Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం

విద్యార్థి, నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్‌ క్యాలెండరును రద్దు చేసి, అన్ని శాఖల్లోని ఖాళీ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. జాబ్‌ క్యాలెండరులో మార్పులు చేసి నూతన క్యాలెండరు ప్రకటించాలని కోరుతూ బుధవారం నిరు ద్యోగులు, విద్యార్థులు యువజన, ప్రజా సంఘాలతో ముఖాముఖి కార్యక్రమం ప్రభుత్వ అతిథి గృహంలో జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 2,35,794 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ చెబుతోందని, ప్రభుత్వం రెండేళ్ల తర్వాత కేవలం 10,143 ఉద్యోగాల భర్తీకే జాబ్‌ క్యాలెండరును విడుదల చేయటం యువతను మోసం చేయడమేనన్నారు. గత రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్‌ చెప్పడం హాస్యాస్పదమనన్నారు. నెలకు రూ.5 వేల వేతనంతో సేవలందిస్తున్న వలంటీర్లను ఉద్యోగస్తులుగా చూపడమేమిటని విమర్శించారు. రాష్ట్రంలో 5 వేలకు పైగా ఖాళీలు ఉన్న గ్రూప్స్‌ పోస్టులకు సుమారు ఆరు లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమై ఉన్నారని తెలిపారు. అయితే గ్రూప్స్‌1, 2 లకు కేవలం 36 పోస్టులే జాబ్‌ క్యాలెండరులో ప్రకటించడం సిగ్గు చేటని అన్నారు. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రతిష్ఠను దిగజార్చి, ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలపై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని, మిగిలిన ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో యువతకు సమాధానం చెప్పాలని అన్నారు.
రెండు వారాల్లో జాబ్‌ క్యాలెండరులో మార్పులు చేసి నూతన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి, యువజన సంఘాలతోపాటు అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటామని రామకృష్ణ హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేసి లాకప్‌లో పెట్టడమనేది క్షమించరాని నేరమని అన్నారు. ఈ విషయంపై సీఎం జగన్‌కు లేఖ రాస్తానని, వెంటనే క్షమాపణ చెప్పి, నాన్‌ బెయిలబుల్‌ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీసన్న, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్‌, నగర కార్యదర్శి సూర్య ప్రతాప్‌, రాయలసీమ విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోనేటి వెంకటేశ్వర్లు, నర్సింగ్‌ సంక్షేమ సంఘం నాయకులు మోహన్‌, పీడీఎస్‌యూ నాయకులు ఆది, ప్రైవేటు టీచర్స్‌, లెక్చరర్‌ అసోసియేషన్‌ నాయకులు రామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అబ్దుల్లా, డీవైఎఫ్‌ఐ నాయకులు నాగేష్‌, రాఘవేంద్ర, ఏఐడీఎస్‌వో నాయకులు హరీష్‌, ఏపీఎస్‌యూ నాయకుడు భాస్కర్‌, నిరుద్యోగ యువత నాగార్జున, హనుమంతరావు, సుందర్‌ పాల్గొన్నారు.
ధాన్యం రైతుల బకాయిలు చెల్లించాలి
విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులను అడుగడుగునా దగా చేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ధాన్యం రైతులకు బకాయిలు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తిరోగమన విధానాల వల్ల ధాన్యం రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా రైతులకు డబ్బులు చెల్లించలేదు. ధాన్యం కొనుగోళ్లు, రైతులకు బకాయిలు వివరాలు పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉండగా, ఈ రబీ సీజన్‌ ధాన్యం కొనుగోలు వివరాలను వెబ్‌సైట్‌ నుంచి అధికారులు తొలగించారని, ఇది రైతులను మోసగించడమేనని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకూ రైతుల నుంచి 28 లక్షల మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా సకాలంలో డబ్బులు ఇవ్వలేదని, 4 వేల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల ధాన్యం రైతులకే దాదాపు రూ.1,800 కోట్లు చెల్లించాల్సి ఉందని, తమకు రావాల్సిన డబ్బుల గురించి అడుగుతుంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు ముఖం చాటేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు తోడు దళారులు కూడా ధాన్యం రైతులతో ఆటలాడుతు న్నారన్నారు. సీఎం జగన్‌ ఆర్భాటంగా ప్రకటించిన రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగానే మిగిలాయని తెలిపారు. ఇప్పటికైనా రైతుల పట్ల చిత్తశుద్ధి చూపాలని, ధాన్యం రైతుల బకాయిలు చెల్లించేందుకు, పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో ధాన్యం కొనుగోళ్ల పూర్తి వివరాలు పారదర్శకంగా పొందుపరచేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img