Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

సింధు మెరుపులు ` మేరీకోమ్‌ పంచ్‌లు

టోక్యో : జపాన్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌2020 విశ్వక్రీడల్లో రెండో రోజు ఆదివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పీవీ సింధు, మనికా బత్రా, రోయింగ్‌ జోడీ, బాక్సింగ్‌లో మేరీ కోమ్‌ ముందజ వేశారు. షూటింగ్‌ ఈవెంట్స్‌లో భారత్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మను బాకర్‌, యశస్విని దేస్వాల్‌.. వరుసగా 12,13 స్థానాల్లో నిలవడంతో పతకంపై ఆశలొదుకోవాల్సి వచ్చింది. కాగా పిస్టల్‌లో సాంకేతిక లోపం వల్ల దాదాపు 20 నిమిషాల పాటు మను ఆట నిలిచిపోయింది. కాకింగ్‌ లెవల్‌ బ్రేక్‌డౌన్‌ కావడం వల్ల ఆమె గురితప్పింది. దీంతో ఫైనల్‌లో చోటు దక్కలేదు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ పురుషుల క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో భారత షూటర్లు దీపక్‌ కుమార్‌(624.7), పన్వర్‌ దివ్యాంశ్‌ సింగ్‌(622.8)..26,32 స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. షూటింగ్‌ మెన్స్‌ స్కీట్‌ క్వాలిఫికేషన్‌ తొలిరోజు మూడురౌండ్లు పూర్తయ్యాయి. భారత షూటర్లు అంగద్‌ వీర్‌ సింగ్‌ బజ్వా 11వ, మిరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ 25వ స్థానాల్లో నిలిచారు. మిగతా రెండు రౌండ్లు సోమవారం (జులై 26) జరగనున్నాయి. టాప్‌-6లో నిలిచినవారు ఫైనల్‌కు వెళ్తారు. పీవీ సింధు శుభారంభం బ్యాడ్మింటన్‌ విభాగంలో పతకమే లక్ష్యంగా బరిలో దిగిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో.. ఇజ్రాయెల్‌కు చెందిన పోలికర్పోవాను వరుస సెట్లలో (21-7, 21-10)ఓడిరచింది. రోయింగ్‌లో భారత రోయర్లు అరుణ్‌లాల్‌, అరవింద్‌ సింగ్‌ జోడీ అదరగొట్టింది. పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ రెపిచేజ్‌ రౌండ్‌లో టాప్‌-3లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. జులై 27న జరిగే పోటీలో గెలిస్తే పతకం అవకాశాలు మెరుగుపడతాయి. ఒలింపిక్స్‌లో దేశం తరఫున పాల్గొన్న ఏకైక జిమ్నాస్ట్‌ ప్రణిత నాయక్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లోనే ఓటమి చవిచూసింది. నాలుగు విభాగాల్లో కలిపి 42.565 స్కోరు చేసి 29వ స్థానంలో నిలవడం వల్ల ఈ విభాగంలో భారత్‌ కథ ముగిసింది. టెన్నిస్‌..నిరాశపర్చిన సానియా మీర్జా టెన్నిస్‌లో భారత్‌పోరు తొలిరౌండ్‌తోనే ముగిసిపోయింది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా నిరాశపరిచింది. అంకితా రైనాతో జట్టుకట్టిన ఆమె.. తొలి రౌండ్‌లో కిచునాక్‌ లియుద్‌మ్యాలా- కిచునాక్‌ నదియా (ఉక్రెయిన్‌ కవలలు) జోడీ చేతిలో 0-6,7-6, (10-8) తేడాతో ఓటమిపాలైంది. తొలి సెట్‌ను సానియా ద్వయం 6-0తో కైవసం చేసుకోగా, ఆ తరువాతి రెండు సెట్లలో ఉక్రెయిన్‌ కవలలు విజయం సాధించారు. రెండో సెట్‌లో మొదట 5-3 తేడాతో లీడ్‌లో ఉన్న సానియా ద్వయం ఆ తరువాత అనూహ్యంగా