Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నేత్రదాన అంగీకార ప‌త్రం అంద‌జేసిన‌ క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

నేత్రదాన పక్షోత్సవాలలో స్ఫూర్తి గా నిలిచిన కలెక్టర్

విశాలాంధ్ర విజ‌య‌న‌గ‌రం ః నేత్రదాన పక్షోత్సవాలలో విజయనగరం కలెక్టర్ సూర్యకుమారి ఎంతోమందికి స్ఫూర్తి గా నిలిచారు.నేత్రదానం చేయాలని పిలుపునివ్వడంతో పాటు ఆమె తన నేత్రాలను దానం చేసేందుకు అంగీకార పత్రం కూడా వైధ్యాధికారులకు అందజేశారు.
జిల్లా అంధ‌త్వ నివార‌ణ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన నేత్ర‌దాన ప‌క్షోత్స‌వాల‌ను గురువారం సూర్యకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల్లో క‌న్నా నేత్ర దానం గొప్ప‌ద‌ని, ఇత‌రుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేత్ర దాన ఆవశ్య‌క‌త‌ను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల‌న్నారు. ఈ ప్ర‌క్రియ‌పై అపోహ‌లు వీడి మాన‌వ‌తా దృక్ప‌థంతో అంద‌రూ ముందుకు రావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. చ‌నిపోయిన త‌ర్వాత క‌ళ్లు ఇవ్వ‌టం ద్వారా మ‌రో ఇద్ద‌రికి కొత్త జీవితాల‌ను ప్ర‌సాదించ‌వ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. నేత్ర దాన ఆవ‌శ్య‌క‌త‌ను తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా అవ‌గాహ‌న ర్యాలీలు, స‌ద‌స్సులు పెట్ట‌నున్నామ‌ని పేర్కొన్నారు. ప‌క్షోత్స‌వాలు వ‌చ్చే నెల 8వ తారీఖు వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం కావాల‌ని క‌లెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం వైద్యారోగ్య శాఖ సిబ్బంది, కంటి వెలుగు విభాగ వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, సార‌థి వెల్పేర్ అసోసియేష‌న్ స‌భ్యులు, విద్యార్థులు క‌లెక్ట‌రేట్ నుంచి పెద్దాసుప‌త్రి వర‌కు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్‌తో పాటు జిల్లా అంధ‌త్వ నివార‌ణ అధికారి డా. బి. శివ‌ప్ర‌సాద్‌, కంటి వెలుగు విభాగ అధికారి డా. తార‌కేశ్వ‌ర‌రావు, ఇత‌ర వైద్యాధికారులు, పుష్ప‌గిరి ఆసుప‌త్రి వైద్య సిబ్బంది, సార‌థి వెల్పేర్ అసోసియేష‌న్ స‌భ్యులు, ఏఎన్ఎంలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

నేత్రదాన అంగీకార పత్రంపై సంతకం చేస్తున్న కలెక్టర్

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img