Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

స్వర్ణాలతో భారత్‌ మిలమిల..!

షూటింట్‌, బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతాకాలు
షూటర్‌ సింగ్‌రాజ్‌ అదానాకు సిల్వర్‌

టోక్యో: పారాలింపిక్స్‌ 2020లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. షూటర్‌ మనీశ్‌ నర్వాల్‌ శనివారం జరిగిన పురుషుల పి 4 మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఎస్‌ హెచ్‌ 1 పోటీల్లో బంగారు పతకం గెలిచాడు. ఇక ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్‌ సింఘరాజ్‌ అదానాకు సిల్వర్‌ మెడల్‌ దక్కడం విశేషం. దీంతో పారాలింపిక్స్‌లో ఇండియా పతకాల సంఖ్య 15కు చేరింది. ఇప్పటికే యువ షూటర్‌ అవనీ లేఖరా ఒక స్వర్ణం, ఒక కాంస్యం కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లలో స్వర్ణాలు గెలిచి ఒలింపిక్స్‌లో సాధారణ షూటర్లు చేయలేనిది పారా షూటర్లు చేసి చూపిస్తున్నారు. టోక్యో పారాలింపిక్స్‌ 2020లోని పీ1 పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 పోటీల్లో భారత్‌కు రెండు అత్యుత్తమ పతకాలు రావడం ప్రత్యేకం. 19 ఏళ్ల మనీశ్‌ నర్వాల్‌ 218.2 స్కోరుతో పారాలింపిక్స్‌ రికార్డు సృష్టించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఇక సింఘరాజ్‌ అదానా 216.7 స్కోరుతో వెండి పతకంతో మెరిశాడు. రష్యా ఒలింపిక్‌ కమిటీ ఆటగాడు సెర్గీ మలెషెవ్‌ 196.8తో కాంస్యం దక్కించుకున్నాడు. అంతకు ముందు జరిగిన అర్హత పోటీల్లో అదానా 536 స్కోరుతో నాలుగో స్థానంలో, నర్వాల్‌ 533తో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరుకున్నాడు. తుది పోరులో నర్వాల్‌ దూసుకుపోగా.. అదానా వెనకపడిపోయాడు. మరో భరత ఆటగాడు ఆకాశ్‌ 27వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేదు. 50మీ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 ఫైనల్లో షూటర్‌ మనీశ్‌ నర్వాల్‌.. 218.2 పాయింట్లు స్కోర్‌ చేశాడు. దీంతో అతను పారాలింపిక్స్‌ చరిత్రలో కొత్త రికార్డు క్రియేట్‌ చేశాడు. ఈ స్కోర్‌ పారాలింపిక్స్‌లో రికార్డుగా నిలిచింది. అంతేకాదు వరల్డ్‌ రికార్డు కూడా మనీశ్‌ ఖాతాలోనే ఉన్నది. ఎస్‌హెచ్‌1 పోటీల్లో ఒక కాలు, ఒక చేతి లేదా రెండు అవయవాల్లో వైకల్యం ఉన్నవారు పోటీపడతారు. అంటే కూర్చొని లేదా నిలబడి ఒకే చేత్తో పిస్టల్‌ పట్టుకొని షూట్‌ చేస్తారు. కాగా పీ4లో పోటీపడ్డవారు మిక్స్‌డ్‌ 50 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ పోటీల్లోనూ తలపడతారు. షూటింగ్‌లో బంగారు పతకం గెలిచిన షూటర్‌ మనీశ్‌ నర్వాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మనీశ్‌ సూపర్‌ విక్టరీ కొట్టారంటూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తన ట్విట్టర్‌లో తెలిపారు. ఇదే క్యాటగిరీలో వరల్డ్‌ రికార్డును నెలకొల్పినందుకు షూటర్‌కు మంత్రి కంగ్రాట్స్‌ తెలిపారు. పతకాలు సాధించిన మనీష్‌ నర్వాల్‌, సింఘరాజ్‌ అదానాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆ ఇద్దరితోనూ ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. పారా అథ్లెట్లను ప్రధాని ప్రోత్సహించిన తీరు అద్భుతమని వారు పేర్కొన్నారు. తమకు మద్దతు ఇచ్చినందుకు ప్రధానికి షూటర్లు థ్యాంక్స్‌ చెప్పారు. పతకాలు గెలిచిన ఇద్దరు షూటర్లకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. షూటర్‌ మనీశ్‌ నర్వాల్‌కు ఆరు కోట్లు ఇవ్వనున్నట్లు ఇవాళ హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. సింగరాజ్‌ అధానాకు నాలుగు కోట్ల రివార్డును ఇవ్వనున్నట్లు హర్యానా గవర్నమెంట్‌ వెల్లడిరచింది. పతకాలు గెలిచిన ఈ ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నట్లు హర్యానా సర్కార్‌ ప్రకటించింది.

