Homeజిల్లాలుఅనంతపురంఓటు చోరీపై వెల్లువెత్తిన నిరసనలు

ఓటు చోరీపై వెల్లువెత్తిన నిరసనలు

- Advertisement -

అనంత నగరంలో మానవహారం
వామపక్ష, ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రదర్శనలు
సిఇవో జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేసే వరకు ఉద్యమించాలని పిలుపు

అనంతపురం : ఓటు చోరీపై కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగాను, ఎన్నికల సంఘం సిఇవో జ్ఞానేష్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం అనంతపురం నగరంలో నిరసనలు, ర్యాలీలు, మానవహార ప్రదర్శనలు జరిగాయి. ప్రతిపక్ష, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నగరంలోని టవర్‌క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీలో ఓటు చోరీకి పాల్పడిన సిఇవో జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని పెద్దఎత్తున నినదించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై గళమెత్తారు. అనంతరం సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, వైసిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శింగనమల నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి డాక్టరు శైలజానాథ్, సిపిఎం జిల్లా నాయకులు నాగేంద్రకుమార్, రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దాదాగాంధీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌యుసిఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి వేమనలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూఆరఎసఎస్ ఎన్నికల సంఘాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మైనార్టీలు, దళితులు, పేదలు, యువత ఓట్లను పథకం ప్రకారం తొలగిస్తున్నారని, ఈ ఓట్ల తొలగింపు చర్య రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఈవీఎంలను పక్కనబెట్టి పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల దేశ వ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం ద్వారా పగటిపూటే ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఫామ్-6, 7 ను దుర్వినియోగం చేస్తూ అర్హులయిన ప్రజల ఓటు హక్కును కాలరాస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాంతీయ పార్టీలు సైతం మోదీ ప్రయోజనాలకే కొమ్ముకాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వ ముందు తాకట్టు పెడుతున్నారని అన్నారు. కేంద్రానికి దాసోహమవుతున్నారని ఆరోపించారు. బీజేపీ, ఆరఎసఎస్ కుమ్మక్కై ఎన్నికల సంఘాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని, దేశంలో ఎన్నికల వ్యవస్థకు మరణశాసనం రాశారని అన్నారు. 2029 లోనూ అక్రమ మార్గాల్లో అధికారంలోకి రావడానికి ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం బానిసగా మార్చుకుందని విమర్శించారు. ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. 2023 సంవత్సరంలో తీసుకొచ్చిన చట్ట సవరణల ద్వారా సీఈసీ నియామకంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించారని, జ్ఞానేశ్ కుమార్ నియామకమే చెల్లదని అన్నారు. వ్యవస్థలపై నమ్మకం కలగాలంటే 2023 చట్టాన్ని రద్దు చేయాలని, ఈవీఎంలను పక్కనబెట్టి పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతో పాటు ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనే ధ్యేయంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.

వైసిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శింగనమల నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి డాక్టరు శైలజానాథ్‌లు మాట్లాడుతూ అర్హులైన పౌరుల ఓటు హక్కును అన్యాయంగా తొలగించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని, ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు గల నమ్మకం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితాల్లో పారదర్శకత, ఎన్నికల వ్యవస్థ జవాబుదారీతనం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 వయోజన ఓటుహక్కుకు ప్రాతిపదిక, ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఆ హక్కును కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థే అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించిందనే ఫిర్యాదులు ఎదు ర్కొంటే… వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లోనూ ఓటర్ల హక్కుల పరిరక్షణ, న్యాయబద్ధమైన ప్రక్రియ ప్రాధాన్యాన్ని స్పష్టం చేసిందన్నారు. ఓటరు పేరు తొలగించడం కేవలం జాబితాలో ఒక అక్షరం చెరిపివేయడం కాదని, అది ఒక పౌరుడి ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

సిపిఎం జిల్లా నాయకులు నాగేంద్రకుమార్, రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దాదాగాంధీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌యుసిఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి వేమనలు మాట్లాడుతూ అర్హులైన ఓటర్ల పేర్లు ఎన్ని తొలగించారని, ఏ కారణాలతో తొలగించారని, సంబంధిత ఓటర్లకు నోటీసులు ఇచ్చారా, తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించారా అనే వివరాలను ప్రజలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. ఆయన రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితమైనది కాదని, ఓటు హక్కును కాపాడుకోవాలనుకునే ప్రతి పౌరుడి ఉద్యమమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు, రాజ్యాంగ పరిరక్షణ వేదికలు, ఓటు రక్షణు వేదికలు, విద్యార్థులు, యువజనులు, రైతులు, కౌలురైతులు, కార్మికులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ ఏకమై ఉద్యమించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా నాయకులు కేశవరెడ్డి, నారాయణస్వామి, పద్మావతి, రమణయ్య, వీ.కే కృష్ణుడు, రమేష్, బండి రామకృష్ణ , సిపిఎం జిల్లా నాయకులు గోపాల్, వలి, అశ్విని, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వీరనారప, వైసిపి నాయకులు, మాజీ మేయరు వశీం, మాజీ డిప్యూటీ మేయరు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వైసిపి జిల్లా నాయకులు రమేష్ గౌడ్, సాకే చంద్ర , ఓబిరెడ్డి , |న్నోబులేసు, ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసు, జాకీర్, షానావాజ్, న్యూ డెమోక్రసీ నాయకులు కిష్ట ఫక్రుద్దీన్ లిబరేషన్ నాయకులు లక్ష్మీ నారాయణ, వలి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు