ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ చిక్కుల్లో పడ్డాడు. తాజాగా అతడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాంబ్లీ సతీమణి ఆండ్రియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం గమనార్హం. తనను దుర్భాషలాడటంతోపాటు దాడికి పాల్పడినట్లు కాంబ్లీపై ఆండ్రియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పోలీసులు కాంబ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆండ్రియా తలకు గాయం కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో తనపై దాడి చేశాడని కాంబ్లీ భార్య ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడిరచారు. ఇప్పటి వరకు వినోద్ కాంబ్లీని అదుపులోకి తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే, భార్యపై దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం జరిగినట్లు తెలుస్తోంది. ఫిర్యాదులో పేర్కొన్నదానిని బట్టి.. కుకింగ్ పాన్‌ను విసిరి కొట్టడంతో కాంబ్లీ భార్య తలకు దెబ్బ తగలిగిందని అధికారులు వెల్లడిరచారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మద్యం తాగి వచ్చిన కాంబ్లీ విపరీతంగా దుర్భాషలాడుతూ ఆమెపై దాడి చేసినట్లు తెలిపారు. కాంబ్లీ భార్య ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వివరించారు.