Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చెమటోడ్చిన కోహ్లీ, రాహుల్‌

ఇండోర్‌:
బోర్డర్‌ -గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టు ఆడేందుకు ఇండోర్‌ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. రెండు మ్యాచుల్లోనూ విఫలమైన కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ నెట్స్‌లో చెమటోడ్చారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టుల్లో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా మూడో మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసింది. కోహ్లీ, రాహుల్‌ తోపాటు పుజారా, శ్రేయాస్‌ అయ్యర్‌, యంగ్‌స్టర్స్‌ ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌ కూడా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. పేసర్లు సిరాజ్‌, షమీ, రంజీ ట్రోఫీ ఫైనల్‌ అనంతరం జట్టుతో కలిసిన జయదేవ్‌ ఉనాద్కత్‌లు నెట్స్‌లో వికెట్లు లక్ష్యంగా బంతులు వేశారు. భారత్‌`ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇండోర్‌ వేదికగా మార్చి 1న మూడో టెస్టు జరగనుంది. మొదటి రెండు మ్యాచుల్లోనూ ఘోర పరాభవం చెందిన ఆస్ట్రేలియా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే మూడో టెస్టులో ఆ జట్టు బ్యాటర్లు జడేజా, అశ్విన్‌ స్పిన్‌ దాడిని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. భారత పర్యటనను తేలికగా తీసుకున్న ఆస్ట్రేలియా రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిపోయింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ చెలరేగడంతో నాగ్‌పూర్‌ టెస్టులో ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దిల్లీ టెస్టులోనూ స్పిన్‌ ఉచ్చులో పడిన ఆ జట్టును ఐదు వికెట్ల తేడాతో భారత్‌ చిత్తు చేసింది. దాంతో, ఇండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది.
కమిన్స్‌, వార్నర్‌ లేకుండానే…
కీలక మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఎల్బో గాయంతో స్వదేశానికి పయనమయ్యాడు. స్టార్‌ పేసర్‌ హేజిల్‌వుడ్‌ కూడా సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. కెప్టెన్‌ కమిన్స్‌ కుటుంబ కారణాల వల్ల అర్థాంతరంగా స్వదేశానికి బయలుదేరాడు. అతను అక్కడే ఉండిపోవాల్సి రావడంతో వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మూడో టెస్టులో జట్టును నడిపించనున్నాడు. గాయంతో నాగ్‌పూర్‌, దిల్లీ టెస్టుకు అందుబాటులో లేని ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కామెరూన్‌ ఇండోర్‌ టెస్టులో ఆడే అవకాశం ఉంది. ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img