Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

మ్యాచ్‌ తప్పిదాలపై చర్చిస్తాం: రోహిత్‌

ఇండోర్‌: మూడో టెస్టు మ్యాచ్‌లో ఓటమికి గల కారణాలను త్వరగా అన్వేషించి తప్పులను సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తామని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపారు. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఒక టెస్టు మ్యాచ్‌లో ఓడిపోతే.. చాలా విషయాలు మన చేతుల్లో లేవని అర్థం. బ్యాటింగ్‌లో తొలుత సరైన ఆరంభం దక్కలేదు. ప్రత్యర్థి 80 – 90 పరుగుల ఆధిక్యం సాధించాక.. తొలి ఇన్నింగ్స్‌లో మా స్కోరు బోర్డుపై మరిన్ని పరుగులు ఉంటే బాగుండేదనిపించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అనుకున్న విధంగా బ్యాటింగ్‌ సాగలేదు. ఆసీస్‌కు కేవలం 76 పరుగులనే లక్ష్యంగా నిర్దేశించాం. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎలా రాణించాం.. ఈ మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయామనే విషయంపై అందరం కలిసి చర్చించుకుంటాం. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి ఆలోంచించలేదు. తర్వాత అహ్మదాబాద్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. పిచ్‌లతో సంబంధం లేకుండా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. సవాళ్లతో కూడుకున్న పిచ్‌లపై ధైర్యంగా ఆడాలి. బౌలింగ్‌లో రాణించినప్పటికీ.. బ్యాటింగ్‌లో ఆ తెగువ చూపించలేకపోయాం. ప్రణాళికలను అమలు చేయడంలో జరిగిన తప్పిదాల వల్లే ఇలా ఓటమిబాట పట్టాల్సి వచ్చింది. తప్పకుండా పుంజుకుంటాం’’ అని రోహిత్‌ తెలిపాడు.
‘‘మ్యాచ్‌కు సంబంధించిన నేను ఏమనుకున్నానో అలాగే జరిగింది. తొలి రోజు మేం టాస్‌ ఓడి మొదట బౌలింగ్‌ చేయడం కలిసొచ్చింది. మా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. తొలి రోజు కునెమన్‌ సూపర్‌గా బౌలింగ్‌ చేశాడు. ఇక బ్యాటింగ్‌లో ఉస్మాన్‌ ఖవాజా తొలి ఇన్నింగ్స్‌లో మమ్మల్ని కాపాడాడు. అయితే, రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ మళ్లీ రేసులోకి వస్తుందని అనుకున్నా. అందుకు తీవ్రంగానే పోరాడిరది. క్లిష్టపరిస్థితుల్లో పుజారా అద్భుతంగా ఆడాడు. కానీ, నాథన్‌ లయన్‌ మాత్రం 8 వికెట్లతో టీమ్‌ఇండియాను దెబ్బతీశాడు. ఇక చివరి టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను డ్రా చేస్తామని భావిస్తున్నా. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లడం ఆనందంగా ఉంది’’ అని స్మిత్‌ చెప్పాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img