Friday, April 19, 2024
Friday, April 19, 2024

పాంచ్‌ పటాకా

షూటింగ్‌లో స్వర్ణం అ జావెలిన్‌ త్రోలో స్వర్ణం, రజతం, కాంస్యం అ డిస్కస్‌త్రోలో వెండి

టోక్యో: జపాన్‌ వేదికగా జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్‌ 2020లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా సోమవారం మహిళల షూటింగ్‌ విభాగంలో భారత్‌ పసిడి పతకాన్ని గెలచుకుంది. ఈ కేటగిరీకి ప్రాతినిథ్యాన్ని వహించిన అవని లేఖరా బంగారు పతకాన్ని సాధించింది. టోక్యోలోని అసాకా షూటింగ్‌ రేంజ్‌లో జరిగిన రౌండ్‌-2, 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో 19 సంవత్సరాల అవని లేఖరా సరికొత్త చరిత్రను సృష్టించింది. 249.6 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచి, బంగారు పతకాన్ని అందుకున్నారు. దీంతో పారాలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో భారత్‌కు పసిడి పతకాన్ని అందించిన ఉమెన్‌ షూటర్‌గా అవని రికార్డు సృష్టించారు. దీంతో రాజస్థాన్‌ ప్రభుత్వం రూ.3 కోట్లు నజరానా ప్రకటించింది. కాగా.. 248.9 పాయింట్లతో చైనాకు చెందిన క్యూపింగ్‌ రaాంగ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. జావెలిన్‌ త్రోలో కూడా భారత్‌కు గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. జావెలిన్‌ త్రోలో భారత అథ్లెట్‌ సుమిత్‌ అంటిల్‌ స్వర్ణం సాధించాడు. జావెలిన్‌ త్రోలో ఈటెను 68.55 మీటర్ల దూరం విసిరి పసిడి సొంతం చేసుకున్నాడు. మెన్స్‌ జావెలిన్‌ త్రో ఎఫ్‌64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్‌ సుమిత్‌.. ప్రపంచ రికార్డు త్రోలతో గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు. ఇదే పోటీలో ఉన్న మరో భారత అథ్లెట్‌ సందీప్‌ కూడా అత్యధికంగా 62.20 మీటర్ల దూరం ఈటెను విసిరి తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సుమిత్‌ అంటిల్‌ తన మొదటి ప్రయత్నంలోనే ఈటెను 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్ల దూరంను ఈటెను సుమిత్‌ విసిరాడు. ఇక తన ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐదో అటెంప్ట్‌లో ఈ ఫీట్‌ సాధించడం ద్వారా సుమిత్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదే ఈవెంట్‌లో పోటీపడిన మరో భారత పారా అథ్లెట్‌ సందీప్‌ చౌదరీ అత్యుత్తమంగా 62.03 మీటర్లు ఈటెను విసిరి.. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నిజానికి భారత పారా అథ్లెట్లు పారాలింపిక్స్‌ 2020లో సాధించింది 8 పతకాలు. అయితే డిజేబిలిటీ క్లాసిఫికేషన్‌లో వినోద్‌ కుమార్‌ అనర్హుడిగా తేలింది. దాంతో అతనికి దక్కిన కాంస్య పతకాన్ని పారాలింపిక్స్‌ 2020 నిర్వాహకులు రద్దు చేశారు. దాంతో పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మళ్లీ ఏడుకి చేరింది.
జావెలిన్‌ త్రోలో రెండు పతకాలు
జావెలిన్‌ త్రో ఎఫ్‌46 విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. ఈ కేటగిరీకి ప్రాతినిధ్యం వహించిన దేవేంద్ర జజారియా, సుందర్‌ సింగ్‌ వరుస పతకాలను అందుకున్నారు. దేవేంద్ర జజారియా రజతాన్ని సొంతం చేసుకోగా.. సుందర్‌ సింగ్‌ కాంస్యాన్ని అందుకున్నాడు. దేవేంద్ర జజారియా 64.35 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను సంధించాడు. సుందర్‌ సింగ్‌ అతని కంటే కాస్త తక్కువ అంటే 64.01 మీటర్ల దూరం పాటు బల్లెన్ని విసిరాడు. ఈ కేటగిరిలో శ్రీలంక బంగారు పతకాన్ని ముద్దాడిరది.
డిస్కస్‌ త్రోలో యోగేష్‌కు సిల్వర్‌
డిస్కస్‌త్రో విభాగంలో అథ్లెట్‌ యోగేష్‌ కాతునియా సిల్వర్‌ పతకం సాధించి భారత్‌ సత్తాను చాటాడు. డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో యోగేష్‌ కాతునియా 44.38 మీటర్లు డిస్కస్‌ను విసిరాడు. అయితే బ్రెజిల్‌కు చెందిన ప్రపంచ రికార్డు హోల్డర్‌ బాతిస్తా డాస్‌ శాంటోస్‌ క్లాడినీ 45.9 మీటర్లు మేరా డిస్కస్‌ విసిరి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.
పతకాల పట్టికలో…
కాగా టోక్యో పారాలింపిక్స్‌ 2020లో భారత్‌ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఓ కాంస్య పతకం సాధించి పతకాల పట్టికలో 26వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో చైనా 119 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
రాష్ట్రపతి, ప్రధాని హర్షం..
ఈ తాజా విజయాలతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజేతలను అభినందించారు. కోట్లాదిమంది యువతకు స్ఫూర్తి ఇచ్చారని ప్రశంసించారు. ఈ స్ఫూర్తి చిరకాలం నిలిచి ఉంటుందని కితాబిచ్చారు. మరెందరికో ఆదర్శప్రాయులుగా నిలిచారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img