Friday, March 31, 2023
Friday, March 31, 2023

చేతన్‌ శర్మ, జైషాకు చెక్‌?

హైదరాబాద్‌: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో శుభారంభం, మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) వేలంతో సంబరాలు చేసుకుంటున్న భారత క్రికెట్‌కు ఊహించని షాక్‌ తగిలింది. బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రూపంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెట్‌ అభిమానులు కలలో కూడా ఊహించని వీడియో బయటకు వచ్చింది. ఓ న్యూస్‌ చానెల్‌ చేపట్టిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ.. టీమిండియా సీక్రెట్స్‌ను బట్టబయలు చేశాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాల నుంచి స్టార్‌ ఆటగాళ్ల మధ్య ఉన్న గొడవలు, టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలను చేతన్‌ శర్మ ఈ స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడిరచాడు.
చీకటి విషయాలు బహిర్గతం
ఆఫ్‌ ద రికార్డుగా చేతన్‌ శర్మ ఈ మాటలు మాట్లాడగా.. జీ న్యూస్‌ రహస్య కెమెరాలతో రికార్డు చేసి భారత క్రికెట్‌లోని చీకటి విషయాలను బహిర్గతం చేసింది. ప్రస్తుతం చేతన్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ కోసం డోపింగ్‌లో దొరకని ఇంజెక్షన్లను టీమిండియా ఆటగాళ్లు వాడుతారని చెప్పడం చర్చనీయాంశమైంది. ప్రపంచ క్రికెట్‌ ముందు భారత ఆటగాళ్లను దోషిగా నిలబెట్టింది. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ మౌనంగా ఉన్నా.. చేతన్‌ శర్మపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి.
ప్లాన్‌ ప్రకారమే స్ట్రింగ్‌ ఆపరేషన్‌
అయితే ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియాలో మరో వాదన వినిపిస్తోంది. పథకం ప్రకారమే ఈ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బీసీసీఐలో సెక్రటరీ జై షానే పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాడనేది ఎవరూ కాదనలేని విషయం. అతని డామినేషన్‌ను వ్యతిరేకించడంతోనే బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీని తప్పించినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కొత్తగా రోజర్‌ బిన్నీ బాధ్యతలు చేపట్టినా.. జై షానే అధికారం చలాయిస్తున్నాడు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు కావడంతో జై షాకు తిరుగు లేకుండా పోయింది. ఎంతలా అంటే చేతన్‌ శర్మ సారథ్యంలోని సెలెక్షన్‌ కమిటీని రద్దు చేసినా.. మళ్లీ అతనికే కమిటీ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించేంత పవర్‌ జై షాకు ఉంది.
జై షా వ్యతిరేక వర్గం పనే..
పాత సెలెక్షన్‌ కమిటీలో సెలెక్టర్లు అంతా మారినా.. జై షా మద్దతుతో చేతన్‌ శర్మ మళ్లీ చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయంలో అసంతృప్తి ఉన్న బీసీసీఐ అధికారులు స్ట్రింగ్‌ ఆపరేషన్‌తో అతడిని ఇరికించినట్లు ప్రచారం జరుగుతోంది. బీసీసీఐలో బీజేపీ జోక్యం ఎక్కువ అవ్వడం కూడా కొందరు ఆఫీస్‌ బేరర్స్‌ తట్టుకోలేక పోతున్నారంట. ఈ క్రమంలోనే ప్లాన్‌ ప్రకారం స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేసి ఇరికించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా విరాట్‌ కోహ్లి పేరు డ్యామేజ్‌ చేయడానికి కూడా ఈ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేశారని మరో వాదన వినిపిస్తోంది.
కోహ్లీ పేరు డ్యామేజ్‌ చేయడానికే…
భారత క్రికెట్‌ ముఖ చిత్రంగా ఎదిగిన విరాట్‌ను అభిమానుల దృష్టిలో దోషిగా నిలబెట్టాలనే అతనిపై ఆరోపణలు గుప్పించారని, గంగూలీ, రోహిత్‌ శర్మలతో విబేధాలు ఉన్నాయని చెప్పించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా.. చేతన్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు భారత అభిమానులను బాధపెట్టాయి. బోర్డు నిబంధనల ప్రకారం సెలెక్షన్‌ కమిటీలో ఉన్న ఎవరైనా బీసీసీఐ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడవద్దు. ఈ రూల్‌ బ్రేక్‌ చేసిన చేతన్‌ శర్మపై విచారణ చేపట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img