Friday, April 19, 2024
Friday, April 19, 2024

టెస్ట్‌, వన్డే కెప్టెన్సీ కూడా వదిలేస్తాడేమో!

న్యూదిల్లీ : బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించేందుకు ఇటీవల టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్‌ కోహ్లి.. వన్డే, టెస్ట్‌ బాధ్యతలు వదులుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. టీ20 ప్రపంచకప్‌తో కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగియగా, కోహ్లి టీ20 ఫార్మాట్‌ కెప్టెన్‌గా తప్పుకున్నాడు. భారత జట్టు హెడ్‌ కోచ్‌గా పదవి కాలం పూర్తి చేసుకున్న రవిశాస్త్రి ఈమధ్య పలు జాతీయ చానెల్స్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు.
కెప్టెన్సీ వదులుకోవచ్చు..
‘కోహ్లి కెప్టెన్సీలోని భారత జట్టు టెస్టుల్లో ఐదేళ్లుగా టాప్‌ పొజిషన్‌లో ఉంది. మానసికంగా అలసిపోతేనో లేదంటే తన బ్యాటింగ్‌పై మరింత ఫోకస్‌ పెట్టాలని అనుకున్నప్పుడు భవిష్యత్తులో తను టెస్ట్‌ కెప్టెన్సీ కూడా వదులుకుంటాడు. గతంలోనూ చాలామంది సక్సెస్‌ఫుల్‌ ప్లేయర్లు జట్టుకు ఉపయోగపడేలా బ్యాటింగ్‌ చేసేందుకు కెప్టెన్సీని వదులుకున్నారు. విరాట్‌లో ఇప్పటికీ ఆడాలనే కసి ఉంది. పైగా జట్టులో అందరికంటే ఫిట్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా కొనసాగాలా వద్దా అనేది విరాట్‌ ఇష్టం. కానీ టెస్ట్‌ల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగితే మంచిది. ఎందుకంటే ఈ ఫార్మాట్‌కు కోహ్లి కంటే గొప్ప అంబాసిడర్‌ మరొకరు లేరు’అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.
కెప్టెన్‌ పాత్ర ఏం ఉండదు..
కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టీమ్‌ ఎంపిక విషయంలో ఎవరి మాట పట్టించుకోడని, దాంతో కోహ్లీ-శాస్త్రి టీమ్‌గా మారిందని చాలా ఆరోపణలున్నాయని ప్రశ్నించగా.. శాస్త్రి తనదైన శైలిలో బదులిచ్చాడు. 15 మంది సభ్యులను సెలెక్టర్లే ఎంపిక చేస్తారని, ఇందులో కెప్టెన్‌ పాత్ర ఏం ఉండదని స్పష్టం చేశాడు. అయితే ఇలాంటి వార్తలను తాను అస్సలు పట్టించుకోనని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత వైఫల్యానికి తీరిక లేని షెడ్యూల్‌ ఓ కారణమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభిస్తే ఫలితం మరోలా ఉండేదన్నాడు.
ఓటమి సహించరు..
భారత్‌లో క్రికెట్‌ను మతంలా ఆరాధిస్తారని, ఓటమిని ఏ మాత్రం సహించరని శాస్త్రి తెలిపాడు. ‘భారత్‌లో క్రికెట్‌ ఓ మతంలాంటిది. వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి ఒక్కదాంట్లో ఓడినా ఇక్కడి ప్రజలు సహించరు. తమ పెన్స్‌ను తుపాకుల్లా ఎత్తిపెడుతారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. మేం వరుసగా విజయాలు సాధించి ఓడిపోయేసరికి తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఇష్టం వచ్చినట్లు రాశారు. నాకు విరాట్‌ కోహ్లీ మధ్య గొడవలు ఉన్నట్లు ప్రచారం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వచ్చే ఇలాంటి వార్తలను నేను అస్సలు పట్టించుకోను. నేను వాటిని చదవను కూడా. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం జరిగింది అనేది మాకు మాత్రమే తెలుసు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించుకొని రాసుకుంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు.’అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img