Friday, September 30, 2022
Friday, September 30, 2022

శిక్షణతో మత్స్యకారుల జీవితాలు మారాలి

జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్

విశాలాంధ్ర – శ్రీకాకుళం : ఎం.ఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా పొందే శిక్షణతో మత్స్యకారుల జీవితాలు మారాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మత్స్యకార బృందానికి పిలుపునిచ్చారు. మంగళవారం తమిళనాడులోని పూంపుహార్ ప్రాంతంలో గల ఫిష్ ఫర్ ఆల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నందు శిక్షణ పొందేందుకు 33 మందితో బృందం బయలుదేరింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శిమ్మ నేతాజీతో కలిసి బస్సుకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందనున్న మత్స్యకారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ జాతీయస్థాయిలో మత్య్సకారుల శిక్షణ నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ఇదే ప్రథమం అని, ఇటువంటి అవకాశం శ్రీకాకుళం జిల్లాకు లభించడం గర్వకారణమన్నారు. దీనివలన మిగిలిన అనుబంధ రంగాలైన వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, ఉద్యానవనం వంటి శాఖల శిక్షణకు స్పూర్తికావాలన్నారు. ఎం.ఎస్.స్వామినాధన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇచ్చే వారం రోజుల శిక్షణతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ముఖ్యంగా 20 ఏళ్ల తదుపరి మత్స్యకారుల జీవితాలు ఏవిధంగా ఉండబోతున్నాయో శిక్షణ పొందనున్న మత్స్యకారులు తెలుసుకోబోతున్నారని కలెక్టర్ తెలిపారు. శిక్షణను శిక్షణ మాదిరిగా కాకుండా మీలో ఉండే ప్రతిభను వెలికితీసేలా వ్యవహరించాలన్నారు. జిల్లా తరుపున వెళుతున్న 33 మంది బృందం జిల్లా ప్రతిభను మరింత ఇనుమడింపజేయాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. శిక్షణ పొందిన వారు మిగిలిన వారికి శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉన్నందున క్షుణ్ణంగా తెలుసుకొనిరావాలని, తద్వారా జిల్లా అంతటా వ్యాపించి జిల్లా రోల్ మోడల్ కావాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శిక్షణ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img