Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఆర్చరీలో పసిడి కాంతులు

స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం
హంగ్జౌ: చైనా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. గురువారం మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ టీమ్‌ విభాగంలో భారత ఆర్చర్లు జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్‌ కౌర్‌ బృందం స్వర్ణ పతకం గెల్చుకున్నారు. ఇదే విభాగంలో పురుషుల జట్టు కూడా పసిడి పతకం గెలవడం విశేషం. ప్రవీణ్‌ ఒజాస్‌, అభిషేక్‌ వర్మ, ప్రథమేష్‌ సమాధాన్‌ జావ్‌కర్‌ బృందం దక్షిణ కొరియా జట్టుని 235-230 తేడాతో ఓడిరచింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో భారత బృందం చైనీస్‌ తైపీ జట్టుపై 234-224 తేడాతో గెలుపొంది ఫైనల్‌కు చేరింది. కాగా స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో హరీందర్‌పాల్‌, దీపిక పల్లికల్‌ జంట మలేషియాపై 11-10, 11-10 తేడాతో గెలిచి పసిడి పతకాన్ని అందుకుంది. ఇక సీనియర్‌ స్క్వాష్‌ ప్లేయర్‌ సౌరభ్‌ ఘోషల్‌ పురుషుల సింగిల్స్‌లో రజత పతకం సాధించాడు. 37 ఏళ్ల సౌరభ్‌ ఫైనల్‌లో యియాన్‌ వో (మలేసియా) చేతిలో 11-9, 9-11, 5-11, 7-11 తేడాతో ఓటమిపాల య్యాడు. తొలి గేమ్‌లో విజయం సాధించిన సౌరభ్‌… తర్వాత పట్టు తప్పి వరుసగా మూడు గేమ్‌ల్లో ఓడిపోవడంతో రజతంతో సరిపెట్టుకున్నాడు.
మహిళల హాకీలో నిరాశ
భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌లో చైనా చేతిలో ఓటమిపాలైంది. భారత్‌ 0-4 తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. దీంతో అక్టోబర్‌ 7న జరిగే కాంస్య పతక పోరులో జపాన్‌ లేదా దక్షిణా కొరియాతో తలపడాల్సి ఉంటుంది. మరో వైపు భారత పురుషుల కబడ్డీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్‌ దశలోని నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. జపాన్‌తో జరిగిన తమ చివరి గ్రూప్‌ దశ మ్యాచ్‌లో భారత్‌ 56-30 తేడాతో విజయం సాధించింది. శుక్రవారం జరిగే సెమీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img