బ్యాడ్మింటన్‌లో…
బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌లో ప్రమోద్‌ భగత్‌ స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్స్‌లో గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన డేనియల్‌ బెతెల్‌పై 21-14.21-17 తేడాతో విజయం సాధించి గోల్డ్‌ మెడల్‌ను దేశానికి అందించాడు. దీంతో భారత్‌ ఖాతాలో మొత్తం 4 బంగారు పతకాలు చేరాయి. బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌ మొత్తం 45 నిమిషాల పాటు సాగింది. తొలి గేమ్‌ను 21 నిమిషాల్లో పూర్తికాగా రెండో గేమ్‌ 24 నిమిషాల్లో భగత్‌ పూర్తి చేశాడు. ఇప్పటికే షూటర్లు అవని లేఖరా, మనీష్‌ నర్వాల్‌ స్వర్ణం సాధించగా జావెలిన్‌ త్రోలో సుమిత్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఇక బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌ హోరాహోరీగా సాగింది. ప్రమోద్‌ భగత్‌ నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ.. ఆట కొనసాగే క్రమంలో దూకుడును ప్రదర్శించాడు. క్రమశిక్షణతో కూడిన ఆటను ప్రదర్శించిన ప్రమోద్‌ భగత్‌.. డిఫెన్స్‌ చక్కగా ఆడి బేతెల్‌ పై పైచేయి సాధించాడు. ఇక బేతెల్‌ ప్రమోద్‌ భగత్‌ సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలోనే డ్రాప్‌ షాట్లు, స్మాష్‌లతో రెచ్చిపోయాడు. అయితే భగత్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కేవలం డిఫెన్స్‌తోనే కాకుండా తన ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు ప్రమోద్‌. దీంతో తొలిగేమ్‌ను 21-14తో పూర్తిచేశాడు. ఇక రెండో గేమ్‌లో బెతెల్‌ అటాకింగ్‌ గేమ్‌ ఆడటం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో 8 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు. ఇక మూడో గేమ్‌లో ఫలితం తేలుతుందని అంతా భావిస్తున్న తరుణంలో ప్రమోద్‌ భగత్‌ అద్భుతమైన ఆటతీరును కనబర్చి బెతెల్‌ పై పట్టుసాధించాడు. ముందుగా పాయింట్లను సమం చేసిన భగత్‌ ఆ తర్వాత వెనుదిరగలేదు.
ముందుకు చొచ్చుకెళ్లి రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక కోర్టు నెంబర్‌ 3లో జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాపై భారత్‌కు చెందిన మనోజ్‌ సర్కార్‌ 22-20, 21-13తో విజయం సాధించి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ మొత్తం 47 నిమిషాల పాటు జరిగింది. మనోజ్‌ సర్కార్‌ కాంస్య పతకం కైవసం చేసుకోవడం ద్వారా ఒకే రోజు బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించినట్లయ్యింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img