Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మా బ్యాటర్లకు సలహాలివ్వడానికి సిద్ధం: హెడెన్‌

న్యూదిల్లీ: బోర్డర్‌ -గావస్కర్‌ ట్రోఫీలో భారత స్పిన్నర్ల మాయాజాలానికి బలైపోతున్న ఆసీస్‌ బ్యాటర్లకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆ జట్టు మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ ప్రకటించాడు. కాగా బోర్డర్‌`గవాస్కర్‌ ట్రోఫీలో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లోనూ టీమ్‌ఇండియా ఘన విజయం సాధించి నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆసీస్‌ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఎదుర్కొలేక వికెట్లను సమర్పించుకుంటున్నారు. రెండు టెస్టుల్లో 40 వికెట్లు కోల్పోతే అందులో 32 వికెట్లు అశ్విన్‌, జడేజా పడగొట్టినవే. ఈ నేపథ్యంలో స్పిన్‌ బౌలింగ్‌ ఆడటంలో ఇబ్బందిపడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లకు సూచనలు, సలహాలు అందిస్తానని హెడెన్‌ ముందుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు మేనేజ్‌మెంట్‌ కోరితే 100 శాతం… రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా తాను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. వారికి సమయం కేటాయించినందుకు డబ్బు తీసుకోనని చెప్పాడు. కానీ, ప్రస్తుత తరం ఆటగాళ్లకు పాత తరం ఆటగాళ్ల మధ్య సంబంధాలు మెరుగు పడేలా క్రికెట్‌ ఆస్ట్రేలియా చర్యలు చేపట్టాలని కోరాడు. ప్రస్తుతం మాథ్యూ హెడెన్‌ భారత్‌లోనే ఉన్నాడు. బోర్డర్‌ -గవాస్కర్‌ ట్రోఫీలో వ్యాఖ్యాతగా చేస్తున్నాడు. అతడికి భారత్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవముంది. హెడెన్‌ సేవలను ఆసీస్‌ వినియో గించుకుంటుందో లేదో మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. ఇక, సిరీస్‌ విషయాని కొస్తే.. మార్చి 1 నుంచి ఇండోర్‌ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img