సేవల్లో స్వచ్చంధ సంస్థల భాగస్వామ్యం పెరగాలి
వాకర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఘన సత్కారం
విశాలాంధ్ర – శ్రీకాకుళం : జిల్లాలో స్వచ్చంధ సంస్థలు, అధికారులు, రెడ్‌క్రాస్ సిబ్బంది సహకారంతో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడం తనకు ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. రెడ్ క్రాస్ ద్వారా విశిష్ట సేవలందించినందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నుంచి బంగారు పతకాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో బుధవారం వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛం అందజేసి దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్చంద సేవా సంస్థలు,వాకర్స్ ఇంటర్నేషనల్ పరిధిలో ఉన్న క్లబ్స్ అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని చెప్పారు. రెడ్‌క్రాస్ ద్వారా సేవలు మరింత విస్తౄతం చేయాలని, నిరాశ్రయులను, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే నిజమైన సంతౄప్తి ఉంటుందని అన్నారు. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్త నిల్వల సేకరణ, తలసేమియా, క్షయ, కుష్టు రోగులకు సేవలు అందించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 36 అంశాలపై సామాజిక సేవా కార్యక్రమాలు చేసే ఘనత శ్రీకాకుళం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకే దక్కిందన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సేవకులు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని స్ఫూర్తిదాయకమైన సామాజిక సేవలు చేసేందుకు స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు, మానవతావాదులు ముందుకు వచ్చి శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ శాఖ కు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ ను అభినందించిన వారిలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరా ప్రసాద్, కె.వి రమణమూర్తి, గుడ్ల సత్యన్నారాయణ, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎస్. జోగినాయుడు, బి.వి రవిశంకర్, బి. దేవీప్రసాద్, ఆర్టీసీ పీఆర్ ఒ బీఎల్‌పీ రావు,పి.పృద్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.