Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

సీతమ్మపేట,పార్వతీపురం ఐటిడిఎలలో ఘనంగా జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర,పార్వతీపురం: గిరిజన ఉత్పాదకాల మార్కెటింగ్ కు సహకారం అందిస్తామని విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళ వారం పార్వతీపురం మన్యం జిల్లాలో మొదటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు సీతంపేటలోను మంగళ వారం ఘనంగా జరగగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.పర్యాటక, ఉద్యాన, గృహ నిర్మాణ సంస్థ, ఇందిరా క్రాంతి పథకం, జీసీసి తదితర శాఖలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ గిరిజన సంప్రదాయం, ఆచారాలు తెలిసే విధంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. అంతకు ముందు వేడుకలకు హాజరైన అతిథులకు గిరిజన సంప్రదాయాల మేరకు ఆహ్వానం పలికారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాతపట్టణం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య సవర నృత్యంలో పాల్గొని ఉత్సాహ పరిచారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య గిరిజన సాంప్రదాయంలో అలంకరణ చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. భోరున కురుస్తున్న వర్షం కూడా కార్యక్రమం ఘనంగా జరిగింది.పార్వతీపురం, విజయనగరం, బొబ్బిలిలో భవనాలు నిర్మించి గిరిజన ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. సీతంపేటలో సూపర్ స్పెషాలటీ ఆసుపత్రి, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేసి గిరిజనులకు అత్యాధునిక వైద్యం అందించుటకు సీఎం చర్యలు చేపట్టారని చెప్పారు.జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుతో గిరిజన ప్రాంత రూపు రేఖలు మారుతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఐటి, టెలికాం రంగాలను అభివృద్ధి చేయుటకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లాలో 95 టవర్స్ రానున్నాయని పేర్కొన్నారు. వైద్య రంగంలో మౌళిక సదుపాయాలు కల్పించడం కోసం రూ.159 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఐటీడీఏల ద్వారా గిరిజనులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు.
ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య మాట్లాడుతూ 20 సబ్ ప్లాన్ మండలాల్లో 35 వేల మందికి కొండ పోడు పట్టాలు జారీ చేశామన్నారు. చిరు అటవీ ఉత్పత్తులను వన్ ధన్ వికాస్ కేంద్రాలు ద్వారా మార్కెటింగకు చర్యలు చేపట్టామని తెలిపారు. గిరిజన ఉత్పత్తులను ప్యాకింగ్, బ్రాండింగ్ చేయుటకు సంబంధిత సంస్థ ద్వారా ఆమోదం పొందడం జరిగిందన్నారు. దీనికి రూ.50 లక్షలు నిధులు రానున్నాయని చెప్పారు.
ఈకార్యక్రమంలో పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జి. మురళి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, గృహ నిర్మాణ సంస్థ ఇఇ రమేష్, గిరిజన సంఘం నాయకులు బిడ్డిక తేజేశ్వర రావు, ఆరికి మన్మధ రావు, కె.కాంతారావు, జెడ్పీటీసీ సవర లక్ష్మి,జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు సవర లక్ష్మి, ఏఎంసి చైర్మన్ హెచ్.మోహన రావు, ఎం.పి.పి బి.ఆదినారాయణ, మండల ఉపాధ్యక్షులు కె.సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పార్వతీపురం ఐటిడిఎ లో జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆనంద్ అధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు పాల్గొని ప్రభుత్వం గిరిజనులకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు గూర్చి వివరించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ కిరణ్ కుమార్ అధికారులు, గిరిజన సంఘాల నేతలు,ప్రజాప్రతినిదులు, గిరిజనులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రెండు ఐటీడీఏ లలో వివిధ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టు కున్నాయి. ఇటీవల పదో తరగతి, ఇంటర్ పరీక్షలో అత్యుత్తమ మార్కులు పొందిన గిరిజనవిద్యార్థులకు సత్కారాలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img