Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వార్నర్‌ విధ్వంసం

వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

అబుదాబి : డేవిడ్‌ వార్నర్‌(56 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 నాటౌట్‌) అజేయ హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ దశను విజయంతో ముగించింది. వెస్టిం డీస్‌తో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 44), ఎవిన్‌ లూయిస్‌(26 బంతుల్లో 5 ఫోర్లతో 29) రాణించగా.. చివర్లో ఆండ్రీ రస్సెల్‌(7 బంతుల్లో ఫోర్‌, 2 సిక్సర్లతో 18 నాటౌట్‌) కీలక పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్‌ హజెల్‌ వుడ్‌(4/39) నాలుగు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించగా.. ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌ తలో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా వార్నర్‌ విధ్వంసంతో 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 161 రన్స్‌ చేసి 22 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకున్నారు. వార్నర్‌కు అండగా మిచెల్‌ మార్ష్‌(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. విండీస్‌ బౌలర్లలో అకీల్‌ హోసెన్‌ ఓ వికెట్‌ తీయగా.. తన చివరి మ్యాచ్‌లో తన ఓవర్‌ చివరి బంతికి గేల్‌ మరో వికెట్‌ పడగొట్టాడు. ఈ విజయంతో ఆసీస్‌ తమ సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. గ్రూప్‌ 1 పాయింట్స్‌ టేబుల్లో ఇంగ్లండ్‌ (8 పాయింట్లు) టాప్‌లో ఉండగా ఆసీస్‌ కూడా 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ తేడాతో గెలిస్తే సెమీస్‌ చేరుతుంది. 158 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. విండీస్‌ బౌలర్‌ అకీల్‌ హుస్సేన్‌ బౌలింగ్‌ లో ఫించ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అయితే, డేవిడ్‌ వార్నర్‌ తో కలిసిన మిచెల్‌ మార్ష్‌ మరో వికెట్‌ పడకుండా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ను ముందుండి నడిపించాడు. ఈ ఇద్దరూ విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌ రెండో వికెట్‌ కు 124 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడిరచారు. అయితే, విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో మిచెల్‌ మార్ష్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. మిచెల్‌ మార్ష్‌ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి క్రిస్‌ గేల్‌ బౌలింగ్‌లో జాసన్‌ హోల్డర్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత విజయ లాంఛనాన్ని డేవిడ్‌ వార్నర్‌ పూర్తి చేశాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img