దుబాయ్: క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఫ్గానిస్తాన్, తనకన్నా బలమైన పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చింది. రెండుజట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో పాక్‌ని అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. టీ20 ఫార్మాట్‌లో పాకిస్తాన్‌పై అఫ్గానిస్థాన్‌కిదే తొలి విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్, అఫ్గాన్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగులకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ లేకుండా బరిలోకి దిగిన పాక్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి విలవిల్లాడిరది. 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన పాకిస్తాన్‌ను ఇమాద్ వసీమ్ (18) ఆదుకున్నాడు. లేకుంటే ఆ జట్టు టీ20ల్లో తన అత్యల్ప స్కోరు 74 (2012లో ఆస్ట్రేలియాపై) కంటే తక్కువకే ఆలౌటయ్యేది. లక్ష్యఛేదనలో 10 ఓవర్లకు 45/4 స్కోరుతో కష్టాల్లో ఉన్న అఫ్గానిస్తాన్‌ను మహమ్మద్ నబీ (38), నజీబుల్లా జద్రాన్ (17) నిలకడగా ఆడి గెలిపించారు. ‘‘పాక్‌పై మేం చాలాసార్లు స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఇప్పుడు ఆ జట్టుపై తొలి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మున్ముందు ఇదే జోరును కొనసాగించాలకుంటున్నాం. అఫ్గానిస్తాన్ తరపున ఆడుతున్నందుకు గర్వంగా ఉంది. షార్జాలో పిచ్ గురించి మాకు తెలియదు. ఇక్కడి పిచ్ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మేం టాప్ ఆర్డర్‌ను మెరుగుపర్చుకోవాలి’’ అని మ్యాచ్ అనంతరం అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు.