Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దిగ్గజ అంపైర్‌ రూడీ కోయెర్ట్‌జెన్‌ మృతి

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాకు చెందిన దిగ్గజ క్రికెట్‌ అంపైర్‌ రూడీ కోయెర్ట్‌జెన్‌ (73) మృతి చెందారు. మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు స్థానిక వెబ్‌సైట్‌ వెల్లడిరచింది. కోయెర్ట్‌జెన్‌ దాదాపు 400 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు అంపైర్‌గా పనిచేశారు. 1990-2010 మధ్య కాలంలో గొప్ప అంపైర్‌గా పేరుగాంచారు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. తన తండ్రి మరణవార్తను రూడి కోయెర్ట్‌జెన్‌ జూనియర్‌ ధ్రువీకరించారు. వెబ్‌సైట్‌ కథనం ప్రకారం… రివర్స్‌డేల్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కోయెర్ట్‌జెన్‌ సహా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కేప్‌టౌన్‌లో గోల్ఫ్‌ వీకెండ్‌ ముగించుకొని, ఇంటికి తిరుగు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కోయెర్ట్‌జెన్‌ మృతి పట్ల అనేకమంది ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అంపైర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. కోయెర్ట్‌జెన్‌ 2002లో ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌లో చోటు సంపాదించారు. దాదాపు ఎనిమిదేళ్లు ఈ హోదాలో కొనసాగారు. తన కెరీర్‌లో 397 మ్యాచ్‌లకు ఆన్‌ ఫీల్డ్‌, టీవీ అంపైర్‌గా ఉన్నారు. ఇందులో 128 టెస్టులు, 250 వన్డేలు, 19 టీ-20లు ఉన్నాయి. ఆయన 2010లో అంపైరింగ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ మధ్య జరిగిన టెస్ట్‌లో చివరిసారి అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ దిగ్గజ అంపైర్‌ కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన 2007 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వెలుతురు సరిగా లేకున్నా నిర్వహించారన్న ఆరోపణ ఉంది. ఐసీసీ నిబంధనను అతిక్రమించిన కారణంగా, అదే ఏడాది తన సొంత దేశంలో జరిగిన తొలి టీ-20 ప్రపంచ కప్‌లో కోయెర్ట్‌జెన్‌ను ఐసీసీ పక్కనబెట్టింది.
ఎంతో గొప్ప వ్యక్తి: సెహ్వాగ్‌
కోయెర్ట్‌జెన్‌ మరణవార్త గురించి తెలిసిన వెంటనే టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించాడు. దిగ్గజ అంపైర్‌కు నివాళులు అర్పించాడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపాడు. ఆయనతో తనకు గొప్ప అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నాడు. తానెప్పుడైనా ర్యాష్‌ షాట్‌ ఆడినప్పుడు తనను కోప్పడేవారని, తెలివిగా ఆడాలని హెచ్చరించేవారని పేర్కొన్నాడు. తన బ్యాటింగును చూడాలని అనుకుంటున్నానని అన్నారని గుర్తు చేసుకున్నాడు. ఆయన చాలా మంచి, గొప్ప వ్యక్తని కొనియాడాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img