ఐఎంఏ అసోసియేషన్ ప్రకటన
విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల 9వ తేదీన కొలకత్తా లోని డ్యూటీ నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు తమ నిరసనను తీవ్రతరం చేశారు. ఈ సందర్భంగా భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) ధర్మవరం శాఖ అధ్యక్షులు డాక్టర్ జయ కుమార్, కార్యదర్శి డాక్టర్ వాసుదేవ రెడ్డి, కోశాధికారి డాక్టర్ మదన్మోహన్, పూర్వపు రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈనెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి 18 వ తేదీ ఉదయం 9 గంటల వరకు దాడి, హత్య ఘటన దృష్ట్యా నల్ల బ్యాడ్జితో నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసులు అరెస్టు చేశారని, ఆ నిందితున్ని కఠిన శిక్షలు వేసే విధంగా న్యాయస్థానాలు చొరవ చూపాలని తెలిపారు. తాము 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేత కార్యక్రమం విజయవంతమైందని, ఈ విజయవంతముకు సహాయ, సహకారాలు తోడ్పాటు అందించిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులకు, సిబ్బందికి, ఇతరులకు పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ హామీ మేరకు తమ సమ్మెను నిలిపివేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర స్థాయిలో వైద్యుల ప్రత్యేక రక్షణ చట్టాన్ని వెంటనే ప్రకటించాలని తెలిపారు. మున్ముందు వైద్యులకు భద్రత, రక్షణ లేకపోతే తీవ్రంగా పోరాటాలను సలుపుతామని తెలిపారు. అంతేకాకుండా 24 గంటల పాటు తాము చేసిన కార్యక్రమానికి ప్రజలు మద్దతు కూడా రావడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. తామున్నది రోగుల ప్రాణాలను కాపాడడానికేనని మరోసారి వారు గుర్తు చేశారు. దేశంలో ఎక్కడైనా సరే మరోసారి మున్ముందు ఇలాంటి సంఘటనలు జరిగితే భారతీయ వైద్య సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటూ, పోరాటాలు సలుపుతూ, న్యాయాన్ని చేకూర్చుతామని తెలిపారు.