Friday, April 19, 2024
Friday, April 19, 2024

రోహిత్‌, రాహుల్‌… ఫటా..ఫట్‌..!

స్కాట్‌లాండ్‌పై 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం
ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డ కేఎల్‌, శర్మ

దుబాయ్‌ : అఫ్గానిస్థాన్‌పై గెలిచిన ఉత్సాహంలో టీమిండియా స్కాట్‌లాండ్‌పై కూడా అదే ప్రదర్శన కనబంచింది. స్కాట్‌లాండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ 86 పరుగుల అతి తక్కువ లక్ష్యాన్ని ఫట్‌..ఫట్‌లాండిచారు. ఈ క్రమంలోనే రాహుల్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు భారత్‌ టోర్నీలోనే మొట్టమొదటిసారిగా టాస్‌ గెలిచింది. జట్టులో ఒక మార్పు చేశారు. శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో వరుణ్‌ చక్రవర్తి జట్టులో చేరాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన స్కాట్‌లాండ్‌ జట్టు ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగింది.
స్కాట్‌లాండ్‌ ఇన్నింగ్స్‌ను మున్సే, కోయెట్జర్‌ ప్రారంభించారు. టీమిండియా తరపున బుమ్రా బౌలింగ్‌ మొదలుపెట్టాడు. మొదటి ఓవర్‌ చివరి బంతికి మున్సే ఓ భారీ షాట్‌ కొట్టి ఆరు పరుగులు సాధించాడు. రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి స్కాట్‌లాండ్‌ స్కోరు 13కు చేరుకుంది. ఈ క్రమంలోనే కెప్టెన్‌ కోయెట్జర్‌ (1)ను బుమ్రా బౌల్డ్‌ చేసి పెవిలియన్‌ బాట పట్టించాడు. అనంతరం క్రీజులోకి మాథ్యూక్రాస్‌ వచ్చాడు. మరోవైపు ఓపెనర్‌ మున్సే ధాటిగా ఆడసాగాడు. ఓ భారీ షాట్‌ కోసం షమీ బౌలింగ్‌లో యత్నించిన మున్సే (24, 19 బంతులు, 4I4, 1I6) హార్దిక్‌ పాండ్యకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికి రిచీ బెరింగ్టన్‌ (0)ను జడేజా పెవిలియన్‌ బాట పట్టించాడు. అలాగే మ్యాథ్యూ క్రాస్‌(2) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేక పోయాడు. జడేజా బౌలింగ్‌లోనే ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం మక్‌లియొడ్‌, లిస్క్‌ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. అడపా, దడపా సింగిల్స్‌, డబ్బుల్స్‌ తీస్తూ స్కోరు బోర్డును ముందుకు జరిపారు. ఇలాంటి తరుణంలోనే జడేజా మరోసారి చెలరేగాడు. లిస్క్‌ (21, 12 బంతులు, 2I4, 1I6)ను ఎల్‌బీడబ్ల్యూ రూపంలో ఇంటిదారి పట్టించాడు. ఈ దఫా క్రీజులోకి అడుగుపెట్టిన గ్రీవ్స్‌ పరుగులు రాబట్టేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. అశ్విన్‌ బౌలంగ్‌కు వచ్చిన వెంటనే రెండు, మూడు బంతులు ఎదుర్కొన్న గ్రీవ్స్‌ నాలుగో బంతికి భారీ షాట్‌ ఆడాడు. ఆ బంతి కాస్తా లాంగాన్‌లో ఉన్న పాండ్య చేతికి చిక్కడంతో గ్రీవ్స్‌ కథ ముగిసింది. అప్పటికి స్కాట్‌లాండ్‌ స్కోరు 64. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వాట్‌ బౌలర్లను కొంచెం ప్రతిఘటించాడు. దీంతో ఎట్టకేలకు స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. అనంతరం బౌలింగ్‌కు వచ్చిన షమీ మొదటి బంతికే మక్‌లియొడ్‌ (16, 28 బంతులు) బౌల్డ్‌ రూపంలో పెవిలియన్‌ బాట పట్టాడు. షరీఫ్‌ (0)ను ఇషాన్‌ కిషన్‌ రనౌట్‌ చేశాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు హ్యాట్రిక్‌ బాల్‌ దక్కింది. తరువాత వచ్చిన వారు ప్రభావం చూపకపోవడంతో స్కాట్‌లాండ్‌ 85 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. టీమిండియా బౌలర్లలో షమీకి 3, జడేజాకు 3, బుమ్రాకు 2, అశ్విన్‌కు ఒక వికెట్‌ దక్కింది. స్కాట్‌లాండ్‌ జట్టులో మున్సే, లిస్క్‌, మక్‌లియొడ్‌, వాట్‌ తప్ప మిగతావారంతా సింగిల్స్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.
86 పరుగుల విజయ లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. మొదటి మూడు బంతులకు ఒక్కొక్క పరుగు తీసిన రోహిత్‌, రాహుల్‌, ఐదో బంతిని రోహిత్‌ బౌండరీకి తరలించాడు. రెండో ఓవర్‌లో రెండో బంతిని రాహుల్‌ బౌండరీకి తరలించాడు. అనంతరం బ్యాక్‌టు బ్యాక్‌ ఫోర్లు, సిక్స్‌లతో స్కాట్‌లాండ్‌ బౌలర్లపై రాహుల్‌ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ (30, 16 బంతులు 4I5, 1I6) వేల్‌ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటికి టీమిండియా స్కోరు 70. వాట్‌ బౌలింగ్‌లో ఒక పరుగు తీసి రాహుల్‌ తన అర్ధసెంచరీని చేరుకున్నాడు. మరో భారీ షాట్‌ కొట్టిన రాహుల్‌ ఈ దఫా లాంగాన్‌లో మక్‌లియొడ్‌ క్యాచ్‌ పట్టి పెవిలియన్‌ బాట పట్టించాడు. మొత్తంగా 19 బంతుల్లో 4I6, 3I6లతో కేఎల్‌ రాహుల్‌ 50 పరుగులు చేశాడు. చివర్లో సూర్యకుమార్‌ యాదవ్‌ సిక్స్‌ కొట్టడంతో భారత్‌ గెలుపుబాట పట్టింది. స్కాట్‌లాండ్‌ బౌలింగ్‌లో వాట్‌కు, వీల్‌కు చెరో వికెట్‌ దక్కాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img