Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

‘ఫార్ములా ఈ కార్‌ రేస్‌’ విజయవంతం

హైదరాబాద్‌: కళ్లు మూసి తెరిచేలోగా దూసుకుపోయే కార్లు… క్షణ క్షణానికి మారుతున్న ఆధిక్యత.. నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డ రేసర్లు…వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసు’ లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్‌ రేసు విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్‌ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో ‘డీఎన్‌ పెన్స్‌కె రేసింగ్‌’ డ్రైవర్‌ జీన్‌ ఎరిక్‌ వెర్గ్‌నే విజేతగా నిలిచాడు. రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు. విజేతలకు మంత్రి కేటీఆర్‌ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసౌకర్యానికి మన్నించాలని హైదరాబాద్‌ నగరవాసులను విజ్ఞప్తి చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్‌ సుమారు గంటన్నర పాటు సాగింది. భారత్‌ లో ఇటువంటి రేసు జరగడం ఇదే ప్రథమం. నిన్న ముగిసిన ప్రాక్టీస్‌ సెషన్‌ లో దూసుకెళ్లిన రేసర్లు అసలు పోరులో వెనుకబడ్డారు. మాజీ ప్రపం చ చాంపియన్‌ అయిన జీన్‌ వెర్గ్‌నే.. నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్‌, ఐమ్యాక్స్‌ పరిసర ప్రాంతాల్లో రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్లాడు. డీఎస్‌ ఈ-టెన్స్‌ ఎఫ్‌ఈ 23 ఎలక్ట్రిక్‌ కారుపై జీన్‌ ఎరిక్‌ తన జోరు చూపాడు. ఇదే పోటీలో తన సహచర డ్రైవర్‌ స్టోఫెల్‌ వాండూర్న్‌ 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ రేస్‌ లో ఎన్విసన్‌ రేసింగ్‌ డ్రైవర్‌ నిక్‌ క్యాసిడే రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌ నుంచి పోటీ పడ్డ మహీంద్ర రేసింగ్‌ టీమ్‌ నుంచి ఇంగ్లాండ్‌ ఆటగాడు ఒలివడర్‌ రొనాల్డ్‌ ఆరో స్థానంలో ఉండగా ఇదే టీమ్‌ కు చెందిన లుకాస్‌ డి గ్రాసి 14వ స్థానిని పరిమితమయ్యాడు. ఈ చాంపియన్‌షిప్‌లో తదుపరి రేస్‌ ఈనెల చివర్లో కేప్‌టౌన్‌ (సౌతాఫ్రికా) వేదికగా జరుగనుంది.
తరలివచ్చిన తారలు : హైదరాబాద్‌లో రేస్‌ చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌తో పాటు సినీ ప్రముఖులు రామ్‌ చరణ్‌, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ హాజరయ్యారు. వీరితో పాటు సచిన్‌, చాహల్‌, ధావన్‌ తదితరులు ఫార్ములా ఈ రేసు వీక్షించారు. కాగా కార్ల వేగం… ప్రేక్షకుల కేరింతలతో సాగరతీరం హోరెత్తిపోయింది.
ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్‌: ఫార్ములా ఈ రేస్‌ పోటీలకు అనేక దేశాలు శాశ్వత నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నాయి. అందులో ప్రధానంగా దిరియా, మెక్సికో సిటీ, బెర్లిన్‌, మొనాకో, రోమ్‌, లండన్‌, జకార్తా, సియోల్‌ వంటి నగరాల్లో ఈ పోటీ ఏటా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక మీదట భారతదేశం నుంచి హైదరాబాద్‌ ఈ నగరాల జాబితాలో చేరనుందని నిర్వాహకులు వెల్లడిరచారు. కాగా ఫార్ములాలో మొత్తం 16 రేసులు నిర్వహిస్తారు. ఒక్కో రేస్‌లో రేసర్‌ పొందిన పాయింట్ల వారీగా సీజన్ల వారీ పాయింట్లు కలిపి, చివరకు ప్రపంచ చాంపియన్‌ను ప్రకటిస్తారు.
పోటీల సందేశం ఇదే…: పెట్రోల్‌ వంటి శిలాజ ఇంధనాలు కాకుండా కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలతో రేస్‌ చేయడమే ‘ఫార్ములా ఈ’ రేసింగ్‌ ప్రత్యేకత. ఎలక్ట్రిక్‌ కార్ల ద్వారా సుస్థిర రవాణాను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో ఈ పోటీలు నిర్వహించేందుకు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీపడినా ఐటీ మంత్రి కేటీఆర్‌ చొరవతో ఈ ప్రతిష్టాత్మక పోటీలు హైదరాబాద్‌ వేదికగా జరగడం విశేషం. 2014 బీజింగ్‌ ఒలింపిక్స్‌ గ్రౌండ్‌ దగ్గర మొట్టమొదటి ‘ఫార్ములా ఈ’ జరిగింది. 2014లో బీజింగ్‌లో ఈ రేస్‌ ప్రారంభం కాగా చివరిసారి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగింది. ఇవాళ హైదరాబాద్‌లో రేసు జరిగింది. ఆ తర్వాత దక్షిణ ఆఫ్రికాలోని కేప్‌ టౌన్‌లో జరుగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img