Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోరాటం ఆగదు

రెజ్లర్లు సాక్షి, బజరంగ్‌ స్పష్టీకరణ

న్యూదిల్లీ: న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఒలింపిక్‌ పతక విజేతలు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా సోమవారం స్పష్టంచేశారు. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు. పోరాటం నుంచి రెజ్లర్లు ఎవరూ వెనక్కి తగ్గేది లేదని, అలాంటి ఆలోచన కూడా తమకు లేదని చెప్పారు. ‘మేము పోరాటం నుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు. న్యాయం కోసం జరుగుతున్న పోరాటం నుంచి ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడం లేదు. ఆ ఆలోచన కూడా లేదు. సత్యాగ్రహంతో పాటు రైల్వేలో నా బాధ్యతలు నేను నేరవేరుస్తాను. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తాం. దయచేసి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయవద్దు’ అని సాక్షి మాలిక్‌ ట్వీట్‌ చేశారు. రెజ్లర్ల ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు వార్తలు రావడంపై ఆమె స్పందించారు. బజరంగ్‌ పునియా కూడా ఇదే తరహాలో ట్వీట్‌ చేశారు. తాము ఎఫ్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా బూటకమని ఆయన స్పష్టంచేశారు. ‘ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా ఊహాగానాలు మాత్రమే. మాకు హాని చేయడానికే ఇలాంటి వార్తలు వ్యాప్తి చేస్తున్నారు. ఉద్యమం గురించి మాకు పునరాలోచన లేదు. వెనక్కి తగ్గడం లేదు. మహిళా రెజ్లర్లు ఎఫ్‌ఐఆర్‌ వెనక్కి తీసుకున్నారన్న వార్త కూడా నిరాధారం. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుంది’ అని బజరంగ్‌ తేల్చిచెప్పారు. లైంగిక ఆరోపణలపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ బజరంగ్‌, సాక్షి, వినేశ్‌ ఫొగట్‌ సహా రెజ్లర్లు సుదీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img