Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కనుల పండువగా పారా ఒలింపిక్స్‌ ప్రారంభ సంబరం

టోక్యో : మరో విశ్వ క్రీడాసంబంరం మొదలైంది. 16వ పారా ఒలింపిక్స్‌ వేడుకలు టోక్యో ప్రధాన స్టేడియంలో మంగళవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేడుకలకు జపాన్‌ చక్రవర్తి నరుహిటో, ప్రధాని సుగా హాజరయ్యారు. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు, వివిధ రీతుల్లో సాగిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్‌ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. ఆరంభ వేడుకల్లో భారత క్రీడా బృందానికి నాయకత్వం వహించిన జావెలిన్‌ త్రోవర్‌ టెక్‌చంద్‌ త్రివర్ణ పతాకాన్ని చేతబూని జట్టును ముందుకు నడిపించాడు. విశ్వక్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను చూసి ప్రేక్షకులు మురిసిపోయారు. వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదంటూ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది పారా అథ్లెట్లు తమ సత్తా చాటడానికి టోక్యోలో సిద్ధంగా ఉన్నారు. అందులో భారత యోధులు 54 మంది. మొత్తం 9 క్రీడల్లో వీళ్లు తలపడనున్నారు. ఆర్చరీ, పారా కనోయింగ్‌, అథ్లెటిక్స్‌, షూటింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, స్విమ్మింగ్‌, బ్యాడ్మింటన్‌, పవర్‌ లిఫ్టింగ్‌, టైక్వాం డోలలో భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించు కనున్నారు. పారా ఒలింపిక్స్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంత పెద్ద జట్టుతో, భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న భారత బృందం.. రెండంకెల సంఖ్యలో పతకాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తంగవేలు స్థానంలో టెక్‌చంద్‌ ముందు నిర్ణయించినట్లుగా ప్రారంభ పరేడ్‌లో భారత బృందానికి భారత హైజంప్‌ క్రీడాకారుడు మరియప్పన్‌ తంగవేలు నేతృత్వం వహించాల్సి ఉండగా కొన్ని గంటల ముందు అతని స్థానంలో టెక్‌చంద్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. తంగవేలుపై కరోనా ప్రభావం పడిరది. భారత్‌ నుంచి టోక్యోకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకగా.. అతడితో తంగవేలు సన్నిహితంగా ఉన్నాడు. గత ఆరు రోజులుగా తంగవేలు, మిగతా ఐదుగురికి కరోనా నెగటివ్‌ వచ్చినా.. ముందు జాగ్రత్తగా వాళ్లను క్వారంటైన్‌లో ఉంచారు. దీంతో ఆరంభ వేడుకల్లో భారతదేశ జెండాను చేతపట్టాల్సిన అవకాశాన్ని తంగవేలు చేజార్చుకు న్నట్లయ్యింది. తంగవేలు 2016 రియో పారాలింపిక్స్‌ హైజంప్‌ క్రీడలో స్వర్ణం సాధించాడు. 2017లో కేంద్రప్రభుత్వం పద్మశ్రీ, అర్జున పురస్కారాలతో సత్కరించింది. గతేడాది మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డునూ అందుకున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img