Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆర్సీబీ రంగు మారింది – నీలిరంగు జెర్సీలో కోహ్లీసేన

దుబాయ్‌ : విరాట్‌ కోహ్లీ నాయకత్వంలో రెండవ దశ ఐపీఎల్‌ మ్యాచులు ఆడేందుకు సిద్ధమైన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈసారి నీలిరంగు జెర్సీలో దర్శనమివ్వ నున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎంతో విలువైన సేవలను అందించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మద్దతును ప్రకటిస్తూ ఈ నీలి రంగు జెర్సీని ధరిస్తున్నట్లు ఆర్సీబీ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ‘కోవిడ్‌ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అమూల్యమైన సేవలకు నివాళి అర్పించేందుకు.. ఫ్రంట్‌లైన్‌ యోధులు ధరించే పీపీఈ కిట్‌ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్సీబీ సభ్యులుగా మాకు గర్వకారణం’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నది. ఐపీఎల్‌ ఫేజ్‌-1 సమయంలో కూడా మే 3 న కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో బ్లూ జెర్సీలో కనిపించబోతున్నట్లు ఆర్సీబీ జట్టు ప్రకటించింది. కోవిడ్‌ కారణంగా టోర్నమెంట్‌ నిలిపి వేయడంతో.. అప్పటి మాటను ఇప్పుడు నిలబెట్టు కుంటున్నది. కరోనాతో ఇబ్బందిపడుతున్న బెంగుళూరు, ఇతర నగరాలకు 100 వెంటిలేటర్లు, 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను విరాళంగా ఇస్తామని అప్పట్లో ఆర్సీబీ జట్టు ప్రకటించింది.
ఐదో టెస్టు రద్దు దురదృష్టకరం : కోహ్లీ
ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దుకావడంపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎట్టకేలకు స్పందించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడేందుకు దుబాయ్‌ చేరుకున్న కోహ్లీ.. ముందుగానే ఇక్కడికి రావాల్సి రావడం దురదృష్టకరమని అన్నాడు. ఈ అనిశ్చిత పరి స్థితుల్లో కనీసం ఐపీఎల్‌ కోసమైనా సురక్షితమైన బయో బబుల్‌ ఏర్పాటు చేయాలని కోహ్లి అభిప్రాయపడ్డాడు. టీమిండియాలోని జూనియర్‌ ఫిజియో యోగేశ్‌ పార్మర్‌ కరోనా బారిన పడటంతో చివరి టెస్ట్‌ బరిలోకి దిగడానికి కోహ్లీతోపాటు ఇతర ఆటగాళ్లు నిరాకరించారు. ‘ఇక్కడికి ఇలా ముందుగానే రావాల్సి రావడం దురదృష్టకరం. కానీ కొవిడ్‌ కాలంలో అనిశ్చితి నెలకొంది. ఏ సమయంలో ఏదైనా జరగొచ్చు. కనీసం ఐపీఎల్‌ కోసమైనా సురక్షితమైన, దృఢమైన బబుల్‌ ఏర్పాటు చేశారని ఆశిస్తున్నా’ అని ఆర్సీబీ డిజిటల్‌ మీడియతో కోహ్లి చెప్పాడు. ఈ ఐపీఎల్‌.. ఆర్సీబీ టీమ్‌తోపాటు త్వరలోనే టీ20 ప్రపంచకప్‌ జరగనున్నందున టీమిండియాకు కూడా చాలా ముఖ్యమైనదని విరాట్‌ అభిప్రాయపడ్డాడు. ఆదివారం ఐపీఎల్‌ తిరిగి ప్రారంభం కానుండగా.. ఆర్సీబీ సోమవారం కోల్‌కతాతో తలపడనుంది. టోర్నీకి కొందరు కీలక ఆటగాళ్ల్లు మిస్‌ అవు తున్నా.. వారి స్థానాలను నాణ్యమైన ప్లేయర్స్‌తో భర్తీ చేసినట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img