Friday, April 19, 2024
Friday, April 19, 2024

కుంబ్లే 10 వికెట్ల ప్రదర్శనకు 24 ఏళ్లు

ముంబై: భారత లెజెండరీ స్పిన్నర్‌, మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాడు. వాటిలో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ప్రదర్శన ఎన్నటికీ మర్చిపోలేనిది. సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఫిబ్రవరి 7) అతను పాకిస్తాన్‌పై పది వికెట్లతో చెలరేగాడు. పాకిస్తాన్‌తో దిల్లీలో 1999లో జరిగిన రెండో టెస్టులో కుంబ్లే కేవలం 74 రన్స్‌ ఇచ్చి 10 వికెట్లు నేలకూల్చాడు. అతను వేసిన 26.3 ఓవర్లలో 9 మెయిడెన్‌ ఓవర్లు ఉన్నాయి. దాంతో, 212 పరుగుల తేడాతో ఇండియా పాకిస్తాన్‌ను చిత్తు చేసి సిరీస్‌ సమం చేసింది. చెన్నైలో జరిగిన మొదటి టెస్టులో పాక్‌ 12 పరుగులతో గెలిచింది. కీలకమైన రెండో టెస్టులో టీమిండియా, పాక్‌ ముందు 420 పరుగుల లక్ష్యం ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో కుంబ్లే ఒక్కడే 10 వికెట్లు తీసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ లెజెండరీ స్పిన్నర్‌ అరుదైన ఫీట్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ మంగళవారం ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. ఈ ఘనత సాధించిన మొదటి భారత క్రికెటర్‌గా ఈ లెగ్‌ స్పిన్నర్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఇంగ్లండ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ జిమ్‌ లాకెర్‌ తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా కుంబ్లే రికార్డు సృష్టించాడు. లాకెర్‌ 1956లో ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాపై 53 పరుగులు ఇచ్చి 10 వికెట్లు కూల్చాడు. న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ రెండేళ్ల క్రితం పది వికెట్ల క్లబ్‌లో చేరాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో అతనొక్కడే పదికి పది వికెట్లు పడగొట్టాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img