వెనుకబడిపోయారు. క్రమంగా పుంజుకున్న ఉక్రెయిన్‌ జంట ఏకంగా విజయంతో ముగించింది. ప్రిక్వార్టర్స్‌లోకి మనికా బత్రా టేబుల్‌ టెన్నిస్‌లో మహిళా క్రీడాకారిణి మనికా బత్రా ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించింది. ప్రపంచ నం.32 ర్యాక్‌ క్రీడాకారిణి మార్గరిటా పెసోట్‌స్కాపై రెండో రౌండ్‌లో 4-3 తేడాతో విజయం సాధించింది. పురుషుల విభాగంలో పోటీపడిన జ్ఞానశేఖరన్‌ సత్యన్‌.. రెండో రౌండ్‌లో హాంకాంగ్‌ క్రీడాకారుడు లామ్‌సియూపై 3-4 తేడాతో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో మేరీకోమ్‌ విజయం బాక్సింగ్‌ తొలిమ్యాచ్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ విజయం సాధిం చింది. 51 కేజీల విభాగం తొలి రౌండ్‌లో రిపబ్లిక్‌ ఆఫ్‌ డొమినిక్‌ క్రీడాకారిణి మిగ్యులినా హెర్నాండెజ్‌ గార్సియాపై 4-1 తేడాతో గెలుపొందింది. ప్రి క్వార్టర్స్‌లో కొలంబియాకు చెందిన 3వ సీడ్‌ వాలన్సియా విక్టోరియాతో జులై 29న తలపడనుంది. వాలన్సియా 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత. కాగా బాక్సింగ్‌ పురుషుల 63కేజీల విభాగం ప్రిలిమ్స్‌రౌండ్‌ 32లో భారత్‌కు నిరాశ తప్పలేదు. ప్రత్యర్థి లూక్‌ మెక్‌కార్నాక్‌ చేతిలో మనీశ్‌ కౌశిక్‌ ఓటమిపాలయ్యాడు.
హాకీలో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం
హాకీలో..ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌?లో భారత పురుషుల హాకీ జట్టు ఘోరంగా ఓడిపోయింది. 1-7తో ఓటమిపాలైంది. హాకీ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆస్ట్రేలియా.. ఆరంభం నుంచే భారత్‌పై పైచేయి సాధించింది. ఆట పదో నిమిషంలోనే డానియల్‌ బీలే తొలి గోల్‌ సాధించాడు. ఆ తరువాత జోషూవ బెల్డ్జ్‌(26’), ఆండ్రూ ఫ్లిన్‌ ఒగిల్వీ (23’), జెరెమీ హేవార్డ్‌ (21’), బ్లాక్‌ గోవర్స్‌ (40’, 42’), టిమ్‌ బ్రాండ్‌(51’) గోల్స్‌తో భారత్‌పై తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఫలితంగా ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దిల్‌ప్రీత్‌సింగ్‌ 34వ నిమిషంలో గోల్‌ కొట్టడం వల్ల భారత్‌కు ఆ ఒక్క గోల్‌అయినా దక్కింది. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2తో విజయం సాధించిన మన్‌ప్రీత్‌ సేన, ఈ మ్యాచ్‌లో భంగపాటుకు గురైంది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుంది.
స్విమ్మింగ్‌లోనూ నిరాశే..
స్విమ్మింగ్‌ 100మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ హీట్స్‌లో శ్రీహరి నటరాజ్‌ 27వ స్థానంలో నిలిచి నిరుత్సాహ పరిచాడు. సెమీఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. మరో స్విమ్మర్‌ మానా పటేల్‌ కూడా నిరాశకు గురిచేసింది. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ హీట్‌ 1లో రెండో స్థానంలో నిలిచింది. ఇందుకు ఆమె 1 నిమిషం 5 సెకెండ్ల సమయం తీసుకుంది. దీంతో ప్రీ-క్వార్టర్స్‌కు చేరుకోలేకపోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img