కోల్‌కతా: మీతోనే మొదలు పెట్టాలనుకుంటున్నా… మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా? విరాట్ కోహ్లి బాగున్నాడు. తను మానసికంగా ఎంతో బలవంతుడు. అంతా సర్దుకుంటుంది.దశాబ్ద కాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. సుదీర్ఘకాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న వ్యక్తికి ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసు. కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసు’ అంటూ టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ.. మాజీ సారథి విరాట్ కోహ్లికి అండగా నిలబడ్డాడు. ‘నిజానికి ఇదంతా మీ వల్లే మొదలైంది. మీరు సైలెంట్‌గా ఉంటే అంతా బాగానే ఉంటుంది’ అని మీడియా తీరుపై మండి పడ్డాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో కోహ్లి విఫలమైన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌లలో కనీసం 30(8, 18, 0) పరుగులు కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రోహిత్‌కు కోహ్లి ఫామ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందించిన హిట్‌మ్యాన్ కోహ్లికి పెద్దన్నలా అండగా నిలబడ్డాడు. అతడిలో ఆత్మవిశ్వాసం మెండు అని, ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.