జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…. సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి

- Advertisement -

విశాలాంధ్ర, అనంతపురం కార్పొరేషన్: అనంతపురం జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి జిల్లాలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.జిల్లాలోని అన్ని గ్రామాలకు నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. నగరాల్లో నివసిస్తున్న పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 2,000 మంది ఓపీకి వస్తున్నప్పటికీ వైద్యులు, అధ్యాపకులు, హెడ్‌నర్సులు, పారామెడికల్ సిబ్బంది, మందులు, పడకల కొరత కారణంగా పేదలకు పూర్తిస్థాయి వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.150 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చిన్నపాటి వర్షానికే అనంతపురం నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయని, మురుగుకాలువల వ్యవస్థ సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను స్వాధీనం చేయాలని కోరారు.ఏపీఎండీపీ పైపులైన్ కోసం రూ.140 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ప్రస్తుతం 35 డివిజన్లకు మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతోందన్నారు. పాతూరు ప్రాంతానికి పైపులైన్ పనులు పూర్తికాకపోవడంతో వేసవిలో తాగునీటి సమస్య తీవ్రతరమవుతోందని తెలిపారు. వెంటనే పాతూరు ప్రాంతానికి తాగునీటి సరఫరా చేపట్టాలని డిమాండ్ చేశారు.నగరంలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, కోట్లాది రూపాయల విలువైన కార్పొరేషన్ స్థలాలను కబ్జాల నుంచి రక్షించాలని కోరారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సెంట్రల్ పార్క్ స్థలం, శ్రీనగర్ కాలనీ, శారదానగర్ తదితర ప్రాంతాల్లోని కార్పొరేషన్ స్థలాలపై జరుగుతున్న ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామకృష్ణ, టి.నారాయణస్వామి, కేశవరెడ్డి, పద్మావతి, నగర సహాయ కార్యదర్శి రమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్, పార్వతీ, అల్లిపీరా, ప్రసాద్, కూడేరు మండల కార్యదర్శి నాగేంద్ర, ఎల్లుట్ల నారాయణస్వామి, గాది లింగ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు