Friday, April 19, 2024
Friday, April 19, 2024

దలాయిపేటగ్రామాన్ని  సందర్శించిన జిల్లా కలెక్టర్

ఏనుగులు తరలింపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

విశాలాంధ్ర,పార్వతీపురం/కొమరాడ: మన్యం జిల్లాలోని కొమరాడ మండలం దలాయిపేటలో ఏనుగుల సంచార ప్రదేశాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ఏనుగులవలన పంట నష్టం జరుగుతోందని, ప్రాణభయంఉందని
ఆప్రాంతవాసులు గతకొన్ని రోజులుగా తెలియ జేస్తుండటంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సందర్శించారు. గ్రామస్తులు ఏనుగులను తరలించుటలో సహకారాన్ని అందించాలని కోరారు.పంట నష్టం సకాలంలో వచ్చేఏర్పాటుచేయాలని అధికారులని ఆదేశించారు. అటవీశాఖ, వ్యవసాయ, ఉద్యానశాఖ సంయుక్తంగా పరిశీలించడంవలన కొద్దిగా జాప్యం జరుగుతోందని దానిని నివారించుటకు ప్రయత్నిస్తామని కలెక్టర్ తెలిపారు. ఏనుగుల తరలింపుకు తగుచర్యలు తీసుకుంటామన్నారు. ఏనుగుల సమస్య లేకుండా అన్నిచర్యలు తీసుకొనుటకు ప్రయత్నిస్తున్నామన్నారు. అటవీశాఖ అధికారులు అందిస్తున్న సమాచారాన్ని పాటించాలని, ఏనుగులను టీజింగ్ చేయరాదని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.కురుపాం అటవీ రేంజర్ మరియు ఏనుగుల పునరావాస కేంద్రంఇంఛార్జి ఆర్.రాజబాబు మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక నుండి నిపుణులైన మావటివారు, శిక్షణ పొందిన ఏనుగులు రావల్సిఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించామని పంపినట్లు తెలిపారు.చందలాడవద్ద పునరావాస కేంద్రం ఏర్పాటుకుకూడా గతంలోనే ప్రతిపాదనలు సమర్పించామన్నారు.ప్రజలకు ఎప్పటికప్పుడు ఏనుగుల సమాచారం అందించుటకు 24గంటలు పనిచేసే రెండు బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు.విద్యుత్, పోలీస్, రైల్వే అధికారులకు సమాచారం బదిలీ చేస్తూ నిత్యం అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పారు. పంటనష్టానికి సంబంధించి రూ.9 లక్షలు పెండింగులో ఉందని తెలిపారు. ఏనుగులవల్ల జరిగే నిరంతరం జరిగే నష్టపరిహారాన్ని చెల్లించడంతోపాటు ఈప్రాంతం నుండి ఏనుగులతరలింపు చేసి ఆదుకోవాలని రైతులు కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు.ఈపర్యటనలో అటవీఅధికారి అవతారం, ఇతరసిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img