Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలుచేయాలి

ఓటింగు విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించాలి:
శిక్షణా సమావేశంలో జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర, పార్వతీపురం/పార్వతీపురం టౌన్: ఈనెల 13న జరగనున్న శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలలో నిబంధనలు పక్కాగా అమలుచేయాలని, ఓటింగువిధానంపై ఓటర్లకు ముందుగానే అవగాహన కల్పించాలని జిల్లాకలెక్టరు నిశాంత్ కుమార్ పోలింగు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలోగురువారం పోలింగు అధికారులకు , సహాయ పోలింగు అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈశిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఎన్నికలను నిబంధనలను పక్కాగా అనుసరించి, వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సు నిర్వహణను సంపూర్ణంగా తెలుసుకోవాలని, ముందుగానే దానిపై పూర్తిగా అబ్యాసన చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో అనుమానాలుంటే ముందుగానే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు.పోలింగు కేంద్రానికి పాలింగు అధికారులు ముందురోజే చేరుకోవాలని, పోలింగు కేంద్రంవద్దనే అధికారులు ఏర్పాటుచేసిన వసతిలోనే బసచేయాలని, వారికి వసతి ఏర్పాట్లు తహశీల్దారు చేస్తారని చెప్పారు.స్థానికులనుండి ఎటువంటి వసతి,ఆతిధ్యం స్వీకరించకూడదని తెలిపారు.ముందురోజే పోలింగు కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, ఉదయం 6.30కు పోలింగుకు సిద్దం కావాలన్నారు. 8గంటలకు పోలింగు ప్రారంభించి సాయంత్రం 4గంటలకు ముగించాలన్నారు. పోలింగు ఏజెంట్లు నిర్ణీత సమయంలోగా హాజరుకావాలని తెలిపారు. పోలింగు ఏజెంట్లకు
అభ్యర్థులు ఇచ్చిన లెటరు, వారిగుర్తింపు సరిచూసుకోవాలన్నారు. పోలింగు కేంద్రంలో ఏజెంట్లు వారికి కేటాయించిన స్థానంలోనే ఉండాలని, అటుయిటు తిరగకూడదన్నారు. పోలింగు బూత్ లోనికి అనుమతిలేకుండా యితర సిబ్బంది, పోలీసు అధికారులు ప్రవేశించకూడదని తెలిపారు. ఎన్నికల కమిషన్ తెలియజేసిన ఏదేని గుర్తింపు కార్డును ఓటర్లు తీసుకొని రావాలని, గుర్తింపు కార్డులేని వారిని ఓటువేయుటకు అనుమతించడం జరగదని తెలిపారు. పట్టభద్రుల శాసనమండలి ఓటింగు విధానం సాదారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుందని, ఓటు వేసేందుకు సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుందని, కావున దీనిపై ఓటర్లకు ముందుగానే అవగాహన కల్పిస్తే, ఓటరుకు ఓటింగు సమయం ఆదా అవుతుందని తెలిపారు. పోలింగు కేంద్రంలోనికి సెల్ ఫోన్లు, నిషేదిత వస్తువులు తీసురాకుండా చూడాలన్నారు. ఓటర్లు పోలింగు సిబ్బంది అందజేసిన పెన్నుతోనే ఓటు వేయాలని, స్వంత పెన్నులు, స్కెచ్ లు వినియోగించరాదన్నారు. దృష్టిలోపం గల ఓటరు ఎవరైనా సహాయకులతో వస్తే, వారినుండి డిక్లరేషను తీసుకొని అనుతించాలని తెలిపారు. పోలింగు ప్రక్రియ మొత్తం నిబంధనల ప్రకారం పూర్తిచేయాలని, ఎక్కడా మొహమాటానికి తావులేకుండా పనిచేయాలని తెలిపారు. జిల్లారెవిన్యూ అధికారి జె. వెంకటరావు పోలింగు అదికారులకు పోలింగు ప్రక్రియపై శిక్షణ యిచ్చారు. బ్యాలెట్ బాక్సు వినియోగం, బ్యాలెట్ పేపరు మడతపెట్టే విధానం, పోలింగు ప్రక్రియపై అధికారుల సందేహాలను నివృత్తి చేసారు. ఈశిక్షణా కార్యక్రమంలో రెవిన్యూ డివిజినల్ అధికారి కె.హేమలత, పోలింగు అధికారులు, సహాయ పోలింగు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img