ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న వేలాడే విద్యుత్ తీగలు….
ఎమ్మెల్యే ఆదేశాలు ఉన్నా పట్టించుకోని అధికారులు
మూడేళ్లుగా మౌలిక వసతుల కోసం కాలనీవాసుల ఎదురుచూపులు…..
విశాలాంధ్ర -నార్పల: మండల కేంద్రంలోని సుల్తాన్పేట పరిధిలో ఉన్న ఇందిరమ్మ కాలనీ ప్రజలు గత మూడు సంవత్సరాలుగా రోడ్డు, వీధిలైట్లు వంటి కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో సుమారు 12 విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ, 50కి పైగా ఇళ్లకు ఒకే విద్యుత్ స్తంభం ద్వారా కనెక్షన్లు ఇవ్వడం వల్ల విద్యుత్ తీగలు అస్తవ్యస్తంగా కిందికి వేలాడుతున్నాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లే పాదచారులు, ద్విచక్ర వాహనదారులకు నిత్యం ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా విద్యుత్ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. కాలనీలో వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో ఆ ప్రాంతం పూర్తిగా చీకటిమయంగా మారుతోంది. వర్షాలు కురిసినప్పుడు రోడ్డు లేకపోవడం వల్ల కాలనీ అంతా బురదమయంగా మారి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పాములు, తేళ్లు సంచరిస్తుండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాలనీవాసులు వాపోతున్నారు.ఈ సమస్యలను గతంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి దృష్టికి తీసుకెళ్లగా, ఆమె అప్పటి పంచాయతీ కార్యదర్శి శ్యామలకు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రజాప్రతినిధుల ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇందిరమ్మ కాలనీలో రోడ్డు నిర్మాణం, వీధిలైట్ల ఏర్పాటు, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించి అదనపు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు..


