Monday, May 29, 2023
Monday, May 29, 2023

లక్నోపై ఓటమితో తీవ్ర నిరాశ: డుప్లెసిస్‌

బెంగళూరు: ఈ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొంది. ముఖ్యంగా సోమవారం సొంత మైదానంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఓటమిపాలవడం బెంగళూరు ఆటగాళ్లకు తీవ్ర నిరాశ కలిగించింది. మొదట బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరు చేసినా, తర్వాత ప్రత్యర్థి జట్టు వికెట్లు త్వరగానే పడగొట్టినా బెంగళూరు మాత్రం విజయతీరాలకు చేరలేకపోయింది. ఈ మ్యాచ్‌ ఓటమిపై బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్‌ స్పందించాడు. ‘ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా నిరాశ కలిగించింది. చాలా బ్యాడ్‌ లక్‌. లక్నో బ్యాట్స్‌మెన్‌ మా నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నారు. స్టోయినిస్‌, పూరన్‌ అద్భుతంగా ఆడారు. ఒక్క బంతికి ఒక్క పరుగు కావాల్సినపుడు కచ్చితంగా రనౌట్‌ అవుతుందని భావించాను. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. మ్యాచ్‌ చాలా వరకు మా నియంత్రణలోనే ఉంది. మిడిల్‌ ఓవర్లలో మా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారు. తర్వాతి మ్యాచ్‌ల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం’ అని డుప్లెసిస్‌ అన్నాడు. కాగా, ఐపీఎల్‌ చరిత్రలో భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను కాపాడుకులేని చెత్త రికార్డు బెంగళూరు పేరిటే ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు 5 సార్లు 200 ప్లస్‌ స్కోరు చేసినా ఓటమి పాలైంది. ఐపీఎల్‌లో మరే జట్టు ఇన్నిసార్లు ఇలా ఓటమి పాలుకాలేదు.
ఆవేశ్‌ఖాన్‌పై చర్యలు
లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌పై బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. కారణం ఏంటంటే… అతను ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లెవల్‌ 1 ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఆర్సీబీపై ఆఖరి బంతికి సింగిల్‌ తీసి లక్నోను గెలిపించిన అతను హెల్మెట్‌ను నేలకేసి కొట్టి సంబరాలు చేసుకున్నాడు.అతడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ చర్యలు తీసుకోనుంది. అవేశ్‌ ఖాన్‌ కూడా తన నేరాన్ని అంగీకరించాడు. అయితే.. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? అనేది మ్యాచ్‌ రిఫరీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. కాగా స్లో ఓవర్‌ రేటు కారణంగా మ్యాచ్‌ రెఫరీ… ఆర్సీబీ కెప్టెన్‌ డూప్లెసిస్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఆఖరి బంతి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 212 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ(61), డూప్లెసిస్‌(79), మ్యాక్స్‌వెల్‌(59) అర్ధ సెంచరీలతో చెలరేగారు. కాగా భారీ లక్ష్య ఛేదనలో లక్నో బ్యాటర్లు దంచి కొట్టారు. మార్కస్‌ స్టోయినిస్‌(65), నికోలస్‌ పూరన్‌ (62) సిక్స్‌లతో ఆర్సీబీ బౌలర్లను హడలెత్తించారు. ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ నెలకొంది. హర్షల్‌ పటేల్‌ మన్కడిరగ్‌కు ప్రయత్నించి విఫలం అయ్యాడు. అవేశ్‌ ఖాన్‌ సింగిల్‌ తీయడంతో లక్నో టీమ్‌ జయభేరి మోగించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img